Share News

రేషన్‌ బియ్యం పంపిణీలో గోల్‌మాల్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:27 PM

తూకాల్లో మోసం చేసిన రేషన్‌ డీలర్లను సస్పెండ్‌ చేస్తున్న అధికారులు ఆ తప్పు తమ వద్ద జరుగుతున్నప్పటికీ కట్టడి చేయడంలేదు. ఒక్కోబస్తాలో 6-7 కిలోలు తక్కువ ఉండటంతో డీలర్లు నష్టపోతున్నారు.

రేషన్‌ బియ్యం పంపిణీలో గోల్‌మాల్‌
Warangal Ration Rice

  • తూకం వేయకుండానే సరఫరా చేస్తున్న ఇన్‌చార్జులు

  • బస్తాకు 6-7కిలోలు తక్కువగా వస్తున్నాయంటున్న డీలర్లు

వరంగల్‌: తూకాల్లో మోసం చేసిన రేషన్‌ డీలర్లను సస్పెండ్‌ చేస్తున్న అధికారులు ఆ తప్పు తమ వద్ద జరుగుతున్నప్పటికీ కట్టడి చేయడంలేదు. ఒక్కోబస్తాలో 6-7 కిలోలు తక్కువ ఉండటంతో డీలర్లు నష్టపోతున్నారు. మిల్లింగ్‌ దగ్గరే ఈ మోసం జరుగుతుండగా అధికారులు ఆ తప్పును డీలర్లపై వేసి చేతులు దులుపుకుంటున్నారు. నిబంధనల ప్రకారం స్టేజీ-1 గోదాములకు వచ్చిన బియ్యాన్ని స్టేజ్‌-2 గోదాములలో నిల్వచేసుకొని అక్కడ నుంచి డీలర్లకు అందించాలి. అది కూడా డీలర్‌ వేలిముద్ర(బయోమెట్రిక్‌) తీసుకున్నాకే బియ్యం బస్తాలను తూకం వేసి లారీలో లోడింగ్‌ చేసి పంపించాలి.


కానీ, అందుకు విరుద్ధంగా గోదాము వద్దకు డీలర్‌ వెల్లకముందే డీలర్‌కు ఫోన్‌చేసి మీకు ఓటీపీ వచ్చింది చెప్పండని గోదాముల ఇన్‌చార్జులు అడుగుతున్నారు. ఓటీపీ ఏంటని ప్రశ్నిస్తే బియ్యం ఎప్పుడు వస్తాయోనన్న భయంతో డీలర్లు ఓటీపీ చెబుతున్నారు. దీంతో డీలర్‌ లేకుండానే.. తూకం వేయకుండానే డీలర్లకు బియ్యం పంపిస్తున్నారు. అలా వచ్చిన బియ్యాన్ని డీలర్లు తూకం వేస్తే ఒక్కో బస్తాలో 6నుంచి 7 కిలోలు తక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రజలకు పంపిణీ చేస్తున్న సమయంలో తక్కువ తూకం వేస్తున్నారని తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని, తమ మాట వినని వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.


hnk2.2.jpgగోదాం ఇన్‌చార్జుల చేతివాటం..

50కిలోల బియ్యం బస్తాలు లారీలలో లోడింగ్‌ అన్‌లోడింగ్‌ చేసే సమయంలో కొంత తరుగు పోతుంది. అది మిల్లింగ్‌ అయినప్పటి నుంచి డీలర్‌ షాప్‌కు చేరేవరకు ఒక బస్తాకు కనీసం 2కిలోల బియ్యం లోటు ఉంటుంది. కాని ఇటీవల డీలర్లకు పంపిణీ చేసిన బస్తాల్లో 6-7 కిలోలు తక్కువగా ఉంటున్నాయి. ఆలోటును పూడ్చడానికి డీలర్లకు స్టేజ్‌-2 గోదాముల నుంచి బియ్యం తూకం వేసి లారీల్లో లోడింగ్‌ చేసినప్పుడే ప్రతి 100 క్వింటాళ్ల బియ్యానికి 2 క్వింటాళ్ల బియ్యం అనదంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే డీలర్‌ గోదాముకు రాకుండానే తూకం వేయకుండానే ఓటీపీ విధానంలో బియ్యం రేషన్‌షాపులకు పంపించడం ద్వారా డీలర్లకు ఇవ్వాల్సిన అదనపు బియ్యాన్ని గోదాముల ఇన్‌చార్జులు నొక్కెస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.


తూకంలో తేడాలు వస్తే డీలర్లపై కేసులు పెడుతున్న జిల్లా అధికారులు గోదాముల వద్ద తూకాల్లో మోసాలకు పాల్పడేవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డీలర్లు ప్రశ్నిస్తున్నారు.కాగా, గత ఆగస్టులో మూడునెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన తర్వాత నవంబరు నెల బియ్యం పంపిణీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. జిల్లాలో 509 రేషన్‌షాపులు ఉండగా 15రోజుల ముందే రేషన్‌షాపులకు బియ్యం సరఫరా చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

దీపావళికి స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ అమ్మకాల్లో రికార్డులు

చర్లపల్లి-రక్సాల్‌ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 12:28 PM