జాతీయ స్థాయిలో జగన్ ఒంటరి?
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:07 AM
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో ఒంటరయ్యారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్‌డీఏ కోరకముందే మద్దతిస్తున్నా..
నేడు వైసీపీని లెక్కచేయని పార్టీలు
అమరావతి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో ఒంటరయ్యారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన బిల్లును.. ఆ రాష్ట్రానికే చెందిన వైసీపీ తప్ప అన్ని పార్టీలూ సంపూర్ణంగా సమర్థించడం ఆయనకు మింగుడుపడలేదు. బిల్లును వ్యతిరేకించొద్దు.. మద్దతివ్వొద్దన్నది తొలుత వైసీపీ తీసుకున్న నిర్ణయం. అయితే కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు సైతం అమరావతికి మద్దతిస్తూ మాట్లాడడంతో వైసీపీ నాయకత్వానికి దిక్కుతోచలేదు. చివరకు వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును విమర్శిస్తూ వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని గానీ.. ఆ పార్టీ ఎంపీల వాకౌట్‌ను గానీ సభలో ఎవరూ పట్టించుకోలేదు. అసలు అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకురాదని.. ఎన్‌డీఏ అడగకముందే కీలకమైన బిల్లులకు మద్దతిస్తున్న తనను ఇబ్బంది పెట్టేలా, చంద్రబాబుకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించదని జగన్ గట్టిగా భావించారు. అయితే బడ్జెట్ సమావేశాల చరమాంకంలో అకస్మాత్తుగా బిల్లును తెరపైకి తేవడం.. దానికి ముందే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి పంపాలని స్వయంగా ప్రధాని కార్యాలయం (పీఎంవో) రాష్ట్రప్రభుత్వానికి సూచించడం.. ఆగమేఘాలపై కూటమి ప్రభుత్వం అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరచి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం.. శాసనమండలిలో పెట్టనవసరం లేదని తేల్చడం.. ఆ వెంటనే కేంద్రం బిల్లును తీసుకురావడం.. శరవేగంతో జరిగిన ఈ పరిణామాలతో మాజీ సీఎం తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు విలేకరుల సమావేశంలో ఆయన ముఖకవళికలు చెప్పకనే చెప్పాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.