Share News

అర్నబ్ తుఫాన్.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:26 PM

అర్నబ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్‌ సన్నద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ)తో కేంద్ర కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ సమీక్ష నిర్వహించారు.

అర్నబ్ తుఫాన్.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
Cyclone Arnab Alert

ఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్‌ సన్నద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ)తో కేంద్ర కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారనున్న ‘అర్నబ్’.. ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నానికి 650 కిలోమీటర్లు, కాకినాడకు 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 830 కిలోమీటర్లు, బాపట్లకు 910 కిలోమీటర్ల దూరంలో తుఫాన్‌ కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. అక్టోబర్ 28వ తేదీ ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్లు, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


తుఫాన్‌ సన్నద్ధతలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ ప్రాంతాల్లోనూ తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, కోస్ట్‌గార్డ్‌ బలగాలు నౌకలు, విమానాలతో సిద్ధంగా ఉన్నాయి. తుఫాన్‌ నేపథ్యంలో అక్టోబర్‌ 26 నుంచి 29వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తీర ప్రాంతాలకు బోట్లు చేరుకుంటున్నాయి. విద్యుత్‌, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించాలని అధికారులను కేంద్రం ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 06:19 PM