ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jan 26 , 2026 | 07:06 PM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు చూపిన సమయస్ఫూర్తి వల్ల 19 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగా, ఆయనే మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ వద్ద విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు(38) చూపిన సమయస్ఫూర్తి వల్ల 19 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగా.. ఆయనే మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది. హైదరాబాద్(మియాపూర్) నుంచి విజయవాడ వెళ్తున్న అమరావతి బస్సు నడుపుతుండగా డ్రైవర్ నాగరాజుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
డ్రైవర్ అప్రమత్తతతో..
చావు అంచుల్లో ఉండి కూడా ప్రయాణికుల క్షేమం కోరిన ఆయన.. వెంటనే బస్సును అదుపుచేసి సర్వీస్ రోడ్డులో నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ఆపిన వెంటనే సిబ్బంది, స్థానికులు ఆయనను ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేరని చెప్పడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఈసీజీ(ECG) తీసిన వైద్యులు.. అప్పటికే ఆయన మరణించినట్లు నిర్ధారించారు. ఒకవేళ మొదటి ఆస్పత్రిలోనే సరైన చికిత్స అంది ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతుడు గొల్లపూడి(విజయవాడ)కు చెందిన నాగరాజు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇటీవల పెరిగిన గుండెపోటు కేసులు..
ఇటీవల డ్రైవింగ్ సమయంలో ఇలాంటి అకస్మాత్తు గుండెపోటు ఘటనలు ఎక్కువగా చూస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రాథమిక అవగాహనతో వారి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఛాతీలో విపరీతమైన నొప్పి, ఎడమ చేయి లేదా దవడ వైపు నొప్పి పాకడం, అకస్మాత్తుగా చెమటలు పట్టడం లాంటివి కనిపిస్తే.. వాహనాన్ని వెంటనే సురక్షిత ప్రాంతంలో ఆపి, ఇంజిన్ ఆఫ్ చేయాలన్నారు. సమీపంలో ఉన్నవారికి సమాచారం అందించి సీపీఆర్ లేదా అత్యవసర వైద్యం కోసం ప్రయత్నించాలని వైద్యులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాగృతి పార్టీలో చేరండి.. మహేశ్ గౌడ్‌కు కవిత ఆఫర్
సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు
Read Latest Telangana News And Telugu News