రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా పడి వ్యక్తి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
ABN , Publish Date - Nov 01 , 2026 | 09:39 AM
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 1: జిల్లాలోని చేవేళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో అదుపు తప్పిన కారు.. బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కాగా.. అతివేగంతో పాటు, బ్రిడ్జి కుంగిపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. జిల్లాలోని చేవెళ్ల మండల పరిధిలోని పామెన గేటు సమీపంలోని బ్రిడ్జి వద్ద.. అతివేగం కారణంగా ఓ కారు అదుపుతప్పి.. అవతలి రోడ్డుపై బోల్తా పడింది. గమనించిన వాహనదారులు, స్థానికులు హుటాహుటిన అంబులెన్స్‌కు సమాచారం అందించి.. స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఆధారాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ప్రమాదానికి గురైన వారు షాబాద్ మండలం పొత్గల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గౌడ్, మురళి గౌడ్, ఒగ్గు వెంకటయ్య, కార్ల శివకుమార్‌గా పోలీసులు గుర్తించారు. తీవ్రమైన గాయాలవడంతో రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం బాధితులను హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు.
బ్రిడ్జి కుంగడమే ప్రమాదానికి కారణమా?
ఈ ప్రమాదానికి కారు అతివేగంతో ప్రయాణించడం ఒక కారణమైతే, వర్షపు నీరు వెళ్లేందుకు నిర్మించిన చిన్న బ్రిడ్జిపై రోడ్డు కుంగిపోవడం కూడా కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే బ్రిడ్జి వద్ద గతంలోనూ ప్రమాదం జరిగి.. పొత్గల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. ఒకే ప్రాంతంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బ్రిడ్జిపై ఉన్న రోడ్డును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!