వైభవ్‌ను ఆడించాలనే ఉద్దేశం లేకపోతే స్వదేశానికి పంపించండి: ఆకాశ్ చోప్రా
ABN , Publish Date - Nov 01 , 2026 | 07:18 AM
న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి రావడంతో వైభవ్‌ను పక్కన పెట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం గాయపడిన ఆటగాళ్ల స్థానంలోనే వైభవ్‌కు అవకాశాలు ఇస్తారా? అని టీమ్ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులోనైనా వైభవ్‌కు అవకాశం దక్కుతుందా? అని ప్రశ్నించాడు.
‘మూడో టీ20లో అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు. వైభవ్ సూర్యవంశీ కూడా అర్ధసెంచరీకి చేరువలో నిలిచాడు. బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ ఫిట్‌గా తిరిగొస్తే ఎవరిని పక్కన పెట్టాలనే ప్రశ్న రావడం సహజమే. తాత్వికంగా ఆలోచిస్తే.. గాయపడిన కిషన్ స్థానంలో వచ్చిన వైభవ్‌నే తప్పించాలి. కానీ వైభవ్ సూర్యవంశీకి ఎవరైనా గాయపడినప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు మాత్రమే అవకాశం ఇస్తారా? అదే మీ ఆలోచన అయితే అతడిని ఇంటికి పంపించేయండి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పండి. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం వల్ల కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఎక్కువ కాలం మ్యాచ్‌లు ఆడకుండా ఉండటం వల్ల ఉపయోగం ఏముంటుంది? అతడు బ్యాట్‌తో బంతిని ఎదుర్కొంటూ ఎక్కువ సమయం క్రీజులో గడపాలి.
వైభవ్ విషయంలో తమ రోడ్‌మ్యాప్ ఏంటి? ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? అనే విషయాలను జట్టు యాజమాన్యం బయటపెట్టాలి. బహుశా ఇప్పటికే అతడి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉండవచ్చు. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అసలు వైభవ్‌తో ఏం చేయాలనుకుంటున్నారో మాకు తెలియడం లేదు. అతడిని తుది జట్టులోకి తీసుకోకపోవడం కొంత నిరాశ కలిగించింది’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!