Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:11 PM
తనకు పార్టీ, రాయచోటి నియోజకవర్గ ప్రజలు రెండు కళ్లలాంటివని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయచోటి విషయంలో బాధ పడుతున్నట్లు సీఎం చంద్రబాబు కూడా చెప్పారని పేర్కొన్నారు.
విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన (సోమవారం) మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రులకు, అధికారులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. కేబినెట్ భేటీలో రాయచోటి మార్పుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో రాయచోటి జిల్లా మార్పుపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Rama Prasad Reddy) ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కేబినెట్ సమావేశం అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రి మండిపల్లి.
తనకు పార్టీ, రాయచోటి నియోజకవర్గ ప్రజలు రెండు కళ్లలాంటివని వ్యాఖ్యానించారు. రాయచోటి విషయంలో బాధ పడుతున్నట్లు సీఎం చంద్రబాబు కూడా చెప్పారని పేర్కొన్నారు. అక్కడ ఉన్న మూడు నియోజకవర్గ పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయని వివరించారు. రైల్వేకోడూరు ప్రజలు తిరుపతిని, రాజంపేట ప్రజలు కడపను కోరుకోవడంతో.. రాయచోటి ఏకాకి అయ్యిందని చెప్పుకొచ్చారు. నవంబర్ 27వ తేదీన వచ్చిన గెజిట్‌లో ఎక్కడ కూడా జిల్లా కేంద్రం మార్పు లేదని చెప్పుకొచ్చారు. తమకు స్వార్థం ఉంటే.. ఆరోజే రాయచోటి జిల్లాను మార్చే వాళ్లమని తెలిపారు. ఈ ముప్పై రోజుల్లో రాయచోటి జిల్లా మార్పు ప్రస్తావన రాలేదని తెలిపారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
చివరి రెండు రోజుల్లో ఆ రెండు నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. రాయచోటికి నిజంగా అన్యాయమే జరిగిందని, అయినా.. అన్ని విధాలా అబివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రాయచోటిపై ప్రేమ ఉంది కాబట్టే.. తనకు మంత్రి పదవి ఇచ్చానని, కొన్ని అనివార్య కారణాలతో మార్పు తప్పలేదని సీఎం చంద్రబాబు తెలిపారని అన్నారు. అయితే ఇప్పటికీ కూడా తనకు రాయచోటి జిల్లాపై ఆశ పోలేదని.. తమ ప్రజల కోరిక మేరకు రాయచోటి జిల్లాను మార్చకుండా ఉండాలనే కోరుతున్నానని తెలిపారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
ఎన్నో దశాబ్దాలుగా తనకు, తమ కుటుంబానికి రాయచోటితో ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. తనకు అండగా నిలిచిన ప్రజలు, జేఏసీ నేతలు, తెలుగుదేశం కార్యకర్తలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గ ప్రజలు భావోద్వేగంతో ఉన్నారని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది వారిని రెచ్చగొట్టే ధోరణితో తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో జిల్లాల పునర్విభజన సమయంలో చాలా ఇబ్బందులు వచ్చాయని గుర్తుచేశారు. తాము అప్పుడు ఎలాంటి రాజకీయం చేయలేదని.. బాధను అర్ధం చేసుకున్నానని తెలిపారు. వారి లాగా తాను విమర్శలు చేయనని అన్నారు. రాయచోటి ప్రజలకు మంచి జరగాలనే తాను కోరుకుంటున్నానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ.. అభివృద్ధి బాధ్యత నాదే..
ఏపీ కేబినెట్‌లో 24 అంశాలపై చర్చ.. జిల్లాల పునర్వవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్
Read Latest AP News And Telugu News