Share News

తినగ తినగ మునగ...

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:00 PM

ఎవరినైనా అతిగా పొగిడితే ‘మునగ చెట్టెక్కించాడు’ అంటారు. మునగ చెట్టు పెళుసుగా ఉంటుంది.

తినగ తినగ మునగ...
Vantalu

ఎవరినైనా అతిగా పొగిడితే ‘మునగ చెట్టెక్కించాడు’ అంటారు. మునగ చెట్టు పెళుసుగా ఉంటుంది. దానిపై ఎక్కితే కొమ్మ విరిగిపోతుంది కాబట్టి! ‘‘ఇంటి ముందుమునగ - ఇంటి వెనక వేప’’ అని మరో సామెతకూడా ఉంది. మునగాకుల్ని కొండముచ్చులు ఇష్టంగా తింటాయట! మునగ చెట్టు అనగానే గొంగళి పురుగులు గుర్తుకొస్తాయి. ఇవి సీతాకోక చిలుకలుగా మారేలోపు ఆకులన్నింటినీ ఆరగించి చెట్టుని బోసిగా మార్చేస్తాయి.

మునగ కాడల్ని మనం ములక్కాడలంటాం. ‘మునగ’ అనేది ద్రావిడ మూలం గల పదం. తమిళంలో దీనిని మురుంగై అంటారు. భారత దేశానికి చెందిన ఈ వృక్షం హిమాలయ ప్రాంతాల్నుంచి ప్రపంచం అంతా విస్తరించింది. డ్రమ్ములు వాయించే కర్రల్లా పొడవుగా ఉండటంతో ఆంగ్లంలో మునగ కాయల్ని ‘డ్రమ్‌స్టిక్స్‌’ అంటారు.


కొన్ని కుటుంబాల్లో ఆషాఢ మాసంలో మునగకూర వండి తినే ఆచారం ఉంది. పూర్వం యుద్థ సైనికులకు మునగ కాడలు, మునగాకులతో చేసిన వంటకాలను ప్రత్యేకంగా వండి పెట్టేవారట. యుద్ధ శ్రమను పోగొట్టి, గాయాల నొప్పులు, వాపులు తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని అందించే గుణాలు వీటిలో ఉన్నాయని!

సర్వౌషధి గుణకల్పం అనే గ్రంథం ముల క్కాడలు వగరు రుచి కలిగి అన్నివ్యాధుల్లోనూ తినదగినవిగా పేర్కొంది. ఇవి నీళ్లవిరేచనాలను కట్టిస్తాయి. ఉష్ణగుణం ఉన్నప్పటికీ క్షార స్వభావం వల్ల ఎసిడిటీని తగ్గిస్తాయి. గడ్డల్ని, వాపుల్ని కరిగిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. జ్వరాలలో కూడా పథ్యంగా ఉపయోగపడ తాయి. క్షీణింపచేసే వ్యాధుల్లో బలాన్నిస్తాయి. ఎముకల మజ్జను, ఎముక పదార్థాన్ని పెంచు తాయి. క్యాల్షియం లోపాన్ని సరిచేస్తాయి. చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలలోఉపకరిస్తాయి.


book7.2.jpgములక్కాడలతో చేసిన చారు లేదా సూపు తాగితే జలుబు, పడిశం, పడిసెభారం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో డయటరీ ఫైబర్‌ సమృద్థిగా ఉంటుంది. అందువల్ల ఆహారంలోని చక్కెరలు, కొవ్వు పదార్థాలు రక్తంలోకి వేగంగా చేరకుండా కొంతమేర అడ్డుకుంటాయి. తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు కలిగి మధుమేహ నివారణకు, స్థూలకాయులకు ఎంతో మేలు చేస్తాయి.

ములక్కాడలు, మునగాకులు బాలింతలకు మంచి ఆహారం. వాతపు నొప్పుల్ని తగ్గిస్తాయి. ప్రసవానంతరం గర్భాశయం త్వరగా కుంచించుకునేలా చేస్తాయి. తల్లిపాలు పెంచుతాయి.


ములక్కాడలు పురుషుల వీర్యంలో జీవకణాల సంఖ్యను పెంచుతాయని, కామోద్దీపక గుణం కలిగి ఉంటాయని ప్రాచీన వైద్యగ్రంథాలు పేర్కొన్నాయి. అందుకే సన్యాసులు, బ్రహ్మచారులు వీటిని అధికంగా తీసుకోరాదనే అభిప్రాయం ఏర్పడింది. ఆఫ్రికా లోని కొన్ని జాతులు మునగను ‘మిరకిల్‌ ట్రీ’, ‘గాడ్స్‌ గిఫ్ట్‌’గా భావిస్తాయందుకే! శరీరానికి బలం చేకూర్చే ఈ మొక్క మధుమేహం, రక్తపోటు, కీళ్లవాతం వంటి వ్యాధులతో పాటు క్షీణత కలిగించే వ్యాధుల్లో ఉపయోగకరం.


లేతగా, పొడవుగా, సన్నగా ఉన్న ములక్కా డలను ఎంచుకొని పీచు తీసి అంగుళం ముక్క లుగా తరిగి, కొద్దిగా నెయ్యి వేసిన పాత్రలో స్వల్పంగా వేగించాలి. ఆవాలు, మిరియాలు, కొబ్బరి, నువ్వులు తగిన పాళ్లలో తీసుకొని దోరగా వేగించి మెత్తగా నూరాలి. ఈ పొడిలో కొద్దిగా పాలు కలిపి మరిగించి వడగట్టాలి. ఆ పాలలో వేగించిన ములక్కాడ ముక్కలు ఉడికించాలి. మరో పాత్రలో నెయ్యి వేసి ఇంగువ తాలింపు పెట్టి, మినప వడియాలు, అప్పడాల ముక్కలు దోరగా వేగించాలి. అందులో ములక్కాడలు, పాలు కలిపి పాలు ఇగిరే వరకు ఉడికించాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి చేర్చి దించాలి.

ఈ కూర మధుమేహం, మూత్రపిండాల వ్యాధుల్లో మేలు చేస్తుంది, కంటిచూపు మెరుగుపరుస్తుంది, పురుష జీవకణాలను పెంచుతుంది. రుచిని పెంచి మాంసధాతువును వృద్ధి చేస్తుంది.

  • డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

అఖాడాల అడ్డా

ఆషాఢ వేళ... మెహందీ కళ!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 12:03 PM