10 నుంచి వడగాలులు
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:47 AM
రాజధాని నగరం చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేది నుంచి వడగాలులకు అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
వాతావరణ కేంద్రం హెచ్చరిక
చెన్నై: రాజధాని నగరం చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేది నుంచి వడగాలులకు అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో, ఏప్రిల్ నుంచే ఎండలు క్రమక్రమంగా పెరగనున్నాయి. ప్రస్తుత వేసవిలో సాధారణం కన్నా అధికంగా వర్షం కురిసే అవకాశముంది. వర్షంతో వాతావరణం కొంతవరకు చల్లబడినా, ఉత్తర, సముద్రతీర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదుకానున్నాయి.
ఈ విషయమై వాతావరణ పరిశోధన కేంద్ర అధికారులు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. 10వ తేది తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతాయన్నారు. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, తిరుపత్తూర్ తదితర జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...
ఎండ తీవ్రత కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తరచూ నీరు తాగడం, శరీరంలో నీటి పరిమాణం తగ్గకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు. ఎండలో అధిక సమయం ఉండరాదని తెలిపారు. సాధారణంగా, ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు సరాసరిన 34.7 డిగ్రీలుండగా, అత్యధికంగా 37.3 డిగ్రీల వరకు ఉంటుందన్నారు. కానీ, ప్రస్తుతం 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దేశంలో డిజిటల్ జనగణన ప్రారంభం
యుద్ధం ప్రభావం ప్రజల మీద పడొద్దు!
Read Latest Telangana News and National News