మళ్లీ దాడులు చేస్తే భీకరంగా ప్రతిదాడి చేస్తాం.. ట్రంప్‌కు ఖమేనీ హెచ్చరిక
ABN , Publish Date - Nov 01 , 2026 | 07:23 AM
తమపై మళ్లీ దాడి చేస్తే, తాము కూడా తీవ్రంగా ప్రతీకార దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. ఈ మేరకు ఆ దేశ సాయుధ బలగాలను ఆయన ఆదేశించారు. ఇరాన్ సాయుధ బలగాల ఉన్నతాధికారులతో ఖమేనీ సమావేశం నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: తమపై మళ్లీ దాడి చేస్తే, తాము కూడా తీవ్రంగా ప్రతీకార దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. ఈ మేరకు ఆ దేశ సాయుధ బలగాలను ఆయన ఆదేశించారు. ఇరాన్ సాయుధ బలగాల ఉన్నతాధికారులతో ఖమేనీ సమావేశం నిర్వహించారు. శత్రువుల నుంచి ఏ రూపంలో ముప్పు వచ్చినా.. భౌగోళిక పరిధిని పట్టించుకోకుండా తీవ్రంగా స్పందించాలని సైనిక కమాండర్లకు ఆయన స్పష్టం చేశారు. ప్రతీకార దాడులకు భౌగోళిక పరిమితులు ఉండకూడదని పేర్కొన్నారు. సమావేశానికి సంబంధించిన వివరాలను అధికారులు ఒక ప్రకటనలో విడుదల చేశారు. తమ శత్రువులు మళ్లీ తమపై సైనిక దాడులకుగానీ, ఉగ్రవాద చర్యలకుగానీ పాల్పడితే వాటికి ఎలా సమాధానం చెప్పాలో ఇరాన్ సాయుధ దళాలు, దేశ ప్రజలే నిర్ణయిస్తారని ఖమేనీ తెలిపారు.
శత్రువులు తమపై యుద్ధ నిబంధనలను రుద్దేందుకు అనుమతించబోమని ఖమేనీ స్పష్టం చేశారు. అమెరికా నుంచి దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అమెరికా దాడులను అడ్డుకోవడంతో పాటు శత్రు దేశంపై దాడులు కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా, తెలివిగా పోరాడాలని, ఇందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే రక్షణ రంగ సాంకేతికతను అభివృద్ధి చేయాలని, ఎలాంటి దాడులు అయినా ఎదుర్కొనేలా సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆదేశించారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యా్ఖ్యానించిన నేపథ్యంలో ఖమేనీ ఆవిధంగా స్పందించారు.
యుద్ధం ముగింపులో తొందరేమీ లేదు: ట్రంప్
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో అన్నారు. ఇరాన్‌తో ప్రస్తుత పరిస్థితిని సాధారణ యుద్ధంగా చూడలేమని ఆయన వ్యాఖ్యానించారు. తమ వ్యూహాన్ని కొనసాగించేందుకు అమెరికాకు తగినంత సమయం ఉందని పేర్కొన్నారు. ‘చర్చలు జరుగుతున్నాయి. వారు (ఇరాన్) మాట్లాడాలని కోరుకుంటున్నారు. వారు మాట్లాడుతూనే ఉంటారు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..