Share News

ఇంకా పెద్దగా ఏడ్చేందుకు సిద్ధంగా ఉండు జగన్‌ రెడ్డీ!

ABN , Publish Date - May 26 , 2026 | 05:33 AM

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై మంత్రి లోకేశ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీపై జగన్‌, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సోమవారం ఎక్స్‌ వేదికగా గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

ఇంకా పెద్దగా ఏడ్చేందుకు సిద్ధంగా ఉండు జగన్‌ రెడ్డీ!

  • త్వరలోనే మరో డీఎస్సీ ఇవ్వబోతున్నాం

  • మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్‌ పోస్టూ భర్తీ చేయలేదు.. ఇప్పుడు ఏడుపెందుకు?.. వైసీపీ అధ్యక్షుడిపై మంత్రి లోకేశ్‌ ధ్వజం

అమరావతి/న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై మంత్రి లోకేశ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీపై జగన్‌, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సోమవారం ఎక్స్‌ వేదికగా గట్టి కౌంటర్‌ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయలేకపోయారని, జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదని, నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారని అన్నారు. తాము మెగా డీఎస్సీతో 16 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేశామని, 10 వేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చామన్నారు. దీంతో మీరు పడుతున్న, బాధ, ఆక్రోశం అర్ధం చేసుకోగలను జగన్‌.. అంటూ లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత పెద్దగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్‌ గారు!’ అని పోస్టులో పేర్కొన్నారు. ‘మీరు టెన్త్‌ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని.. మిగతా అందరూ కూడా అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్‌ లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీని ఆపాలని 200 కేసులు వేశారని, అదేవిధంగా రాష్ట్రానికి గూగుల్‌, టీసీఎస్‌ కంపెనీలు రాకుండా కూడా కేసులు వేయించారని అన్నారు. యువత భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్నారని అన్నారు.


ఢిల్లీ చేరుకున్న లోకేశ్‌

మంత్రి లోకేశ్‌ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు సానా సతీశ్‌, బైరెడ్డి శబరి, జీఎం హరీశ్‌ ఘనస్వాగతం పలికారు. లోకేశ్‌ తన పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రచించిన పుస్తకావిష్కరణ వేడుకలో పాల్గొననున్నారు.

Updated Date - May 26 , 2026 | 05:34 AM