Share News

తొలకరి వానలకే తొందరపడొద్దు..

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:22 AM

తొలకరి వానలు పడగానే విత్తనాలు నాటేందుకు తొందర పడవద్దని రైతులకు వరంగల్‌ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అదనపు సంచాలకుడు రీసెర్చ్‌ ఎం.శ్రీధర్‌ వివరించారు.

తొలకరి వానలకే తొందరపడొద్దు..
Agriculture News,

  • దుక్కులు సిద్ధం చేసుకుంటే తేమ పెరుగుతుంది

  • భూసార పరీక్షల ద్వారా పంటలను ఎంపిక చేసుకోవాలి

  • విత్తనాల ఎంపికపై రైతులు శ్రద్ధ పెట్టాలి

వరంగల్‌: తొలకరి వానలు పడగానే విత్తనాలు నాటేందుకు తొందర పడవద్దని, సరైన వర్షపాతం, అనువైన సమయం రాకముందే విత్తనాలు నాటితే ఆశించిన స్థాయిలో మొలకలు రావని, తొలకరికి ముందే భూసార పరీక్షలు చేయించుకోవాలని, పొలంగట్లను సిద్ధం చేసుకోవాలని, నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని వరంగల్‌ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అదనపు సంచాలకుడు రీసెర్చ్‌ ఎం.శ్రీధర్‌ వివరించారు. ఇప్పుడిప్పుడే తొలకరి ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లా రైతాంగానికి ఆయన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.


సరైన వర్షపాతం..

తొలకరి వర్షాలకే విత్తనాలు విత్తుకోవడం మంచిది కాదు. సరైన వర్షపాతం, అనువైన సమయం రాకముందే విత్తనాలు విత్తుకోవడం వల్ల రైతులు నష్టాల పాలవుతారు. కనీసం 70 మి.మీ. వర్షం కురిశాక నాటితేనే వంద శాతం మొలక వస్తుంది. పొడి దుక్కుల్లో విత్తితే మొలకలు రావు.


ముందస్తు దుక్కులు దున్నడం..

దుక్కులు సిద్ధం చేసుకుని ఉంటే తొలకరి వర్షాలు పడగానే భూమి నీటిని బాగా పీల్చుకుంటుంది. దీనివల్ల తేమశాతం పెరుగుతుంది. వాలుకు అడ్డంగా దున్నితే వర్షపు నీరు ఎక్కువగా నిలుస్తుంది. తోటల్లో ఉండే మొండి జాతి కలుపు మొక్కలు, దుంపలు వేళ్లతో సహా బయటకు ఊడి వస్తాయి. నిద్రావస్థలో ఉన్న పలు కీటకాలు నశిస్తాయి.


city4.jpgభూసార పరీక్షలు

భూసార పరీక్షలు చేయించుకుంటే భూమిలో పోషక విలువల స్థాయి తెలుస్తుంది. దాన్ని బట్టి ఏ పంటలు వేసుకోవాలో తెలుస్తుంది. ముఖ్యంగా ఏడాదికి ఒకటి, రెండు పంటలు పండించే భూముల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రాల్లో అందజేయాలి. వారి సూచనల మేరకు పంట సాగు చేసుకోవడం మంచిది.


పొలం గట్ల తయారీ

పంటలపై తీసుకునే శ్రద్ధ పొలం గట్లపై, నీటి కాల్వలపై తీసుకోవడం లేదు. దీంతో వివిధ రకాలైన ఒయ్యారి భామ, మాల మాతంగి, నీరు గొబ్బి, గొంగల గరకు, గరక రాకాసి, తుంగ వంటి మొక్కలు పెరిగి పంటలకు వివిధ తెగుళ్లు వచ్చేందుకు కారణమవుతాయి. వేసవిలోనే తప్పనిసరిగా పొలం గట్లు, కాల్వల్లో కలుపు లేకుండా చూసుకోవాలి.


విత్తనాల ఎంపికే ముఖ్యం

తాలు గింజలు, కలుపు విత్తనాలు వేరు చేసి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. సర్టిఫైడ్‌ విత్తనం, పరిశోధన స్థానం నుంచి సేకరించిన విత్తనాలను కాని తీసుకోవాలి. మొలక శాతం తెలుసుకోకుండా నారు పోయకూడదు. ఎంపిక చేసిన విత్తనాలను తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ది చేసిన 12 గంటల తరువాతనే విత్తనాన్ని భూమిలో విత్తుకోవాలి.


పచ్చిరొట్ట సాగు

తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద మొదలైన పంటలను పండించి భూమిలో దున్నాలి. దీంతో ఎకరాకు 20 నుంచి 30 కిలోల యూరియాను ఆదా చేయవచ్చు. భూమి ఆరోగ్యంగా ఉంటుంది. జనుము, పిల్లి పిసరలు ఎరువులుగానే కాకుండా పశువుల మేతకు ఉపయోగపడుతాయి.


విత్తనాలు విత్తేందుకు అనువైన సమయం

  • జూన్‌ రెండో వారం నుంచి జూలై 20 వరకు పత్తి విత్తనాలు వేసుకోవచ్చు.

  • జూన్‌ నుంచి జూలై మూడవ వారం వరకు మొక్కజొన్నలు విత్తుకోవచ్చు.

  • జూన్‌ రెండో వారం నుంచి జూలై రెండో వారం వరకు కందులు విత్తుకోవచ్చు.

  • నీటి వసతిని బట్టి జూలై నుంచి మిరప నారు పోసుకోవాలి. సెప్టెంబరు మొదటి వారం వరకు మొక్కలు నాటుకునేలా చూడాలి.

  • జూన్‌ ఆరంభం నుంచి చివరి వరకు వరి నార్లు పోసుకోవడానికి అనువైన కాలం.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 10:22 AM