Share News

బీట్‌రూటు మారుతోంది!

ABN , Publish Date - Nov 01 , 2026 | 08:34 AM

ఒకప్పుడు బీట్‌రూట్‌ను ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఏ కొద్దిమందో వంటింట్లోకి తెచ్చుకునేవారు. ఆరోగ్యస్పృహ పెరిగిన తర్వాత క్రమక్రమంగా వాడకం పెరిగింది. వినియోగ రూపాలు కూడా మారుతున్నాయి.

బీట్‌రూటు మారుతోంది!
Beetroot Benefits

ఒకప్పుడు బీట్‌రూట్‌ను ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఏ కొద్దిమందో వంటింట్లోకి తెచ్చుకునేవారు. ఆరోగ్యస్పృహ పెరిగిన తర్వాత క్రమక్రమంగా వాడకం పెరిగింది. వినియోగ రూపాలు కూడా మారుతున్నాయి. నవతరంలో పిల్లలు మారాం చేస్తే బీట్‌రూట్‌ క్యాండీ... స్నాక్స్‌గా బీట్‌రూట్‌ చిప్స్‌... బర్త్‌డే రోజున బీట్‌రూట్‌ కేక్‌... బీట్‌రూట్‌ ఫ్లేవర్‌తో రకరకాల ఉత్పత్తులు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఈ మ్యాజిక్‌ ఫుడ్‌ విశేషాలివి...

వంటింటి కూరగాయల్లో బీట్‌రూట్‌ ప్రత్యేకమైనది. ఈ దుంప రంగు భిన్నమైనది. రంగులోనే కాదు... రుచిలోనూ, పోషకాల్లోనూ మేటి. బీట్‌రూట్‌ ఎరుపుగా ఉండటానికి బీటాలైన్‌ అని పిలిచే పిగ్మెంట్‌ కారణం. మనకు చాలా ఆలస్యంగా పరిచయమైన ఈ దుంప చరిత్రను పరిశీలిస్తే... కొన్ని వేల ఏళ్ల క్రితం ఈజిప్షియన్లు మొదటిసారి బీట్‌రూట్‌ను పండించారు. ఆ తరువాత గ్రీకులు, రోమన్లు పండించినట్టుగా ఆధారాలున్నాయి. అయితే వాళ్లు దుంప కోసం కాకుండా వాటి ఆకుల కోసం సేద్యం చేశారు. దుంపలు కూడా తినదగినవే అన్న విషయం వారికి అప్పట్లో తెలియదు. కొన్ని శతాబ్దాల తరువాత దుంపలోనూ ఔషధ గుణాలున్నాయన్న విషయాన్ని గుర్తించి తినడం ప్రారంభించారు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా బీట్‌రూట్‌ సాగు విస్తరించుకుంటూ వచ్చింది.


book3.2.jpgమ్యాజిక్‌ ఫుడ్‌

మిగతా దుంపలతో పోలిస్తే... ఈ సీజన్‌లో లభించే బీట్‌రూట్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే... బీట్‌రూట్‌తో చేసే వంటకాలు ఏవైనా కూడా ప్రత్యేక రుచిని, ఫ్లేవర్‌ను కలిగి ఉంటాయి. అందుకే దీన్ని ‘మ్యాజిక్‌ ఫుడ్‌’ అంటారు. ఇన్నాళ్లు కర్రీగానో, ఫ్రైగానో పరిచమైన బీట్‌‘రూటు’ మార్చి... ప్రస్తుతం రకరకాల ఆహారపదార్థాలుగా సూపర్‌మార్కెట్లలో లభిస్తోంది. బీట్‌రూట్‌ కర్రీని ఇష్టపడనివారు ఆ ఫ్లేవర్‌తో తయారైన రకరకాల ఆహారపదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. క్యాండీలు, ఐస్‌క్రీమ్‌లు, చిప్స్‌... ఇలా ఒక్కటేమిటి బీట్‌రూట్‌తో కావాల్సినన్ని ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలకు లంచ్‌బాక్స్‌తో పాటు కొన్ని బీట్‌రూట్‌ చిప్స్‌ను పెట్టడం ద్వారా అవసరమైన పోషకాలు అందేలా చూస్తున్నారు. సాధారణ ఐస్‌క్రీమ్‌ల స్థానంలో పోషక విలువలున్న బీట్‌రూట్‌ ఐస్‌క్రీమ్‌ను అలవాటు చేస్తున్నారు.


ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్‌పై బీట్‌రూట్‌ జామ్‌ని రాసి అందిస్తున్నారు. సాధారణ ఫ్రూట్‌ జామ్‌తో పోలిస్తే ఇది ఎంతో మేలు. సాయంకాలం వేళ స్నాక్స్‌గా బీట్‌రూట్‌ టిక్కీలు చేసి ఫాస్ట్‌ఫుడ్‌కి చెక్‌ పెడుతున్నారు. పిల్లల బర్త్‌డే రోజున చాక్లెట్‌ కేక్‌, పైనాపిల్‌ కేక్‌ స్థానంలో బీట్‌రూట్‌ కేక్‌ను ఎంచుకుంటున్నారు. రుచితో పాటు పోషకాలు సమృద్ధిగా లభిస్తుండటంతో బీట్‌రూట్‌ ఫ్లేవర్స్‌కి వయసుతో నిమిత్తం లేకుండా ఆకర్షితులవుతున్నారు. ఉదయాన్నే బీట్‌రూట్‌ రసం తాగాలనుకునేవారు గ్లాసు నీళ్లలో ఒక టీస్పూన్‌ బీట్‌రూట్‌ పౌడర్‌ని వేసి తీసుకుంటున్నారు. ఒకగ్లాసు నీళ్లలో ఒక చెంచా బీట్‌రూట్‌ పౌడర్‌ వేసి కాస్త నిమ్మరసం కలుపుకొని మార్నింగ్‌ షాట్‌గా తీసుకుంటున్న వారూ ఉన్నారు.


ఐరన్‌ పుష్కలం

పాలకూరలో ఐరన్‌ శాతం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే బీట్‌రూట్‌లో పాలకూర కన్నా అధికంగా ఐరన్‌ లభిస్తుందని తెలుసా? తక్కువ సమయంలో రక్తంలోని హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచే దుంప ఇది. కావునే రక్తహీనతతో బాధపడేవారికి ఇది సరైన ఔషధం. పిల్లలకు బీట్‌రూట్‌తో చేసిన ఆహారాన్ని అందించడం ద్వారా రక్తహీనత సమస్య రాకుండా చూసుకోవచ్చు. పైగా బీట్‌రూట్‌ చాలా చవక. అందరికీ అందుబాటులో ఉంటుంది.


book3.3.jpgపోషకాల పవర్‌హౌజ్‌

  • బీట్‌రూట్‌లో క్యాలరీలు తక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్‌తో పాటు ఫైబర్‌, సి విటమిన్‌, ఫోలేట్‌, విటమిన్‌ బి6, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌, ఐరన్‌, పాస్ఫరస్‌ ఉంటాయి.

  • బీట్‌రూట్‌లో ఉండే నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తనాళాలను సహజసిద్ధంగా వెడల్పు చేస్తుంది. ఈ ప్రక్రియను వాసోడిలేషన్‌ అంటారు. దీనివల్ల రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడటం తగ్గిపోతుంది.

  • ఇందులో ఉండే డైటరీ ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు సహాయపడటమే కాకుండా జీర్ణక్రియ మెరుగ్గా అయ్యేందుకు సహాయపడుతుంది. టైప్‌ 2 డయాబెటీస్‌ను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది.


  • ఇందులో క్యాన్సర్‌పై పోరాడే గుణాలున్నాయి. దీనిలో ఉండే ఫెరులిక్‌ యాసిడ్‌, రుటిన్‌, కాఫిక్‌ యాసిడ్‌ వంటి మిశ్రమాలు క్యాన్సర్‌ నిరోధక గుణాలు కలిగి ఉంటాయి.

  • బీట్‌రూట్‌లో సి విటమిన్‌తో పాటు పాలీఫెనాల్స్‌, మాంగనీస్‌ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయి.

  • బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు శరీరంలో నైట్రిక్‌ఆక్సైడ్‌గా మారి మైక్రోసర్య్యులేషన్‌ను పెంచుతాయి. దీనివల్ల కణాలకు పోషకాలు సరిగ్గా అందుతాయి. ఆక్సిజన్‌ సరఫరా మరింత మెరుగవుతుంది.

  • లివర్‌ డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియకు బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపడంతో పాటు మెటబాలిక్‌ వృథాను బయటకు పంపడంలో సహాయపడుతుంది.


  • కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. లివర్‌లో జరిగే ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది.

  • ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు హెచ్చుతగ్గులతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.

  • బీట్‌రూట్‌లో లభించే మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.

  • బీట్‌రూట్‌లో పాస్ఫరస్‌, ఐరన్‌, బీటా కెరోటిన్‌తో పాటు విటమిన్లు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.


సౌందర్య పోషణలో...

బీట్‌రూట్‌ ఆహారపదార్థంగానే కాకుండా సౌందర్య పోషణలో కూడా చక్కగా ఉపయోగపడుతోంది. అందుకే కాస్మొటిక్స్‌ తయారీల్లోనూ బీట్‌రూట్‌ను విరివిగా వాడుతున్నారు. చర్మసౌందర్యానికి, కేశ సంరక్షణకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతోంది. లిప్‌బామ్‌ నుంచి ఫేస్‌ప్యాక్‌, హెయిర్‌ ప్యాక్‌లదాకా... బీట్‌రూట్‌తో తయారుచేసినవాటికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది.

  • మొటిమలతో బాధపడేవారు, ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు తరచుగా బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. మొటిమల సమస్య తీవ్రంగా ఉన్నట్టయితే రెండు చెంచాల బీట్‌రూట్‌ జ్యూస్‌లో కాస్త పెరుగు కలిపి రాసుకుని పావుగంట తరువాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.


book3.4.jpg

  • చర్మ నిగారింపును పెంచడంలో బీట్‌రూట్‌ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే రక్తం శుభ్రపడుతుంది. టాక్సిన్స్‌ తొలగిపోయి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌ని ముఖానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.

  • రాత్రి పడుకునే ముందు బీట్‌రూట్‌ జ్యూస్‌ని పెదాలకు రాసుకుంటే మృదువుగా మారడమే కాకుండా పదిరోజుల్లో గులాబీ రంగులోకి మారతాయి.

  • జుట్టు రాలిపోతూ ఉంటే మెనూలో బీట్‌రూట్‌ చేర్చాలి. ఫోలికల్స్‌ బలోపేతం కావడానికి అవసరమైన లవణాలు, పోషకాలు బీట్‌రూట్‌లో లభిస్తాయి.

  • బీట్‌రూట్‌ను పేస్ట్‌లా చేసి తేనె కలుపుకొని ఫేస్‌మాస్క్‌లా ఉపయోగించుకోవచ్చు. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.

బీట్‌రూట్‌ పౌడర్‌లో కొద్దిగా అలొవెరా జెల్‌ని కలిపి హెయిర్‌ప్యాక్‌గా వేసుకోవచ్చు.


బీట్‌రూట్‌ రకాలివే...

కియోగియా బీట్స్‌: వీటిని క్యాండీ కేన్‌ బీట్స్‌ అని కూడా పిలుస్తారు. మొట్టమొదట ఇటలీలో సాగైన బీట్‌రూట్‌ ఇది. ఈ బీట్‌రూట్‌ని కట్‌ చేస్తే లోపల తెలుపు చారలు ఉంటాయి.

సిలిండర్‌ బీట్స్‌: వీటిని సిలిండ్రా బీట్స్‌ అని కూడా పిలుస్తారు. క్యారెట్‌ ఆకారంలో కాస్త లావుగా ఉంటాయి.

గోల్డెన్‌ బీట్స్‌: పసుపు రంగులో ఉండటం వల్ల వీటిని గోల్డెన్‌ బీట్స్‌ అని పిలుస్తుంటారు. పసుపు రంగులో ఉన్నా సాధారణ బీట్‌రూట్‌ రుచినే కలిగి ఉంటాయి.


రెడ్‌ బీట్‌రూట్‌: ఇవి సాధారణ రకానికి చెందినవి. సూపర్‌ మార్కెట్లలో విరివిగా లభించే రకం. మన దగ్గర వాడుతున్నవి ఇవే.

షుగర్‌ బీట్స్‌: ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పంచదారలో 20 శాతం ఈ రకమైన బీట్‌రూట్‌ నుంచే వస్తోంది. సీ అండ్‌ హెచ్‌ బ్రాండ్‌కు చెందిన షుగర్‌ బీట్స్‌ నుంచి తయారైనదే. సాధారణ బీట్‌రూట్‌తో పోలిస్తే ఈ బీట్‌రూట్‌ మూడు రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది.

అవ్లాంచ్‌ బీట్‌రూట్‌: ఈ రకమైన బీట్‌ తియ్యగా ఉంటుంది. రకరకాల ఉత్పత్తుల తయారీలో, ఫ్లేవర్‌ కోసం వాడుతుంటారు.

బేబీ బీట్స్‌: ప్రత్యేకంగా ఇది ఒక రకానికి చెందినది కాదు. సాధారణ బీట్‌రూట్‌ని కాస్త ముందుగా లేత దశలోనే తీసి మార్కెట్‌కు తరలిస్తారు.

బుల్‌ బ్లడ్‌ బీట్స్‌: ఈ రకమైన బీట్‌రూట్‌ ముందుగా అలస్కాలో సాగుచేశారు. ఇప్పుడు నార్త్‌ అమెరికా అంతటా సాగవుతోంది.


పోషకాలు

(వంద గ్రాముల బీట్‌రూట్‌లో )

క్యాలరీలు: 43 క్యాలరీలు

కార్బోహైడ్రేట్లు: 9.6గ్రా

డైటరీ ఫైబర్‌: 2.8గ్రా

షుగర్‌: 6.8గ్రా

ప్రొటీన్‌: 1.6గ్రా

వాటర్‌: 87.6గ్రా


విటమిన్లు - మినరల్స్‌

(వంద గ్రాముల బీట్‌రూట్‌లో )

ఫోలేట్‌: 109 మై.గ్రా

పొటాషియం: 325 మి.గ్రా

మాంగనీస్‌: 0.33మి.గ్రా

ఐరన్‌: 0.8గ్రా

మెగ్నీషియం: 23మి.గ్రా

విటమిన్‌ సి: 4.9మి.గ్రా

విటమిన్‌ బి6: 0.07 మి.గ్రా

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌: 64


ఈ వార్తలు కూడా చదవండి:

శ్రీవారి ఆలయంలో 495 ఏళ్ల నాటి శాసనం

మరో 24 కరువు మండలాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 08:34 AM