పెరుగుతున్న సన్నబియ్యం ధరలు..
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:39 AM
సన్నబియ్యం ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రైస్‌రేట్లు షాక్ ఇస్తున్నాయి.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాకు రూ.5,500
రెండునెలల్లో రూ.800 క్వింటాకు పెరుగుదల
లక్ష మంది వినియోగదారులపై భారం
జైశ్రీరాం రైస్‌కు డిమాండ్
తాజాగా ధాన్యం రేట్ రూ.4,355
కేసముద్రం(మహబుబాబాద్): సన్నబియ్యం ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రైస్‌రేట్లు షాక్ ఇస్తున్నాయి. ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ సాధారణ సన్నరకాలతో పాటు అతి సన్నరకాలైన జైశ్రీరాం బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ రెండు నెలల వ్యవధిలో క్వింటాకు రూ.800 చొప్పున పెరగడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ, అవి కొత్తబియ్యం కావడంతో అన్నం సరిగ్గా కావడంలేదని, కొంతమంది ఈ బియ్యాన్ని నిల్వ పెట్టుకొని అవి పాతపడేంతవరకు ప్రైవేటు షాపుల్లో బియ్యం కొనుగోలు చేస్తున్నారు.
అలాంటి వారితో పాటు మహబూబాబాద్ జిల్లాలో రేషన్‌కార్డులు లేని సుమారు లక్ష మంది వరకు ఈ బియ్యాన్ని బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో అధికంగా, గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిమంది అతిసన్న రకాలైన జైశ్రీరాం బియ్యం వినియోగిస్తున్నారు. వీరు కూడా రేషన్‌షాపుల్లో కాకుండా ప్రైవేటు షాపుల్లో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. గత రెండు నెలల క్రితం సాధారణ సన్నరకాలైన ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ బియ్యం క్వింటాకు హోల్‌సేల్‌లో రూ.4,700 నుంచి రూ.4,800 వరకు ఉం డగా, తాజాగా ఈ రకం బియ్యం క్వింటాకు రూ.5,200 నుంచి రూ.5,500 వరకు పెరిగింది. అలాగే అతిసన్న రకాలైన జైశ్రీరాం బియ్యం గత రెండు నెలల క్రితం క్వింటాకు రూ.5,600 నుంచి రూ.5,800 ఉండగా, తాజాగా రూ.6100 నుంచి రూ.6200 లకు పెరిగింది. ఈ ధరలు కేవలం హోల్‌సేల్ మార్కెట్‌లోనివి రిటైల్ మార్కెట్లలో ఈ రేటుకు అదనంగా రూ.300 నుంచి రూ.500 కలుపుకొని ఉంటాయి.
వడ్ల ధరల పెరుగుదలతో..
వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం ధరలు పెరుగుతుండడంతో బియ్యం రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేసముద్రం కేంద్రంగా కొనసాగుతున్న సన్నబియ్యం వ్యాపారం ఈ ధరల పెరుగుదలతో బిజినెస్ మందగించింది. గత రెండునెలలుగా మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ రకాల ధాన్యం క్వింటాకు రూ.2300 నుంచి రూ.2400 వరకే ఉండగా, తాజాగా రూ.2800 నుంచి రూ.3300 వరకు ధరలు నమోదవుతున్నాయి. అలాగే రెండు నెలల క్రితం జైశ్రీరాం రకం ధాన్యం క్వింటాకు రూ.2500 నుంచి రూ.2800 ఉండగా, తాజాగా క్వింటాకు రూ.3400 నుంచి రూ.4100 వరకు ధరలు ఉండడంతో పాటు తాజాగా గురువారం గరిష్ఠ ధర రూ.4,355 వరకు వెళ్లడం రికార్డులు నెలకొల్పొతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక వరిసాగుపై విపరీతమైన ప్రభావం ఉండడంతో రాబోయే రోజుల్లో ధాన్యం సరఫరా ఉండబోదనే అంచనాలతో వడ్ల ధరలు మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి అనుగునంగానే బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి.
జిల్లాలో లక్ష మంది బియ్యం వినియోగదారులు..
జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 7,74,549 మంది జనాభా ఉండగా, దశాబ్దకాలంలో జనాభా వార్షిక వృద్ధిరేటు 8.7శాతం ఉంది. ఈ ప్రకారం ప్రస్తుత జిల్లా జనాభా 9 లక్షల వరకు ఉంటుందని అంచనా! జిల్లాలో ఈ ఆగస్టు నెలలో 2,79,029 రేషన్‌కార్డులుండగా, ఇందులో అంత్యోదయ ఆహార భద్రత కార్డు (ఏఎ్‌ఫఎ్‌ససీ)లు 16,793 ఉండగా వీటిలో 46,194 మంది లబ్ధిదారులు, ఆహార భద్రత కార్డు (ఎఫ్ఎస్సీ)లు 2,62,234 ఉండగా, ఇందులోని 7,78,079 మంది, అంత్యోదయ అన్నయోజన(ఏఏపీ) కార్డులు రెండు ఉండగా, ఐదుగురు సభ్యులు వెరసి 8,24,278 మం ది సభ్యులు ఉన్నారు.
జిల్లా జనాభాలో సుమారు 75వేల మందికి రేషన్‌కార్డు అర్హత లేనివారు ఉన్నారు. వీరితో పాటు అతిసన్న బియ్యం జైశ్రీరాం రకా న్ని వినియోగించే వారితో కలుపుకొని సుమారు లక్ష మంది ప్రైవేటులో బియ్యం కొనుగోలుదారులు ఉంటారని అంచనా. కేసముద్రం కేంద్రంగా ఇక్కడి మి ల్లుల్లో ఉత్పత్తి అయిన సన్నబియ్యం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఎగుమతి అయ్యేది. సీజన్‌ల వారీగా ఏడాదికి సరిపోను బియ్యం ఇక్కడ కొనుగో లు చేసుకొని ఇళ్లలో నిల్వలు పెట్టుకునేవారు. దూర ప్రాంతాల్లోని వారు కేసముద్రంలోని మిల్లుల నుంచి బియ్యం కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు.
ప్రస్తుతం పెరిగిన బియ్యం ధరలతో అమ్మకాల జోరు తగ్గింది. 500 క్వింటాళ్లు విక్రయించే ఓ వ్యాపారి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకం తర్వా త 10 క్వింటాళ్లు కూడా విక్రయించలేదని చిరువ్యాపారులు చెబుతున్నారు. సన్నరకాలైన ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ రకాల అమ్మకాలు పడిపోగా, ప్ర స్తుతం ‘జైశ్రీరాం’లాంటి అతిసన్నరకాల బియ్యం పట్టణ ప్రాంతాలకు ఎగుమతులు అవుతున్నాయి. ఏదేమైనా ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ప్రత్యక్షంగా వ్యవసాయంపై పరోక్షంగా బియ్యం వినియోగదారులపై ప్రభావం చూపి ఆర్థిక భారం పెంచుతోందనేది వాస్తవం.
కేసముద్రంలో బియ్యం హోల్‌సేల్ ధరలు క్వింటాకు
రకం - జూన్‌లో - ఆగస్టులో
ఆర్‌ఎన్‌ఆర్/హెచ్‌ఎంటీ - రూ.4600 - రూ.5500
జైశ్రీరాం - రూ.5600 - రూ.6300
ఈ వార్తలు కూడా చదవండి:
ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్ రైళ్లు
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News