Share News

హనీమూన్‌కు భర్తతో పాటు అత్తమామలు! యువతికి తిక్కరేగడంతో..

ABN , Publish Date - Jun 09 , 2026 | 08:29 AM

హనీమూన్‌కు భర్త తన కుటుంబం మొత్తాన్ని తీసుకురావడంతో భార్యకు చిర్రెత్తుకొచ్చి విడాకులకు సిద్ధమైన ఘటన యూపీలో తాజాగా వెలుగు చూసింది.

హనీమూన్‌కు భర్తతో పాటు అత్తమామలు! యువతికి తిక్కరేగడంతో..
Meerut divorce case

ఇంటర్నెట్ డెస్క్: హనీమూన్‌కు భర్త తన తల్లిదండ్రులను కూడా తీసుకురావడంతో ఒక యువతికి చిర్రెత్తుకొచ్చి చివరకు విడాకులకు సిద్ధమైంది. మీరట్‌లో (యూపీ) ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. యువ జంట బంధం తెగిపోకుండా ఉండేందుకు ఫ్యామిలీ కౌన్సిలర్ చివరి ప్రయత్నం చేస్తున్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, మీరట్‌ జిల్లా రామ్‌రాజ్ ప్రాంతానికి చెందిన యువతికి ఢిల్లీలోని పటేల్‌ నగర్‌కు చెందిన ఒక యువకుడితో ఇటీవలే వివాహం జరిగింది. ఓ మాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ సంబంధం కుదిరింది. పెళ్లి తరువాత ఆ జంట హనీమూన్‌కు ప్లాన్ చేసుకుంది. కానీ హనీమూన్‌కు భర్త తన తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని కూడా తీసుకురావడంతో యువతికి చిర్రెత్తుకొచ్చింది. కొత్త జంటలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఉద్దేశించిన హనీమూన్‌కు కుటుంబం మొత్తాన్ని వెంట తీసుకుని వెళ్లడం ఏమిటని యువతి ప్రశ్నించింది. నిత్యం వారంతా తమ వెంటే ఉండటంతో తమకు వ్యక్తిగత సమయమంటూ లేకుండా పోయిందని పేర్కొంది. ఆ అసంతృప్తి చివరకు యువదంపతుల మధ్య గొడవలు సృష్టించింది.


యువకుడు మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే కుటుంబాన్ని వెంట తీసుకెళ్లానని చెప్పాడు. భార్యను అప్‌సెట్ చేసే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని అన్నాడు. ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారి చివరకు ఫ్యామిలీ కౌన్సిలర్ల వద్దకు చేరింది. ఇప్పటికే ఆ జంటతో కౌన్సిలర్ మూడు సార్లు మాట్లాడారు. ఇరువురికీ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారి మధ్య అభిప్రాయాభేదాలు మాత్రం తొలగిపోలేదు. చివరకు విడాకులు అంశంకూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి బంధం తెగిపోకుండా కౌన్సిలర్ చివరి ప్రయత్నం ప్రారంభించారు.


ఈ వార్తలనూ చదవండి:

భయానక దృశ్యం.. ఇంటి వాటర్ ట్యాంకులో 27 పాములు

గ్యాస్ సిలిండర్ ఎలా మారిందో చూడండి.. వైరల్ వీడియోను షేర్ చేసిన అఖిలేష్ యాదవ్..

Updated Date - Jun 09 , 2026 | 08:45 AM