ధరణి భూ అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు.. 15 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో సోదాలు
ABN , Publish Date - Nov 07 , 2026 | 10:13 AM
ధరణి పోర్టల్‌లో భూ రికార్డుల అక్రమ మార్పుల వ్యవహారం తెలంగాణలో మరోసారి కలకలం రేపుతోంది. భూముల రికార్డులను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై సీఐడీ కొరడా ఝళిపించింది.
హైదరాబాద్, నవంబర్ 7: నగరంలో ధరణి భూ రికార్డుల అక్రమాల వ్యవహారంపై సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా 15 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ అధికారులు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, గజ్వేల్, భువనగిరి ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు.
ధరణి పోర్టల్‌లో భూ రికార్డులను అక్రమంగా మార్చడం, భూముల వివరాల్లో తారుమారు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా భూ లావాదేవీలకు సహకరించడం వంటి ఆరోపణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో పలువురు ధరణి ఆపరేటర్లు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో నలుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా భూదాన్ భూములకు సంబంధించిన బై నెంబర్లలో జరిగిన అక్రమ మార్పులు, భూ రికార్డుల మాయంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఫోరెన్సిక్ ఆడిట్లో కీలక ఆధారాలు.. అసలు సూత్రధారుల కోసం సీఐడీ వేట..
ధరణి భూ అక్రమాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు సీఐడీ అధికారులు సాంకేతిక ఆధారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో పలు కీలక డిజిటల్ ఆధారాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్‌లో భూ రికార్డులను ఎవరు మార్చారు? ఎప్పుడు మార్పులు చేశారు? ఎవరికి లబ్ధి చేకూరేలా ఈ అక్రమాలకు పాల్పడ్డారు? అనే కోణాల్లో అధికారులు ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ధరణి ఆపరేటర్లు, ప్రైవేటు వ్యక్తుల పాత్రతో పాటు ఈ వ్యవహారంలో వారికి సహకరించిన ఇతర వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుల విచారణ ద్వారా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భూదాన్ భూముల బై నెంబర్ల వ్యవహారంలో జరిగిన అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ అక్రమాల ద్వారా ఎంతమేర భూముల రికార్డులను తారుమారు చేశారు? అనే అంశాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమాలకు పాల్పడిన ప్రధాన వ్యక్తులను గుర్తించి వారి పాత్రను నిర్ధారించే దిశగా అధికారులు వేట కొనసాగిస్తున్నారు.
ఇవీ చదవండి:
కర్ణాటకలో పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్
తరుణ్ తేజ్‌పాల్ శిక్ష నిలిపివేతకు సుప్రీం నో