Share News

Bhatti Vikramarka: 30 రోజుల ప్రజాపాలనపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 07 , 2024 | 06:43 PM

కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) ప్రశ్నించారు. ఆదివారం నాడు వైరా మండలం స్థానాల లక్ష్మీపురం గ్రామంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ‘‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరాం. సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయొద్దు’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti Vikramarka: 30 రోజుల ప్రజాపాలనపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

ఖమ్మం: కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) ప్రశ్నించారు. ఆదివారం నాడు వైరా మండలం స్థానాల లక్ష్మీపురం గ్రామంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ‘‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరాం. సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయొద్దు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎం లాగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు వ్యాఖ్యలు వరకే పరిమితమయ్యరని చర్యలు శూన్యమన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో దోపిడీ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం ప్రకారమే మోదీ, అమిత్ షా లు మాట్లాడి ఉండవచ్చు. కేంద్రంలో ఉన్న బీజేపీ దగ్గర కాళేశ్వరం దోపిడి గురించి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ కుమ్మక్కయ్యారు కాబట్టే కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది’’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంపై శ్వేత పత్రం విడుదల చేశాం

‘‘రాష్ట్ర బీజేపీ నాయకులు బాధ్యత లేనట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల నగదు జమ, నోట్ల రద్దు సమయంలో బయటికి తీస్తానన్న నల్లధనం గురించి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మోసం మోసమని బతికే బీజేపీ లాగా కాంగ్రెస్ ఉండదు. రాష్ట్రంలో చిన్నభిన్నంగా ఉన్న పాలన వ్యవస్థను గాడిలో పెట్టి జవాబుదారి పాలన అందిస్తున్నాం. గత ఐదేళ్ల నుంచి ఉద్యోగులు 21వ తేదీ వరకు జీతాలు తీసుకున్న దుస్థితి నుంచి మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే ఆర్థిక స్థితిని మెరుగుపరిచాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అరాచకత్వంపై శ్వేత పత్రం విడుదల చేశాం. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా జెన్కో, ట్రాన్స్ కో, డిస్కంలో ఉన్న అప్పులను బయట పెట్టాం. వ్యవసాయ శాఖపై సమీక్ష చేసి ప్రజలకు జవాబుదారీగా భూసార పరీక్షలు పెంచి రైతులకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండే విధంగా సమయాత్తం చేశాం. కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట లక్ష కోట్లు అప్పు తెచ్చి అధోగతి పాలు చేసిన ఆ ప్రాజెక్టు గురించి వాస్తవాలు బయట పెట్టాం. మిషన్ భగీరథలో జరిగిన అవకతవకలపై నివేదిక తయారవుతున్నది త్వరలో బయటపెడతాం. పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి అతిపెద్ద సవాల్‌గా మారిన డ్రగ్స్ నిరోధానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఆ శాఖ కావాల్సిన నిధులను మంజూరు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 6.50 కోట్ల మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలకు సాయాన్ని పెంచి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.


ఆ పరీక్షల నిర్వహణకు చర్యలు

‘‘విద్యా వైద్య ఉపాధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రణాళిక సంఘాన్ని తిరిగి పునరుద్ధరణ చేశాం.. ఆ శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారిని సెక్రటరీగా నియమించాం. ఆర్ధిక వనరులను సక్రమంగా ప్రణాళిక బద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వెచ్చించడానికి నాంది పలికాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పైరవీలు ప్రశ్నాపత్రాలు లీకవ్వకుండా పకడ్బందీగా టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహణకు చర్యలు చేపట్టాం. నిరుద్యోగ యువతకు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అనుగుణంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సంక్షేమ రంగంపై ఇందిరమ్మ ప్రభుత్వం లోతైన అధ్యయనం చేస్తున్నది ఇంక్లూసివ్ గ్రోత్లోకి ప్రజలను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛ స్వాతంత్రం ఒత్తిడి లేని పాలన అందిస్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి ఉదాహరణ లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా గుర్తించాం. పైరవీకారులు తాబేదారులకు లొంగకుండా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా 30 రోజులు ప్రజాపాలన అందించింది. ప్రజలు ఇచ్చిన ఈ పదవులను హోదాగా కాకుండా బాధ్యతగా స్వీకరించి పారదర్శకంగా జవాబుదారీగా ప్రజాపాలన చేస్తున్నాం. ఆరు గ్యారెంటీల హామీల అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించాం. రాష్ట్రంలో విద్యా వైద్యం బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేసి విద్యార్థులందరికీ ప్రపంచీకరణలో భాగంగా పెరుగుతున్న పోటీ తత్వాన్ని ఎదుర్కొనే విధంగా వృత్తిపరమైన కోర్సులు తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం సంకల్పిస్తుంది. ప్రజల అవసరాలు తీర్చే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు తీసుకువస్తాం’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 06:43 PM