మరో 24 కరువు మండలాలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:07 AM
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 388 కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 8 జిల్లాల్లో మరో 24 కరువు మండలాలను ప్రకటించింది. వీటిలో 12 తీవ్ర కరువు, 12 మధ్యస్త కరువు మండలాలుగా నిర్ణయించింది.
412కు చేరిన మొత్తం సంఖ్య
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 388 కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 8 జిల్లాల్లో మరో 24 కరువు మండలాలను ప్రకటించింది. వీటిలో 12 తీవ్ర కరువు, 12 మధ్యస్త కరువు మండలాలుగా నిర్ణయించింది. రెవెన్యూ-విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శనివారం ఈమేరకు నోటిఫికేషన్ జారీచేశారు. మార్కాపురం జిల్లా రాచర్ల, కర్నూలు జిల్లా ఆస్పరి, నందవరం, ఆదోని-2, కోసిగి, మంత్రాలయం, కల్లూరు, అనంతపురం జిల్లా రాయగడ్, పెద్దపప్పూరు, శ్రీసత్యసాయి జిల్లా రోళ్ల, ఆగలి, పెనుగొండలను తీవ్ర కరువు మండలాలుగా, కాకినాడ జిల్లా జగ్గంపేట, కృష్ణా జిల్లా మచిలీపట్నం సౌత్, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల, పెదపాడు, చాట్రాయి, నూజివీడు, ముసునూరు, ఏలూరు రూరల్, ఆగిరిపల్లి, కడప జిల్లా ఒంటిమిట్ట, సిద్ధవటం, నందలూరులను మధ్యస్త కరువు మండలాలుగా ప్రకటించారు.
కాగా అక్టోబరు 1న 21 జిల్లాల్లో 388 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన 24తో కలిపి మొత్తం కరువు మండలాల సంఖ్య 412కు చేరింది. వీటిలో 295 తీవ్ర కరువు మండలాలు, 117 మధ్యస్త కరువు మండలాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం లోటు, పంటల సాగు విస్తీర్ణం తగ్గుదల ఆధారంగా కరువు మండలాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ మండలాల రైతులు రుణ సౌకర్యం పొందటానికి, సహాయక చర్యలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!