Share News

దేశంలో డిజిటల్‌ జనగణన ప్రారంభం

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:50 AM

దేశంలో మొట్టమొదటి సారిగా పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియ దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బుధవారం...

దేశంలో డిజిటల్‌ జనగణన ప్రారంభం

  • స్వయంగా వివరాలు నమోదు చేసుకున్న రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: దేశంలో మొట్టమొదటి సారిగా పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియ దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమైంది. ఈ స్వీయ నమోదు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా రాష్ట్రపతి తమ కుటుంబ వివరాలు నమోదు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, దేశ ప్రజలందరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వారితో పాటు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన ప్రారంభమైన తొలిరోజే సుమారు 55 వేల కుటుంబాలు స్వీయ నమోదు సదుపాయాన్ని వినిమోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈసారి జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో ఇళ్లను, రెండో దశలో జనాభాను లెక్కిస్తారు. ఈసారి కులగణన కూడా చేపడతారు. డిజిటల్‌ జనగణనలో భాగంగా ప్రజలు స్వయంగా తమ వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 16 భాషాల్లో ఈ పోర్టల్‌, యాప్‌ అందుబాటులో ఉంటుంది. మొదటిదశ జనగణన ప్రక్రియ ఏప్రిల్‌ 1నుంచి సెప్టెంబరు 30 వరకు జరగనుంది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో 30 రోజుల పాటు క్షేత్రస్థాయి సర్వే జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో సర్వేకు ముందు 15 రోజుల పాటు స్వీయ నమోదు ప్రక్రియ ఉంటుంది.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:50 AM