Share News

TG: కాంగ్రెస్‌, బీజేపీ చెరో ఎనిమిది కారు జీరో

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:21 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏకంగా ఏడు స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్‌ కోల్పోయింది.

TG:  కాంగ్రెస్‌, బీజేపీ చెరో ఎనిమిది కారు జీరో

గులాబీ ఓట్లు బీజేపీకి బదిలీ.. 7 చోట్ల బీఆర్‌ఎస్‌ డిపాజిట్లు గల్లంతు

తెలంగాణ తెచ్చిన పార్టీ! పదేళ్లపాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీ! గత ఎన్నికల్లో ‘సారు.. కారు.. పదహారు’ అని నినదించిన పార్టీ! ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ‘జీరో’ అయిపోయింది! ‘మగాడివైతే ఒక్కటంటే ఒక్క సీటు తెచ్చుకో’ అని సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేసినట్లే.. ఒక్క చోటా గెలవలేకపోయింది! ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి! అందుకే బీజేపీ అనూహ్యంగా ఎనిమిదిచోట్ల విజయం సాధించింది! పాలమూరులో ఓడినా ఎనిమిది సీట్లతో కాంగ్రెస్‌ పరువు దక్కించుకుంది!

  • బీజేపీ బలం రెట్టింపు.. హైదరాబాద్‌లో మజ్లిస్‌దే హవా

  • నల్లగొండలో కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ.. రాష్ట్రంలోనే రికార్డు

  • రెండోసారి గెలిచిన కిషన్‌రెడ్డి, సంజయ్‌, అర్వింద్‌

  • మెదక్‌లోనూ కారు బోల్తా.. 14 చోట్ల మూడో స్థానం

  • రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు తగ్గిన 51 లక్షల ఓట్లు

  • కంటోన్మెంట్‌ అసెంబ్లీ సీటు కాంగ్రెస్‌దే

  • గులాబీ పార్టీకి తగ్గిన 51 లక్షల ఓట్లు

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏకంగా ఏడు స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్‌ కోల్పోయింది. ముక్కోణపు పోటీలో కేవలం రెండు చోట్ల (ఖమ్మం, మహబూబాబాద్‌) మాత్రమే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. నిజామాబాద్‌, జహీరాబాద్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయారు. మొత్తంగా 14 చోట్ల గులాబీ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది.


హైదరాబాద్‌లో ఏకంగా నాలుగో స్థానానికి దిగజారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పరంగా కూడా బీఆర్‌ఎస్‌ దారుణంగా దెబ్బతిన్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లలో సగం కూడా తెచ్చుకోలేకపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలను గెలచుకున్న బీఆర్‌ఎస్‌.. మొత్తం పోలైన ఓట్లలో 37.35 శాతంతో 87,53 లక్షల ఓట్లు సాధించింది. కానీ, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 16.68 శాతంతో దాదాపు 36.38 లక్షల ఓట్లకే పరిమితమైంది. కొద్ది నెలల వ్యవధిలోనే ఏకంగా 60 శాతం ఓట్లు (51.48 లక్షలు) కోల్పోయింది. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో.. తొలిసారిగా ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి నెలకొంది.


మెదక్‌లోనూ మూడోస్థానమే..

ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ తన ప్రభావాన్ని చూపిన మెదక్‌ పార్లమెంటు పరిధిలో కూడా కారు బోల్తా కొట్టింది. ఈ స్థానంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ.. అక్కడ కూడా బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికే పరిమితమైంది. ఈ పార్లమెంటు పరిధిలోని గజ్వేల్‌ అసెంబ్లీకి పార్టీ అధినేత కేసీఆర్‌, సిద్దిపేటకు సీనియర్‌ నేత హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో గులాబీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అన్ని ప్రయత్నించింది. కానీ, ఆ ఇద్దరు నేతల ప్రభావం కూడా అక్కడ పనిచేయలేదు. ఎన్నికల వేళ ముమ్మర ప్రచారం చేయడంతోపాటు రోడ్డుషోలు చేపట్టినప్పటికీ.. ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. మెదక్‌ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 చోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఒక చోట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉండగా.. ఎంపీగా మాత్రం ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపించారు.


ఇక మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోనైతే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నా.. మూడోస్థానమే మిగిలింది. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కించుకోలేకపోవడంతో గులాబీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. పైగా, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా సిటింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. తాజాగా ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ దక్కించుకోవడంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య మరింత తగ్గింది.

Updated Date - Jun 05 , 2024 | 04:21 AM