15న వాయు‘గండం’.. తమిళనాడుకు భారీ వర్ష సూచన
ABN , Publish Date - Nov 12 , 2026 | 10:21 AM
బంగాళాఖాతంలో ఈ నెల 13న ఏర్పడనున్న అల్పపీడనం 15న వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
చెన్నై: బంగాళాఖాతంలో ఈ నెల 13న ఏర్పడనున్న అల్పపీడనం 15న వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. దక్షిణ అండమాన్‌కు ఆనుకుని ఉపరితల ఆవర్తనంనెలకొని ఉందని తెలిపారు. ఈ కారణంగా ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, వాయువ్యదిశగా కదులుతూ 14న తీవ్ర అల్పపీడనంగా, 15న వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయనిపేర్కొన్నారు. అంతేకాకుడా మన్నార్ జలసంధి, దాని సమీప ప్రాంతాలపై 900మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వివరించారు.
ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రంలోని తంజావూరు, తిరువారూరు, మైలాడుదురై, నాగపట్టినం, పుదుకోట, రామనాధపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. పడమటి కనుమల జిల్లాల్లో, ఇతర ఉత్తర కోస్తాతీరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, తక్కిన ప్రాంతాల్లో సాధారణంగా పొడివాతావరణం ఉంటుందని తెలిపారు. 13న పశ్చిమ కనుమల జిల్లాల్లో, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందన్నారు.
మత్స్యకారులకు హెచ్చరిక...
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులంతా గురువారం రాత్రిలోగా తీరానికి తిరిగిరావాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ నెల 13 నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హరియాణా, మహారాష్ట్రల్లో పోలైన, లెక్కించిన ఓట్లలో తేడా!
సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్ర దాడి
Read Latest AP News And Telangana News And International News And Telugu News