Share News

సుర్రుమంటున్న సూరీడు!

ABN , Publish Date - May 26 , 2026 | 09:03 AM

కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో జనాలు విలవిల్లాడుతున్నారు. గడచిన మూడురోజుల్లోనే వడదెబ్బతో దాదాపు 100 మంది మృత్యువాత పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి.

సుర్రుమంటున్న సూరీడు!
Hyderabad Temperatures

  • భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

  • వడదెబ్బతో జాగ్రత్త

  • అవసరమైతే తప్ప బయటికి రావొద్దు

  • ఆరోగ్యశాఖ అధికారుల సూచనలు

హైదరాబాద్: కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో జనాలు విలవిల్లాడుతున్నారు. గడచిన మూడురోజుల్లోనే వడదెబ్బతో దాదాపు 100 మంది మృత్యువాత పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవైపు ఉదయం 8 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. దానికి తోడు వడగాడ్పులతో.. పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు సోమవారం నుంచి రోహిణీకార్తె మొదలైంది. ఈ కార్తెలో రోకళ్లు పగిలేలా ఎండలు ఉంటాయని.. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంట్లో ఉక్కపోత, బయటకు వెళ్తే ఎండవేడిమి తట్టుకోలేకా నానా అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో పలుచోట్ల వడదెబ్బ బారిన పడి పలువురు మృతిచెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.


వడగాడ్పులతో జాగ్రత్త సుమా..

మధ్యాహ్నం ఎండల్లో తిరిగితే స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎండ నుంచి వచ్చిన వ్యక్తులను వెంటనే నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి. చల్లని గాలి తగిలేలా ఫ్యాన్‌, కూలర్‌ ముందు కూర్చోబెట్టాలి. ఐస్‌ప్యాక్‌లతో శరీరం అంతా తుడవాలి. శరీరంపై తడివస్త్రం కప్పాలి. అనంతరం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యుడి సలహా మేరకు మెడిసిన్స్‌ ఇవ్వాలి. చల్లటి మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ తాగించాలి. ఇలా చేయడంతో వారు ప్రాణాపాయం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్‌తో అంతా ఆందోళనకరంగా ఉంటుంది. అందుకే ముందుగా జాగ్రత్తలు తీసుకుని వైద్యుల సలహాలతో మందులు తీసుకోవాలి.


city4.2.jpgఉదయం 10 తర్వాత బయటకు వెళ్లొద్దు

ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటలవరకు తప్పనిసరయితే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు ఎండలో తిరగక పోవడమే మంచిది. ఏమాత్రం నీరసంగా ఉన్నా సమీపంలోని ఆస్పత్రికి వెళ్లాలి.

  • డా.హఫీజ్‌, ఫేరోజ్‌గూడ బస్తీ దవాఖాన


చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

ప్రజల దాహార్తి తీర్చడం కోసం స్వచ్ఛంద సంస్థలు ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటుచేయాలి. తీవ్ర ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలి.

  • ఎస్‌హెచ్‌వో నర్సింహారాజు, బాలానగర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..

డెత్‌ స్పాట్‌లుగా హిల్స్‌ రోడ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 26 , 2026 | 09:52 AM