22ఏ ఉచ్చులో పట్టా భూములు
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:02 AM
చేతిలో పట్టాదారు పాసుపుస్తకం ఉంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమి ఉంది. పాత పహాణీలు, రిజిస్ర్టేషన్ దస్తావేజులు, వారసత్వ పత్రాలు ఉన్నాయి. అయినా ఆ భూమిని అమ్ముకోలేని పరిస్థితి.
రికార్డుల్లో తప్పిదం.. రైతుల చేతుల్లో కన్నీటి పత్రాలు
అమ్ముకోలేరు.. కొనేవారు ముందుకు రారు..
నిషేధిత జాబితా నుంచి విముక్తి కోసం ఎదురుచూపులు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫాస్ట్‌ట్రాక్‌తో పరిష్కారం లభించేనా?
హనుమకొండ: చేతిలో పట్టాదారు పాసుపుస్తకం ఉంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమి ఉంది. పాత పహాణీలు, రిజిస్ర్టేషన్ దస్తావేజులు, వారసత్వ పత్రాలు ఉన్నాయి. అయినా ఆ భూమిని అమ్ముకోలేని పరిస్థితి. ఇందుకు కారణం రెవెన్యూ రికార్డుల్లో అది 22ఏ నిషేధిత జాబితాలో కనిపించడం. ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాల నమోదులో జరిగిన తప్పిదాల కారణంగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ప్రైవేటు పట్టా భూములు నిషేధిత జాబితాలోకి చేరినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ భూమి ప్రభుత్వ భూమి కాదని నిరూపించుకునేందుకు పాత రికార్డులు చేతబట్టుకుని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి పరిస్థితి నెలకొంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సరిచేసుకోవడానికి నానా తం టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాస్‌పుస్తకం ఉంది.. అమ్ముకోలేని దుస్థితి
22ఏలో భూమి ఉన్నట్లు రిజిస్ర్టేషన్ సమయంలో తేలితే లావాదేవీ నిలిచిపోతోంది. దీం తో పిల్లల చదువులు, వివాహాలు, వైద్య ఖర్చు లు, అప్పుల చెల్లింపుల కోసం భూమిని విక్రయించాలనుకున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలుదారులు కూడా నిషేధిత జాబితాలో ఉన్న భూమిని కొనుగోలు చేసేందు కు వెనకడుగు వేస్తున్నారు. రికార్డులో తప్పు జరిగితే దాని భారాన్ని రైతే ఎందుకు మోయాలన్న ప్రశ్న బాధితుల నుంచి వస్తోంది.
జిల్లాలో 85వేల ఎకరాలకు పైగా..
హనుమకొండ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 85 వేల ఎకరాలకు పైగా భూమి 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు రెవెన్యూ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇందులో సుమారు 21వేల ఎకరాల అసైన్డ్ భూములు, రహదారులు, గుట్టలు తదితర ప్రభుత్వభూములుకలిపి సుమారు 58వేల ఎకరాలు, నాన్ అగ్రికల్చర్ కేటగిరీలో 6,128 ఎకరాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రికార్డుల్లో ప్రభుత్వ భూములు ఏవి? ప్రైవేటు పట్టా భూములు ఏవి? గతంలో ఎక్క డ తప్పిదాలు జరిగాయి? అన్నదానిపై సమగ్ర పరిశీలన అవసరమని రైతులు కోరుతున్నారు.
144 ఎకరాలు.. 44 దరఖాస్తులు
22ఏ నుంచి తమ భూములను తొలగించాలని కోరుతూ జిల్లాలో ప్రస్తుతం 44 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్ వెల్లడించారు. వీటి పరిధిలో సుమారు 144 ఎకరాలభూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఆధారాలు సమర్పించినప్పటికీ విచారణ ఆలస్యమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల, డివిజన్ స్థాయిలో ఈ దరఖాస్తులు వందల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక దరఖాస్తు పరిష్కారానికి పలు స్థాయిల్లో పరిశీలన అవసరం కావడంతో ప్రక్రియ సాగుతోందని అధికారులు చెబుతున్నా అత్యవసర అవసరాలున్న రైతులకు ప్రతిరోజు ఆలస్యమే భారం గా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫాస్ట్‌ట్రాక్‌పై రైతుల ఆశలు
22ఏ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ విధానం అమలు చేయాలని నిర్ణయించడం ఇందుకు కావాల్సిన చర్యలు చేపడుతుండటంతో బాధితులకు ఆశలు కలిగిస్తోంది. డీఐజీ సుభాషిణి నేతృత్వంలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే ఫిర్యాదులను రికార్డు చేస్తున్నారు. ఫిర్యాదులను, వినతులను సంబంధిత కలెక్టర్లకు పంపి చట్టపరంగా ఇబ్బందిలేని భూములు, ఆస్తుల రిజిస్ర్టేషన్ వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. కలెక్టరేట్ నుంచి ఆయా సంబంధిత మండలాల పరిధిలోకి ఫార్వర్డ్ చేస్తున్నారు. నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన ప్రైవేటు భూములను గుర్తించి, చట్టపరమైన సమస్యలు లేని కేసులను వేగంగా పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఫాస్ట్ ట్రాక్ అంటే కేవలం ఫైళ్లను
వేగంగా కదిలించడం కాకుండా పాత రికార్డుల పరిశీలన, హక్కు పత్రాల ధ్రువీకరణ, అవసరమైన చోట క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. దరఖాస్తుల పరిష్కారంగా కాకుండా గతంలో జరిగిన రికార్డుల తప్పిదాలను గుర్తించి సరిచేసే ప్రక్రియగా చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నిజమైన పట్టా భూమి అని నిర్ధారణ అయిన వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి లావాదేవీలకు అవకాశం కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఫాస్ట్ ట్రాక్ క్షేత్రస్థాయిలోనూ అదే వేగంగా అమలైతేనే 22ఏ ఉచ్చులో చిక్కుకున్న రైతులకు నిజమైన ఊరట లభిస్తుందని, రికార్డుల్లో జరిగిన తప్పిదానికి రైతులు ఏళ్ల తరబడి మూల్యం చెల్లించకుండా అర్హత ఉన్న ప్రతి భూమికి త్వరితగతిన విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News