సత్తువని పెంచే బార్లీసత్తు
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:17 AM
బార్లీ అనగానే ఒంట్లో జిడ్డును వదిలించేది అని ఠక్కున గుర్తుకురావాలి. ఒంట్లో జిడ్డు అంటే కొవ్వే! లావాటివాళ్లకి, బార్లీ ఒక వరం అనే ఆయుర్వేదం చెప్తుంది.
బార్లీ అనగానే ఒంట్లో జిడ్డును వదిలించేది అని ఠక్కున గుర్తుకురావాలి. ఒంట్లో జిడ్డు అంటే కొవ్వే! లావాటివాళ్లకి, బార్లీ ఒక వరం అనే ఆయుర్వేదం చెప్తుంది. వెంటనే ఓపిక వస్తుంది. పేగులకు, మూత్రపిండాలకు, ఊపిరితిత్తులకు పుష్టినిస్తుంది! ఒకప్పుడు జ్వరం వస్తే బార్లీ జావ తాగేవాళ్లు. ఇప్పుడు చాలామంది నామోషీ పడ్తున్నారు. దాన్నిజావ, గంజి అనకుండా ఇంగ్లీషులో గ్రూయల్, పారిజ్ అంటే తప్పకుండా తాగుతారు.
బార్లీ గింజల్ని భాండీలో పైపైన వేగించి మర పట్టుకున్న పిండిని ‘సక్తు’ లేదా ‘సత్తు’ అంటారు. సత్తుపిండి అనటం కూడా ఉంది. ఈ పొడిని నీళ్లలో వేసి కాచినదే బార్లీ జావ లేదా అంబలి. ఇది చలవనిస్తుంది.అరుగుదలని పెంచుతుంది. పులకరం (జ్వరం) తగ్గుతుంది.
మిరియాలపొడి ఉప్పు కలిపి కాచిన బార్లీ అంబలి తెమడని గల్లని (కఫం) తగ్గిస్తుంది. జలుబు, పడిశభారం, వేడివలన కలిగే దగ్గు, ఆయాసం ఆగుతాయి. పొట్ట ఉబ్బరం తగ్గి మంచి ఆకలి కలుగుతుంది.
ఒకగ్లాసు చిక్కని బార్లీ జావ, అరగ్లాసు పెరుగు కలిపి చిలికిన చిక్కని బార్లీమజ్జిగ తాగితే ఉడుకు విరేచనాలు తగ్గుతాయి. విరేచనాలవలన శోష ఏర్పడకుండా కాపాడుతుంది. కొంచెం పంచదార, ఉప్పు, తినే సోడా ఉప్పు కూడా కలిపి ఒక నిమ్మకాయ రసం పిండుకుని తాగితే వేసవిలో వడ కొట్టకుండా ఉంటుంది. దప్పిక తీరుతుంది.
రోజూ బార్లీ అంబలి తాగేవారికి ‘నపుంసకత్వం’ తగ్గుతుంది. వీర్వవర్ధకం. మగ వాళ్లలో జీవకణాలు పెరుగుతాయి. ‘బి’ విట మిన్ లోపంతో బాధపడేవారికి ఇది మంచిది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. శరీరానికి నీరు పట్టటం తగ్గు తుంది. చర్మానికి మంచి రంగు, మృదుత్వాన్ని ఇస్తుంది. బీపీ తగ్గుతుంది. ప్రసవించిన స్త్రీలకు ఇస్తే, తేలికగా కోలుకుంటారు. రక్తస్రావం ఆగుతుంది. తల్లిపాలు పెరుగుతాయి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా!
ఇతర గింజల్లో కన్నా బార్లీలోనే ఆహారపీచు (డయటరీ ఫైబర్) ఎక్కువగా 15.6 గ్రాముల వరకూ ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా కొంత నిరోధిస్తుంది.
వరి అన్నంలో షుగర్ని పెంచే సూచిక (జి ఐ విలువ) 73 వరకూ ఉంటే, బార్లీ సత్తులో 28 మాత్రమే ఉంటుంది. ఓట్స్ విషయంలో ఈ షుగరు సూచిక ఇంచుమించు బియ్యంతో సమానంగా ఉంటుంది. ఓట్స్‌తో పోల్చినప్పుడు పీచుపదార్థాలు కూడా బార్లీలోనే ఎక్కువ ఉన్నాయి. అందుకని విదేశీ ఓట్స్ కన్నా స్వదేశీ బార్లీయే మన ఒంటి తీరుకు సరిపడేదిగా ఉంటుంది.
పొట్టు తియ్యని లేదా పట్టుతక్కువబార్లీలోనే షుగరు సూచిక తక్కువగా ఉంటుంది. తెల్లగా మరాడించిన పాలిష్డ్ బార్లీలో షుగరు సూచిక ఎక్కువగా ఉంటుంది. ఆ పైపొరలు చాలా ముఖ్యమైనవి. పొట్టు తియ్యని బార్లీని వాడుకో వటం వలన షుగరుతోపాటు, కీళ్లనొప్పులు త్వరగా తగ్గుతాయని ఆయుర్వేదం చెప్తోంది.
బార్లీ సత్తులో ఎక్కువ పీచు ఉంటుంది కాబట్టి, మలబద్ధతను పోగొట్టి విరేచనం అయ్యేలా చేస్తుంది. పేగుల్ని శక్తిమంతం చేస్తుంది. ప్రొటీన్లు ఎక్కువ. క్యాల్షియం, ఐరన్ ఫాస్ఫరస్, జింకు కూడా తగుపాళ్లలోఉన్నాయి. ఇంత విలువైన ధాన్యాన్ని మనం పట్టించుకో కుండా వదిలేశాం కాబట్టి, పండిన పంటంతా బీరు తయారీకో, పశువుల దాణాకో తరలి పోతోంది. బార్లీ సత్తుపిండికి సమానంగా పెరుగు కలిపి మిక్సీ పట్టిన బార్లీ మజ్జిగ ప్రోబయాటిక్ మాత్రమే కాదు, ప్రీబయాటిక్ కూడా!
డా. జి.వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News