Share News

Hyderabad: తీర్పుకు వేళాయె..

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:49 AM

హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది.

Hyderabad: తీర్పుకు వేళాయె..

  • నేడే లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. తొలి అరగంట పోస్టల్‌ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎంలు

  • ఉదయం 8 గంటలకు షురూ.. 4కల్లా పూర్తి ఫలితాలు!

  • మధ్యాహ్నం ఒంటిగంటకు నిజామాబాద్‌ రిజల్ట్‌

  • చివరగా.. హైదరాబాద్‌, నల్లగొండ, కరీంనగర్‌

  • రాష్ట్రవ్యాప్తంగా 34 చోట్ల కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు

  • 21 రోజుల ఉత్కంఠకు తెర.. ఎవరి ధీమా వారిదే!

  • ప్రధాన పార్టీల భవిష్యత్‌ను నిర్దేశించనున్న ఫలితాలు

  • కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక విజేత తేలేదీ నేడే

  • తొలి అరగంట పోస్టల్‌ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎంలు

హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అన్ని లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో కౌంటింగ్‌ సెంటర్లు నెలకొల్పింది. ఓటర్ల సంఖ్య, ఈవీఎం యూనిట్ల ఆధారంగా హైదరాబాద్‌లోనే ఏడు చోట్ల లెక్కింపు జరగనుంది. సికింద్రాబాద్‌కు సంబంధించి ఆరుచోట్ల, ఆదిలాబాద్‌, మల్కాజిగిరిలకు మూడు చోట్ల, మెదక్‌, పెద్దపల్లి నియోజకవర్గాలకు రెండేసి చోట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, భువనగిరి, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, చేవెళ్ల, జహీరాబాద్‌, కరీంనగర్‌లకు ఒక్కోచోట కౌంటింగ్‌ జరగనుంది.


పోస్టల్‌ బ్యాలెట్ల కోసం 19 హాళ్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున, చేవెళ్ల పార్లమెంటు స్థానంలోని మహేశ్వరంలో రెండు హాళ్లు 120 కలుపుకొని మొత్తం 139 హాళ్లు, 1,855 టేబుళ్లను సిద్ధం చేశారు. భద్రతా బలగాల పహారాలో.. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు 144 సెక్షన్‌ అమలుకానుంది. కాగా, రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి 66.3 శాతం పోలింగ్‌ నమోదైంది. 3,32,16,348 మంది ఓటర్లకు గాను 2,20,24,806 మంది ఈవీఎంల ద్వారా, 2,10,771 మంది పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునూ మంగళవారమే చేపట్టనున్నారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం మొదలుకానుంది.


తొలి రౌండ్‌ ఫలితం 9.30కు..

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. తొలి అరగంటలో పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ఉంటుంది. తర్వాత ఈవీఎంలు తెరుస్తారు. మొదటి రౌండ్‌ ఫలితం వెలువడేందుకు గంటరన్నర సమయం పట్టనుంది. ఈవీఎంలను టేబుళ్లపైకి చేర్చడం, లెక్కించడం, సరిపోల్చుకోవడం, రిటర్నింగ్‌ అధికారి నిర్ధారించుకుని ప్రకటించడం వంటి ప్రక్రియలే దీనికి కారణం. ఈ నేపథ్యంలో తొలి రౌండ్‌ ఫలితం 9.30 వరకు వెలువడనుంది. అనంతరం ఒక్కో రౌండ్‌కు 20 నిమిషాల సమయం పట్టే అవకాశముంది. సాయంత్రం 4 గంటల్లోపు పూర్తి ఫలితాలు వస్తాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.


మొదటి ఫలితం నిజామాబాద్‌!

లోక్‌సభ ఎన్నికల్లో మొదటి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంటకు రానుంది. 15 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే నిజామాబాద్‌ నియోజకవర్గం విజేత ఎవరో తొలుత తేలనుంది. 24 రౌండ్ల వంతున లెక్కింపు జరిగే కరీంనగర్‌, నల్లగొండ, హైదరాబాద్‌ ఫలితాలు ఆఖరున రానున్నాయి. చాలా లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు 18 నుంచి 21 రౌండ్లలో పూర్తికానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేసి, వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. వీటిని, ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చుకుంటారు. ప్రతి రౌండ్‌ ఫలితానికి సంబంధించి రాజకీయ పార్టీల ఏజెంట్లు ఫామ్‌ ‘17సీ’పై సంతకం చేయాల్సి ఉంటుంది. అనంతరం రిటర్నింగ్‌ అధికారి సంతకం చేస్తారు. తర్వాత కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఫలితాన్ని ప్రకటిస్తారు.


నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు రౌండ్ల వివరాలు..

ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, చేవెళ్ల, భువనగిరి- 23, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌-22, పెద్దపల్లి, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, ఖమ్మం-21, సికింద్రాబాద్‌-20, వరంగల్‌-18.


సవాళ్ల నడుమ రాజకీయాన్ని మార్చనున్న ఫలితాలు

ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పలుసార్లు రాక.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బస్సు యాత్రతో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరిగాయి. ఈ క్రమంలో ఫలితాలు అన్ని ప్రధాన పార్టీలకు ఎంతో కీలకం. వీటిని బట్టి భవిష్యత్‌ పరిణామాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కచ్చితంగా రెండంకెల సంఖ్యలో సీట్లు సాధిస్తామని అధికార కాంగ్రెస్‌ ఎంతో ధీమాగా ఉంది. ఫలితాలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండమని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రధాని మోదీ కరిష్మానే నమ్ముకున్న బీజేపీ పదికి పైగా సీట్లు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో డీలాపడిన బీఆర్‌ఎస్‌ సైతం మెరుగైన సంఖ్యలో స్థానాలు సాధిస్తామని గట్టిగా చెబుతోంది. కాగా, ఈ లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ సవాళ్లకు వేదికయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఆగస్టు 15 నాటికి చేసి తీరతామని సీఎం రేవంత్‌ ప్రకటించారు. అదే జరిగితే తాను రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ సవాల్‌ విసిరారు.


ఏపీలోనూ..

ఏపీలోనూ కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. రాష్ట్రమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మే 13 తేదీన ఈవీఎంల్లోకి చేరిన జనం తీర్పు మంగళవారం విడుదల కానుంది. ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, నాలుగో విడతలో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 81.86 శాతం పోలింగ్‌ జరిగింది. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్‌ నమోదైంది. మంగళవారం జరిగే కౌంటింగ్‌ కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

Updated Date - Jun 04 , 2024 | 05:14 AM