Share News

భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Jan 28 , 2026 | 07:41 AM

భూపాలపల్లి జిల్లా సింగరేణి గనుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గనికి సంబంధించిన ల్యాంప్‌రూమ్‌లో మంటలు వ్యాపించాయి. గనిలో పనిచేసే కార్మికులకు సంబంధించిన 1500 ల్యాంప్‌లు మంటల్లో కాలిపోయాయి.

భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
Bhupalapalli Singareni Fire Accident

జయశంకర్ భూపాలపల్లి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణికి సంబంధించిన కేటీకే-5 గనిలో భారీ అగ్నిప్రమాదం(Bhupalapalli Singareni Fire Accident) జరిగింది. గని లోపలికి వెళ్లే కార్మికులకు సంబంధించిన ల్యాంప్ రూమ్(Lamp Room)లో ఈ మంటలు వ్యాపించడంతో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.


ప్రమాదం ఎలా జరిగిందంటే..

అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణమని తెలుస్తోంది. ల్యాంప్ రూమ్‌లో బ్యాటరీలకు ఛార్జింగ్ పెట్టే పాయింట్ల వద్ద విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే గది అంతా వ్యాపించాయి.


తప్పిన పెను ప్రమాదం..

ఈ ప్రమాద సమయంలో గని సిబ్బంది, కార్మికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ల్యాంప్ రూమ్ సమీపంలోనే పెట్రోల్‌ను కూడా భద్రపరిచారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన సిబ్బంది.. ప్రాణాలకు తెగించి పెట్రోల్ క్యాన్లను వెంటనే బయటకు తరలించారు. ఒకవేళ పెట్రోల్ నిల్వలకు మంటలు అంటుకుని ఉంటే అది భారీ పేలుడుకు దారితీసి గని ఉపరితల ప్రాంతం మొత్తం ధ్వంసమయ్యేదని కార్మికులు తెలిపారు.


భారీగా ఆస్తి నష్టం..

ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, సింగరేణి సంస్థకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సుమారు 1,500 మైనింగ్ ల్యాంప్‌లు(Cap Lamps) అగ్నిలో కాలిపోయినట్టు సింగరేణి అధికారులు వెల్లడించారు. వీటి విలువ దాదాపు రూ.50 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


వైరింగ్‌లో వచ్చిన సమస్యలతో..

సింగరేణిలో ప్రతి కార్మికుడికి ల్యాంప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చీకటి గనుల్లోకి వెళ్లేటప్పుడు ఈ ల్యాంప్స్ తప్పనిసరిగా వినియోగిస్తారు. 1,500 ల్యాంప్‌లు కాలిపోవడంతో తదుపరి షిఫ్ట్ కార్మికులకు ల్యాంప్‌ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల బొగ్గు ఉత్పత్తిపై కూడా కొంత ప్రభావం పడే ప్రమాదం ఉంది. మైనింగ్ రంగంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు. ల్యాంప్ రూమ్‌లలో వైరింగ్‌లో వచ్చిన సమస్యలతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన

ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 07:55 AM