Cruiser Bike Craze: కుర్రకారు.. క్రూయిజర్ బైక్స్ క్రేజ్
ABN , Publish Date - Aug 10 , 2025 | 08:04 AM
విజయవాడ క్రూయిజర్ బైక్స్ అమ్మకాలకు ప్రధాన కేంద్రంగా మారింది. రాష్ట్రంలోనే ఒక్క విజయవాడలోనే ఇలాంటి షోరూమ్‌లు ఏర్పాటయ్యాయి. ఈ బైక్స్ కొనుగోలుకు జనం క్యూ కడుతున్నారు. ఒకప్పుడు పట్టణ యువత మాత్రమే ఆసక్తి చూపగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఖరీదైన క్రూయిజర్ బైక్స్‌పై మోజు పెంచుతున్నారు.
» హార్లే డేవిడ్ సన్, బీఎండబ్ల్యూ, కవాసాకి బైకుల సందడి
» రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుంచే అమ్మకాలు
» సర్వీసు సెంటర్లు కూడా అందుబాటులో..
» రూ.2 లక్షల-రూ.45 లక్షల వరకు మోడళ్లు
» యూనిక్ కస్టమైజేషన్ నచ్చినట్టుగా తయారీ
» బెజవాడ కేంద్రంగా బైక్స్ షోరూమ్‌లు
» క్రూయిజర్స్ హోరు.. కుర్రకారు జోరు..!
» విజయవాడ కేంద్రంగా షోరూమ్‌లు ఏర్పాటు
రాయల్ ఎన్ ఫీల్డ్, హార్లే డేవిడ్ సన్, కవాసాకి, బీఎండబ్ల్యూ.. మెట్రోపాలిటన్ సిటీల్లో మాత్రమే కనిపించే ఈ హై ఎండ్ బైకులు (High End Bikes) ఇప్పుడు నగరంలో కూడా హాయ్ చెబుతున్నాయి. ఈ బైక్ షోరూమ్‌లు ఇప్పుడు రాజధాని సిటీకి కూడా వచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుంచే ఈ బైకులు సరఫరా అవుతుండగా, మచిలీపట్నం, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు వంటి పట్టణాలకూ ఈ మోజు పెరిగిందంటే యువత ఎంత వేగాన్ని కోరుకుంటుందో అర్థమవుతుంది. వీటి ధరలు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉన్నా సేల్స్ ఏ మాత్రం తగ్గకపోవడం కుర్రకారు క్రేజ్‌ను తెలియజేస్తోంది.
ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ: విజయవాడ క్రూయిజర్ బైక్స్ (Cruiser Bike Craze Vijayawada) అమ్మకాలకు ప్రధాన కేంద్రంగా మారింది. రాష్ట్రంలోనే ఒక్క విజయవాడలోనే ఇలాంటి షోరూమ్‌లు ఏర్పాటయ్యాయి. ఈ బైక్స్ కొనుగోలుకు జనం క్యూ కడుతున్నారు. ఒకప్పుడు పట్టణ యువత మాత్రమే ఆసక్తి చూపగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఖరీదైన క్రూయిజర్ బైక్స్‌పై మోజు పెంచుతున్నారు. ప్రతి షోరూమ్ నెలకు 25 బైక్స్‌ను విక్రయిస్తోంది. ఏడాదిగా అమ్మకాలు ఆశాజనకంగా ఉండటంతో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లగ్జరీ కారుకు మించిన ధర ఉన్నప్పటికీ, యువత వీటిని కొనేందుకు వెనుకాడటం లేదు. ఒంటరిగా ప్రాంతాలను చుట్టడం, వేగంగా, సురక్షితంగా గమ్యం చేరాలనే ఆలోచన ఉన్న యువతను ఈ బైక్స్ ఆకట్టుకుంటున్నాయి.
హెవీ ఇంజన్, హై కెపాసిటీ, ఏబీఎస్ బ్రేక్ సిస్టమ్, రేసింగ్ కంఫర్ట్, యూనిక్ హ్యాండిల్, వీ ట్విన్ ఇంజన్లు, కస్టమైజేషన్ సౌలభ్యం వీటి ప్రత్యేకతలు. రైడర్ గుండె చప్పుడుకు కనెక్ట్ అయ్యేలా తయారైన ఈ బైక్స్ విజయవాడలో అమిత ఆదరణ పొందుతున్నాయి. ఆటోమొబైల్ హబ్‌గా ఉన్న విజయవాడలో హార్లే డేవిడ్ సన్, కవాసకీ, బీఎండబ్ల్యూ షోరూమ్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇతర చోట్ల సర్వీస్ సెంటర్స్ లేవు, విజయవాడ నుంచే రాష్ట్రమంతా సరఫరా జరుగుతోంది. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు కూడా ఈ క్రేజ్ విస్త రించింది. రాయల్ ఎన్ ఫీల్డు కూడా యువతతో పాటు మధ్య వయస్కుల్లోనూ ఆదరణ పెరుగుతోంది. హార్లే డేవిడ్ సన్ బైక్ కొనుగోలు చేసిన వారు ఆటో మేటిక్‌గా 'హెచ్‌వోజీ' వాట్సాప్ గ్రూపులో చేరతారు. ఈ గ్రూపు దక్షిణ భారత యాత్రలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ యాత్రల కోసం ఏర్పాటైంది. సభ్యులు పరిచయం చేసుకుని, యాత్రలు ప్రారంభిస్తారు. హిమాలయాల యాత్ర, స్వాతంత్య్ర దినోత్సవ యాత్రలు వంటివి జరుగుతాయి.
సవారీ కోసం హార్లీ..
హార్లే బైక్స్ ధరలు చూస్తే హెచ్ 440 (440 సీసీ) రూ.2.39 లక్షలు, నైట్‌స్టార్ (975 సీసీ) రూ.17 లక్షలు, స్పోర్ట్స్ స్టార్ (1250 సీసీ) రూ.20 లక్షలు, ఫాట్ బాబ్ (1250 సీసీ) రూ.39లక్షలు, ఫాట్ బాయ్ రూ.32 లక్షలు, సాఫ్ట్ టూర్ రూ. 45 లక్షలు. నెలకు సగటున 25 బైక్స్ విక్రయమవుతున్నాయి.
కవాసకీ బైక్స్
క్రూయిజర్స్ అమ్మకాల్లో ఇది కూడా అగ్ర స్థానంలో ఉంది. విజయవాడ షోరూమ్ నుంచి నెలకు 30 బైక్స్ విక్రయమవు న్నాయి. ధరలు: డబ్ల్యూ175 (174 సీసీ) రూ,1.22 లక్షలు ఎక్స్ 300 (296సీసీ) రూ.3.75 లక్షలు, నింజా 650 (649 సీసీ) 7.27 లక్షలు, నింజా 4ఆర్ఆర్ (399 సీసీ) రూ.9.42 లక్షలు, జెడెహెచ్2 (998 సీసీ) రూ.23.48 లక్షలు, నింజా ఎస్ఈ (998 సీసీ) రూ.32.95.
బీఎండబ్ల్యూ టూర్ ట్రిప్ పార్టీస్
బీఎండబ్ల్యూ అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. 310 సీసీ స్పోర్ట్స్ వేరియంట్ రూ.3.98 లక్షలకు అందుబాటులో ఉంది. ఎఫ్ 900 (90 సీసీ) రూ.18 లక్షలకు హైదరాబాద్ నుంచి సరఫరా అవుతోంది. ఈ ఏడాది సంక్రాంతి వరకు అమ్మకాలు జరిగాయి, ఆ తర్వాత ఆరు నెలల్లో అమ్మకాలు లేవు. అమ్మకాలు పెంచేందుకు టూర్ ట్రిప్ పార్టీలు నిర్వహిస్తున్నారు. త్వరలో స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం
For More AP News and Telugu News