Share News

మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన

ABN , Publish Date - Jan 26 , 2026 | 07:48 PM

నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఉదంతం అత్యంత బాధాకరం. విధి నిర్వహణలో ఒక మహిళా కానిస్టేబుల్‌పై ఇలాంటి దాడి జరగడం సభ్య సమాజాన్ని కలిచివేస్తోంది.

మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
Constable Soumya Incident

నిజామాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఉదంతం అత్యంత బాధాకరం. విధి నిర్వహణలో ఒక మహిళా కానిస్టేబుల్‌పై ఇలాంటి దాడి జరగడం సభ్య సమాజాన్ని కలిచివేస్తోంది. ప్రస్తుతం సౌమ్యకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై ఆమె సోదరుడు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.


ఈ పరిస్థితి ఇంకెవరికి రాకూడదు:శ్రవణ్

ఈనెల 23న మా అక్క ప్రమాదానికి గురైందని ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడు శ్రవణ్ తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. ఇంటికి రావడానికి టైం పడుతుందని.. టెన్షన్ పడొద్దని చెప్పి ఇంటి నుంచి వెళ్లిందన్నారు. ప్రమాదం అయ్యాక వేరొకరు కాల్ చేసి చెప్పారని తెలిపారు. మా అక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం చాలా విషమంగా ఉందని, వెంటిలేటర్ మీద ఆమె చికిత్స పొందుతోందని చెప్పుకొచ్చారు.


ఆర్థిక పరంగా అండగా ఉంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తమ కుటుంబానికి భరోసా కల్పించారని శ్రవణ్ తెలిపారు. ప్రభుత్వం.. అక్క వైద్యానికి అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారన్నారు. రెండు నెలలు ప్రిపేర్ అయి సౌమ్య కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిందని.. ఎప్పుడూ డ్యూటీ కోసం ఆలోచిస్తూనే ఉండేదని వివరించారు. తమ అక్కకు వచ్చిన పరిస్థితి ఇంకెవరికి రాకూడదని ఆవేదన చెందారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.


నిందితుల కోసం గాలిస్తున్నాం: సోమిరెడ్డి

ఈ ఘటనకు సంబంధించి నిజమాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. నాందేడ్ నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బంది మాధవనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారని సోమిరెడ్డి తెలిపారు. అనుమానస్పదంగా స్విఫ్ట్ డిజైర్ వాహనం ఆగినట్టుగా ఆగి కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం.. సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారని సోమిరెడ్డి తెలిపారు. మరో 48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు చెప్పారన్నారు. చికిత్సలో భాగంగా ఇప్పటికే ఆమె ఒక కిడ్నీని తొలగించారని.. ప్రమాదంలో శరీరంలో పక్కటెముకలు విరిగిపోయాయని వివరించారు. ఐదు టీమ్‌లతో నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పుకొచ్చారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హెచ్చరించారు. నిందితులపై గతంలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితులందరినీ నిర్మల్ వాసులుగా గుర్తించామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జాగృతి పార్టీలో చేరండి.. మహేశ్ గౌడ్‌కు కవిత ఆఫర్

సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 07:59 PM