Share News

తాపం నుంచి గొడుగు

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:21 AM

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని సామెత! అరచేత్తో ఆపలేంగానీ.. రోదసిలో 20 లక్షల కిలోమీటర్ల ఎత్తున వేలాది ఉపగ్రహాల సమూహాన్ని మోహరించి వాటితో సూర్యకాంతిని అడ్డుకోగలిగితే?

తాపం నుంచి గొడుగు

  • 5 వేల శాటిలైట్లు మోహరించి భూమికి 1శాతం సూర్యకాంతిని అడ్డుకునే ప్రతిపాదన

  • అంతరిక్షంలో భారీ ధూళి మేఘాన్ని సృష్టించడం ద్వారానూ అడ్డుకునే యోచన!

  • ‘ప్లానెటరీ సన్‌షేడ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ నివేదిక

  • ‘ఉపగ్రహాలతో ప్రతిపాదన’

  • ఆగస్టులోనే చేసిన మస్క్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 31: అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని సామెత! అరచేత్తో ఆపలేంగానీ.. రోదసిలో 20 లక్షల కిలోమీటర్ల ఎత్తున వేలాది ఉపగ్రహాల సమూహాన్ని మోహరించి వాటితో సూర్యకాంతిని అడ్డుకోగలిగితే? వినడానికి ఇదేదో హాలీవుడ్‌ సైన్స్‌ఫిక్షన్‌ సినిమాలా అనిపిస్తోంది కదూ. కానీ ఇది అపరకుబేరుడు ఎలన్‌ మస్క్‌ ప్రతిపాదన. రెండు నెలల క్రితం ఆగస్టులో ఆయన చేసిన ఈ ప్రతిపాదనపై శాస్త్రజ్ఞులు ఇటీవలికాలంలో గట్టిగా దృష్టి సారించి, సంపూర్ణంగా విశ్లేషించి.. ఇది ఆచరణీయమేననే అభిప్రాయానికి వచ్చారు.

ఈ ఏడాది ఆగస్టులో మస్క్‌ ఈ ప్రతిపాదన చేశారు. కృత్రిమ మేధతో పనిచేసే అత్యంత అధునాతన ఉపగ్రహాలను పంపి సూర్యకాంతిని అడ్డుకుంటే భూమి చల్లబడుతుందని.. ఈ ఉపగ్రహాలు భూతాప సమస్యను 100 కోట్ల ఏళ్లపాటు పరిష్కరిస్తాయని పేర్కొంటూ ఆయన సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఈ కాన్సె్‌ప్టకి ఆయన ‘స్పేస్‌ సన్‌షేడ్‌’ అని పేరు పెట్టారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు సూర్యకాంతిని రోదసిలోనే అడ్డుకునే విధానాలపై చాలాకాలంగా పరిశోధనలు, అధ్యయనాలు, విశ్లేషణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. లాస్‌ఏంజెలెస్‌కు చెందిన ‘ప్లానెటరీ సన్‌షేడ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ పరిశోధకులు ఈ నెలలో ఒక నివేదికను ప్రచురించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!


వచ్చే 20 నుంచి 40 ఏళ్లలో ‘ప్లానెటరీ సన్‌షేడ్‌’ నిర్మాణాన్ని ప్రారంభించడం ఆచరణసాధ్యం కావచ్చని వారు ఆ నివేదికలో పేర్కొన్నారు. దాన్ని రూపొందించినవారిలో నాసా శాస్త్రజ్ఞులతోపాటు, పర్యావరణ శాస్త్రవేత్తలు, పలువురు ఇంజనీర్లు కూడా ఉన్నారు. భూమికి చేరే సూర్యకాంతిలో కనీసం 1 శాతం కాంతిని అడ్డుకునే ఆరు నమూనాలను, వాటి ఇంజనీరింగ్‌ అవసరాలను (అంటే ఎలాంటి రాకెట్ల ద్వారా పంపాలి? ఎక్కడిదాకా పంపాలి వంటి అంశాలను), వాటివల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను వారు క్షుణ్నంగా పరిశీలించి, విశ్లేషించారు. ఆ ఆరు నమూనాల్లోనూ అత్యంత కీలకమైనవి రెండు. వాటిలో మొదటిది.. ఉపగ్రహాల సమూహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టడం. రెండోది.. సూర్యకాంతిని పరావర్తనం చెందించే భారీ ధూళి మేఘాన్ని సృష్టించే పదార్థాన్ని రోదసిలోకి పంపడం. వీటిలో మొదటి ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఒక్కొక్కటీ 40 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఉపగ్రహాల సమూహాన్ని (ఆ ఉపగ్రహాలను హీలియోగైరోస్‌గా వ్యవహరిస్తున్నారు) రోదసిలో 20 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంచ్‌ చేయడం. ఈ ఉపగ్రహాలకు పల్చటి కాగితంలాంటి బ్లేడ్‌లు ఉంటాయి. సూర్యకాంతిని పరావర్తనం చెందించే పని ఆ బ్లేడ్‌లదే. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే హీలియోగైరోస్‌.. అందుకు అవసరమైన శక్తిని సైతం సూర్యుడి నుంచే పొందుతుంటాయి. ఈ బ్లేడ్‌ల దిశను భూమ్మీది నుంచే నియంత్రిస్తూ కావాల్సిన మేర సూర్యకాంతిని పరావర్తనం చెందించవచ్చు. ఈ విధానంలో భూతాపం కనీసం 1 డిగ్రీ సెల్సియస్‌ మేర తగ్గాలంటే.. కనీసం 5000 ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుందని అంచనా. వాటి నిర్మాణానికి 7 కోట్ల టన్నుల పదార్థాలు అవసరమవుతాయి.


ఇది ఇప్పటిదాకా మానవజాతి అంతరిక్షంలోకి పంపిన మొత్తం బరువు కంటే 1500 రెట్లు ఎక్కువని అంచనా. అక్కడితో అయిపోలేదు.. ఆ శాటిలైట్లలో వాడే కొన్ని భాగాలను భూమ్మీద నుంచే లాంచ్‌ చేయాలని, చంద్రుడిపై తవ్వితీసిన కొన్ని ఖనిజాల సాయంతో వాటి నిర్మాణాన్ని పూర్తిచేయాలని నివేదిక పేర్కొంది.

ధూళిమేఘం: భారీ ధూళి మేఘాన్ని సృష్టించడం ద్వారా సూర్యకాంతిని నిరోధించే పదార్థాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టడం రెండో ప్రతిపాదన. ఆ మేఘం చెదిరిపోకుండా ఉండేందుకు.. వికర్షణ విద్యుత్‌ క్షేత్రాలను సృష్టించే ప్రత్యేక అంతరిక్ష నౌకలను ఉపయోగించాలని నివేదికలో పేర్కొన్నారు. శాటిలైట్ల సమూహాన్ని పంపే ప్రతిపాదనతో పోలిస్తే.. ఈ విధానం ద్వారా రోదసిలోకి పంపే పదార్థాల బరువు కొన్ని వందల రెట్లు తక్కువగా ఉంటుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 02:47 AM