అడవిలో కార్పొరేట్ పాఠాలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 09:27 AM
కాంక్రీట్ జంగిల్ వేరు... రియల్ జంగిల్ వేరు. కాంక్రీట్ జంగిల్‌లో బతుకుతున్నవారు.. రియల్ జంగిల్‌లో ఉన్న జంతువులను చూసి చాలా నేర్చుకోవచ్చు.
కాంక్రీట్ జంగిల్ వేరు... రియల్ జంగిల్ వేరు. కాంక్రీట్ జంగిల్‌లో బతుకుతున్నవారు.. రియల్ జంగిల్‌లో ఉన్న జంతువులను చూసి చాలా నేర్చుకోవచ్చు. అందుకే అడవిలోకి తీసుకెళ్లి కార్పొరేట్ పాఠాలు చెబుతున్నారు సాయి కిరణ్ భాగవతుల. 13 ఏళ్ల కార్పొరేట్ జీవితాన్ని వదులుకొని... అదే కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులను అడవుల్లోకి తీసుకెళ్లి ‘వైల్డ్‌లైఫ్ విస్పరర్స్’ పేరుతో పాఠాలు చెబుతున్నారు. ఆ కార్పొరేట్ పాఠాలు వినడానికి ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
‘‘పెర్ఫెట్టి వాన్ మెల్లె.. ఈ కంపెనీ పేరు తెలియకపోవ చ్చు. కానీ ఆల్ఫన్‌లిబి చాక్లెట్లు, మెంటోస్, చుపాచుప్స్ లాలీపప్స్.. ఈ పేర్లు తెలియని వాళ్లుండకపోవచ్చు. వీటి తయారీ కంపెనీనే అది. ఈ కంపెనీకి చెందిన 15 మంది మేనేజర్లను ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కి తీసుకెళ్లాం. నాలుగు రోజుల పాటు టీమ్ బాండింగ్ గురించి... అక్కడ కనిపించే జంతువుల ప్రవర్తన ద్వారా వారికి పాఠాలుగా చెప్పాము. ఈ ఏడాదిలో మరో కార్పొరేట్ గ్రూప్ సభ్యులకు మూడు రోజులు స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా... మహారాష్ట్రలోని తడోబా అడవుల్లోకి తీసుకెళ్లి కార్పొరేట్ పాఠాలు బోధించాం. ఇలా ఇప్పటిదాకా ఎనిమిది కంపెనీలను, రెండు యూనివర్సిటీలను తీసుకెళ్లాం.
జంతుజాలం నుంచి...
గుడి ఎంత పవిత్రమైనదో, అడవి కూడా అంతే పవిత్రమైనది నా దృష్టిలో. కుక్క నుంచి విశ్వాసం నేర్చుకోవాలని చెబుతుంటాం. పిల్లి, కోడి... ఇలా మన చుట్టూ ఉన్న జీవుల్ని నిశితంగా గమనించి ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చు. అలాంటిది అడవిలో ఉండే రకరకాల జీవుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చనిపించింది. ఈ సంగతి అర్థమవ్వడానికి నాకు చాలా కాలమే పట్టింది. నేనొక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ని. జంతువుల ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తుంటాను. క్రమక్రమంగా వాటిపై అధ్యయనం మొదలు పెట్టా. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీలకు జంతువుల ప్రవర్తన ద్వారా పాఠాలు చెప్పొచ్చనే ఆలోచన వచ్చింది. కార్పొరేట్ ఉద్యోగులు ఏసీ గదుల్లో కూర్చొని టార్గెట్ల కోసం టీమ్ మీటింగ్‌లు నిర్వహించే ముందు... ఒక చీమల దండును చూడమంటా. వాటి టీమ్ బిల్డ్ చూస్తే... ఎంత పనైనా సులువుగా చేయొచ్చనేది నేర్చుకోవచ్చు. ఇలాంటివి నేర్పేందుకే మూడేళ్ల క్రితం ‘వైల్డ్‌లైఫ్ విస్పరర్స్’ పేరుతో కంపెనీ మొదలు పెట్టా. మొదటి ఏడాదే రూ.80 లక్షల ఆదాయంతో సక్సెసయ్యా.
ప్రకృతి వైపు...
మా నాన్న ఇండియన్ రైల్వేస్‌లో పనిచేసేవారు. వరంగల్‌లోని సెయింట్ గాబ్రియల్స్ హైస్కూల్‌లో చదువుకున్నా. పాఠశాల ఆవరణ అంతా చెట్లు, మొక్కలతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది. స్కూల్‌లో టీవీ పీరియడ్‌లో జంతువులకు సంబంధించిన వీడియోలు చూపించేవారు. అలా నాకు అడవి మీద ఆసక్తి మొదలైంది. మావయ్య ఫొటోగ్రాఫర్ కావడంతో నాకు కెమెరాను పరిచయం చేశాడు. ఇంజినీరింగ్ చదివాక... హైదరాబాద్, చెన్నై, ముంబైలలో కొంతకాలం పని చేసి, మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లా. ఆ సమయంలోనే అమెరికా, ఆఫ్రికాలోని జాతీయ పార్కులన్నీ చుట్టేశా.
ఆలస్యంగానైనా..
ఫొటోగ్రఫీ అనేది కేవలం జంతువుల మూవ్‌మెంట్స్‌ను బంధించడం కోసమే కాదు... అవి మనకు ఏం పాఠాలు చెబుతాయో తెలుసుకోవాలని అనిపించింది. సాఫ్ట్‌వేర్ నిపుణులకు జరిగే సమావేశాలకు, నాయకత్వ వ్యూహాలకు... సింహాలు, ఏనుగులు, తేనెటీగలతో ఉదయం జరిగే సమావేశాలకు సంబంధం ఉంటుంది. సింహాల మధ్య జట్టు కృషి, తేనెటీగలు ముప్పునకు ప్రతిస్పందించే గుణం ఉంటుంది. అలాగే సాలీడు దాని గూడు ఎలా కట్టుకుంటుంది? గూగుల్ మ్యాప్‌లు లేకుండా... పక్షులు ఎలా కమ్యూనికేట్ చేసుకొని వలస వస్తాయి?... ఇవన్నీ కూడా అడవిలో వాటిని అబ్జర్వ్ చేయడం వల్ల తెలుస్తుంది. కార్పొరేట్ ఉద్యోగులకు తమ పరిసరాల్లో ఏం జరుగు తుందో గమనించేలా చేస్తుంటాం.
అడవిలోకి వెళితే... ప్రతీ సెన్స్‌తో అడవిని ఎలా అర్థం చేసుకుంటామనేది నేర్పిస్తాం. భూమ్మీద ఉన్న ప్రతీ జంతువు మనుగడ మనిషికన్నా ముందే ఉంది. కార్పొరేట్ బృందాలను అడవుల్లోకి తీసుకెళ్లి.. ప్రకృతినే గురువుగా నిలపడం మా లక్ష్యంగా మారింది. రిసార్ట్‌ల్లో కూర్చోబెట్టి... ప్రకృతి కన్నా గ్రేట్ టీచర్ ఉండరని చెబితే ఎవరూ పట్టించుకోరు. ఆ ప్రకృతిలో మనం ఒకరిగా మారినప్పుడే అది సాధ్యమవుతుందని చెబుతున్నాం. ప్రకృతిని బాగా స్టడీ చేసి, దాని నుంచి నేర్చుకున్నదే పాఠాలుగా చెబుతున్నాం. అందుకే ఈ తరహా నేర్చుకునే విధానాన్ని అందరూ ఇష్టపడుతున్నారు.’’
పక్కా ప్రణాళికతో...
‘‘వైభవ్ పేరి.. తను కూడా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్. ‘వైల్డ్‌లైఫ్ విస్పరర్స్’కి నాతో పాటు పని చేస్తున్నాడు. పాఠ్య ప్రణాళికలో అతని సహకారం చాలా ఉంది. ముందుగా మేం మొదలు పెట్టినప్పుడు... ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తామనుకొని అడవుల్లో పార్టీలు చేయమని అడిగేవారు. ఆ ఆలోచన ధోరణిని మార్చడానికి చాలా సమయం పట్టింది. అడవిలో ఏమేం పాఠాలు చెప్పాలనే విషయాలను ఒక ప్రణాళిక వేసుకుంటాం. మన దేశంలోనే కాదు... విదేశాలకు సైతం తీసుకెళ్లి పాఠాలు చెబుతాం. ఇండియా, ఆఫ్రికా, శ్రీలంక, అమెజాన్... ఇలా ఏ అడవుల్లోకైనా తీసుకెళ్లడానికి మేము సిద్ధమే. అంతిమంగా ప్రకృతి మాత్రమే మీకు మార్గదర్శి అవుతుందని చెప్పడమే మా లక్ష్యం.’’
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News