Share News

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య

ABN , Publish Date - Oct 31 , 2026 | 10:11 AM

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ప్రశంసలు కురిపించాడు. ఈ 15 ఏళ్ల యువ క్రికెటర్‌కు భారత జట్టు స్వేచ్ఛనివ్వాలని సూచించాడు.

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
Sanath Jayasuriya

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ప్రశంసలు కురిపించాడు. ఈ 15 ఏళ్ల యువ క్రికెటర్‌కు భారత జట్టు స్వేచ్ఛనివ్వాలని సూచించాడు. అతడిపై అనవసర అంచనాలు, ఒత్తిడి పెంచకుండా సహజసిద్ధమైన ఆట ఆడేందుకు ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డాడు. వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తుకు మంచి పెట్టుబడి అని పేర్కొన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు.. వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.


‘వైభవ్‌కు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అతడు భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్తు. తన సహజమైన ఆటను ఆడనివ్వండి. అతడి పని అతడిని చేసుకోనివ్వండి. అలా చేస్తే భారత క్రికెట్‌కు అతడు మంచి పెట్టుబడిగా మారతాడు. వైభవ్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడి సహజమైన ఆటతీరులో జోక్యం చేసుకోకుండా ఎదిగేందుకు అవకాశం కల్పించాలి. భారత జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ విషయానికి వస్తే.. అతడు ఆల్‌రౌండర్ బ్యాటర్. అతడి ఆటలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. మైదానంలోని అన్ని వైపులా షాట్లు ఆడగలడు. అదే అతడి గొప్పతనం’ అని జయసూర్య తెలిపాడు.


భారత పర్యటనపై శ్రీలంక గురి..

డిసెంబర్‌లో భారత్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌కు ముందు తమ జట్టు సన్నద్ధతపై జయసూర్య సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక ప్రదర్శన తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు. ‘భారత పర్యటనకు ముందు మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. వారు మంచి క్రికెట్ ఆడుతున్నారు. భారత్‌లోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తారని ఆశిస్తున్నా. ఆటగాళ్లు భారీగా పరుగులు చేయడం, పెద్ద లక్ష్యాలను ఛేదించడం చూడటానికి చాలా బాగుంది. ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమే. అయితే బ్యాటర్ల దూకుడు బౌలర్లపై ఒత్తిడిని కూడా పెంచుతోంది’ అని జయసూర్య వివరించాడు.


ఇవి కూడా చదవండి:

మా అమ్మ సూచనతోనే 45.. జెర్సీ వెనుక అసలు కథ వెల్లడించిన రోహిత్ శర్మ!

అభిషేక్, ఇషాన్, వైభవ్‌లను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిందే: యువరాజ్ సింగ్

Updated Date - Oct 31 , 2026 | 10:11 AM