Share News

వా‘నర’ గోస.. వరంగల్‌లో కోతుల స్వైరవిహారం

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:21 AM

వరంగల్‌ నగర ప్రజలకు వానర సైన్యం భయం పట్టుకుంది. నగరంలోని 66 డివిజన్‌లలో వానర సైన్యం సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

వా‘నర’ గోస.. వరంగల్‌లో కోతుల స్వైరవిహారం
Monkeys, Warangal city

  • భయంతో వణికిపోతున్న మహిళలు, పిల్లలు

  • బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ పరార్‌

  • దృష్టిసారించని మునిసిపల్‌ హెల్త్‌ అధికారులు

వరంగల్‌: వరంగల్‌ నగర ప్రజలకు వానర సైన్యం భయం పట్టుకుంది. నగరంలోని 66 డివిజన్‌లలో వానర సైన్యం సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి దూరి నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు ఎత్తుకుని వెళ్లి ఇండ్ల పైకప్పులు, డాబాలపై తిష్ట వేసి తిని వ్యర్థాలను అక్కడే వదిలేసి వెళుతున్నాయి. ఇటీవల శివనగర్‌, మట్టెవాడ, బ్రాహ్మణవాడతో కోతుల గుంపులు మహిళలపై దాడి చేసి కొరకడంతో ఎంజీఎంలో చికిత్స చేయించుకున్నట్టు బాధితులు తెలిపారు.


అయితే గృహిణులు, చిన్నపిల్లలు కోతుల భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. నగరంలో కోతులను పట్టేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి మంకీ క్యాచర్స్‌ (కోతులు పట్టేవారు)కు చెల్లించాల్సిన 8 మాసాలకు సంబంధించిన రూ.6లక్షల బకాయిలు జీడబ్ల్యూఎంసీ పూర్తిగా చెల్లించకపోవడంతో వెళ్లిపోయినట్టు సిబ్బంది తెలిపారు. దీనిపై పబ్లిక్‌ హెల్త్‌ సెక్షన్‌ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యానికి తోడు కోతులు పట్టే కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది.


hnk1.jpgకాంట్రాక్టర్‌కు బకాయిలు

వరంగల్‌ నగరంలోని ఏటా కోతులు పట్టి అటవీ ప్రాంతాల్లో వదిలేయడానికి మార్చిలో ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లు పిలుస్తారు. 2026కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శివయ్య ఏజెన్సీ టెండరు దక్కించుకున్నారు. ఒక్కో కోతికి రూ.610 కార్పొరేషన్‌ చెల్లించాలని అగ్రిమెంట్‌ జరిగింది. కాగా, శివయ్యతో కూడిన పది మంది బృందం వరంగల్‌ ప్లానిటోరియం పక్కన గుడిసెలు వేసుకుని పని చేస్తున్నారు. కోతుల గుంపులు ఉన్న ప్రాంతాలు, ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులపై స్పందించి ఆయా ప్రాంతాల్లో బోన్లు, జాలీలు ఏర్పాటు చేసి నెలకు సుమారు 200 నుంచి 300 వరకు కోతులను పట్టి ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వదిలి వేశారు.


అలా మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు కోతులను పట్టి ఇతర ప్రాంతాలను తరలిస్తున్నా.. కాంట్రాక్టర్‌కు జీడబ్ల్యూఎంసీ నుంచి అందించవలసిన బిల్లులు చెల్లించక పోవడంతో ఇక్కడి నుంచి రాత్రికి రాత్రే వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం మునిసిపల్‌ అధికారులు తిరిగి ఆన్‌లైన్‌ ద్వారా కోతులు పట్టేందుకు టెండర్లు పిలవడంపై పాత కాంట్రాక్టర్‌ శివయ్య జీడబ్ల్యూఎంసీ అధికారులపై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోతుల కాంట్రాక్టర్‌ పెండింగ్‌ బకాయిలను విడుదల చేసి తిరిగి మంకీ క్యాచర్లను రప్పించి వరంగల్‌ నగర ప్రజలకు కోతుల బెడద నుంచి విముక్తి కలిగించాలని నగర ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాలుష్య కారక సంస్థలపై పీసీబీ కొరడా

హైదరాబాద్‌‌లో మహిళ దారుణ హత్య..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 11:27 AM