Lions Day Awareness: సింహాల గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
ABN , Publish Date - Aug 10 , 2025 | 10:18 AM
సింహం.. అడవికి రారాజు.. ధైర్యసాహసాలకు మారుపేరు. వేటాడటంలో దీని నైపుణ్యమే వేరు. బాల్యంలో కథా వస్తువుగా నిలిచే ఈ మృగరాజు ఆఫ్రికన్ దేశాల్లో హవా చాటుకుంటున్నా మనదేశంలో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది.
» నేడు సింహాల దినోత్సవం.. తిరుపతి జూ పార్క్‌లో సింహాల సందర్శన
» ఎస్వీ జూపార్క్‌లో 10 సింహాలు.. ఐదు మగ, ఐదు ఆడ సింహాలు
» సింహాల సంరక్షణలో భాగస్వామ్యం.. జూ పార్క్ ఆహారం మరియు ఖర్చులు
» ఏటా రూ.4.85 లక్షలు చెల్లించి దత్తత తీసుకోండి
» సింహాలు అడవిలో 14 సంవత్సరాలు, జూపార్క్‌లో 20 సంవత్సరాలు బతుకుతాయి
మంగళం , ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): సింహం(Lion).. అడవికి రారాజు.. ధైర్యసాహసాలకు మారుపేరు. వేటాడటంలో దీని నైపుణ్యమే వేరు. బాల్యంలో కథా వస్తువుగా నిలిచే ఈ మృగరాజు ఆఫ్రికన్ దేశాల్లో హవా చాటుకుంటున్నా మనదేశంలో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది. గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాల అడవుల్లో మాత్రమే ఉనికి చాటుకుంటోంది. ఐదేళ్ల క్రితం నాటికి 674 సింహాలు మాత్రమే ఉన్నట్లు లెక్క తేలింది. మన రాష్ట్రంలో ప్రదర్శన శాలలకు, సర్కస్‌లో వినోదానికి పరిమితమవుతోంది. ఆదివారం సింహాల దినోత్సవం సందర్భంగా తిరుపతి ఎస్వీ జూపార్క్‌లోని సింహాల గురించి తెలుసుకుందాం..
జూ పార్కులో (Zoo Park) పది సింహాలున్నాయి. వీటిలో ఐదు మగవి, ఐదు ఆడవి. వీటిలో బయట ఎన్‌క్లోజర్‌లో రెండు ఆడ, ఒక మగ సింహం ఉన్నాయి. లయన్స్ సఫారీలో నాలుగు ఆడవి, మూడు మగవి ఉన్నాయి. 2001లో సర్కస్ నుంచి తీసుకువచ్చిన 87 సింహాలలో వయసు పైబడి 86 చనిపోయాయి. వీటిలో ఒక్కటి మాత్రమే సజీవంగా ఉంది. ఈ మృగరాజుల సాధారణ వయసు 24 ఏళ్లు. అడవిలో ఉండేవి 14 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. జూ పార్కుల్లో సింహం 20 సంవత్సరాలకు పైగా బతుకుతుంది. సర్కస్ నుంచి తీసుకువచ్చిన సింహాలకు పుట్టినవే ఇప్పుడు జూ పార్కులో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
సఫారీ సందర్శనకు వాహనాలు
జూపార్కులో సింహాల సఫారీలోని వెళ్లే సందర్శకుల కోసం ఆరు వాహనాలను ఏర్పాటు చేశారు.పెద్దలకు రూ. 50, చిన్న పిల్లలకు రూ. 30గా టికెట్ వసూలు చేస్తున్నారు. ఈ వాహనంలో ప్రయాణిస్తూ సింహాలను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉంటుంది. సింహాలు సందర్శకులపై దాడి చేయకుండా ఈ వాహనాలను కట్టుదిట్టమైన ఇనుప కంబీలతో ఏర్పాటు చేశారు.
రోజువారీ ఆహారమిలా..
జూపార్కులో సింహాలకు రోజూ అర లీటరు పాలు, ఐదు నుంచి ఆరు కేజీల బీఫ్, రెండు కేజీల చికెన్, రెండు కోడిగుడ్లు వంతున ఆహారంగా అందిస్తున్నారు. వీటి సంరక్షణలో జంతు ప్రేమికులను భాగస్వాములుగా చేయడానికి అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. దత్తత తీసుకునేందుకు ఆహ్వానం పలుకుతోంది. రోజుకు అయ్యే ఖర్చు రూ.1,330, వారానికి రూ.9,310, నెలకు రూ.39,900, మూడు నెలలకు 1,19,700 ఆరు నెలలకు 5.2,39,400, సంవత్సరానికి రూ.4.85,450 మొత్తాన్ని జూపార్కు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీరు కూడా సింహాల సంరక్షణలో భాగస్వాములయినట్లే.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం
For More AP News and Telugu News