Share News

ఫరీదాబాద్ కాల్పుల కేసు.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్

ABN , Publish Date - Nov 12 , 2026 | 09:49 AM

నవంబర్ 5న జరిగిన ఫరీదాబాద్‌ కాల్పుల ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది.

ఫరీదాబాద్ కాల్పుల కేసు.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్

ఇంటర్నెట్ డెస్క్: ఈనెల 5వ తేదీన జరిగిన ఫరీదాబాద్‌ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ స్థలం కోసం వివాదం ఏర్పడటంతో పరమ్‌జీత్ ధన్‌కర్ అనే వ్యక్తిపై నిందితుడు మోహన్ శర్మ 15 నుంచి 16 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ధన్‌కర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. పోలీసుల దర్యాప్తులో ఈ కాల్పులకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ఇందులో మోహన్ శర్మ మొదట పరమ్‌జీత్ ధన్‌కర్‌తో వాగ్వాదానికి దిగటం కనిపించింది. తరువాత వీరి మధ్య మాటామాటా పెరిగింది. ధన్‌కర్‌తో పాటు ఆయన కుమారుడూ అక్కడే ఉన్నాడు. అతడు కూడా గొడవలో జోక్యం చేసుకుని మోహన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా మోహన్ వివాదాన్ని ముగించడానికి ఇష్టపడలేదు. అతడు ధన్‌కర్‌ను ఏదో ప్రశ్నిస్తున్నట్టు వీడియోలో రికార్డ్ అయింది. ‘నీకు వితంతువు అంటే ఎవరో తెలుసా..? దేవుడిపై నీకు నమ్మకం ఉందా..?’ అంటూ మోహన్ ప్రశ్నించాడని సమాచారం. తరువాత మోషన్ తన దగ్గర ఉన్న తుపాకీ తీసి ఒక్కసారిగా ధన్‌కర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. వరుసగా అతడు 16 రౌండ్ల కాల్పులు జరిపాడు. అప్పుడే ధన్‌కర్ కుమారుడు అక్కడి నుంచి పారిపోయాడు.


ఈ కాల్పులకు సంబంధించి మరో సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో భవన ప్రవేశద్వారం (గేట్) వద్ద ధన్‌కర్‌పై నిందితుడు మరోసారి కాల్పులు జరపడం కనిపించింది. ఆ తరువాత ‘హ్యాపీ దీపావళి’ అని చెప్పి మోహన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా ధన్‌కర్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

అసలేం జరిగింది..?

సింగపూర్‌లో నివసిస్తున్న పరమ్‌జీత్ ధన్‌కర్.. మేనల్లుడి పెళ్లి కోసం కుటుంబంతో సహా ఫరీదాబాద్‌లోని సెక్టార్ 21Cకు వచ్చారు. అయితే పార్కింగ్ విషయంలో పొరుగింటి వ్యక్తి మోహన్ శర్మతో గొడవ జరిగింది. దీంతో మోహన్ తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. 16 రౌండ్ల కాల్పులు జరపగా.. ఏడు బుల్లెట్లు ధన్‌కర్ శరీరంలోకి దూసుకెళ్లాయి. కాల్పుల అనంతరం నిందితుడు కుటుంబంతో సహా పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలూ చదవండి

సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై ఉగ్ర దాడి

హరియాణా, మహారాష్ట్రల్లోపోలైన, లెక్కించిన ఓట్లలో తేడా!

Updated Date - Nov 12 , 2026 | 11:14 AM