Share News

జోన్‌, సర్కిల్‌ అధికారులకు ఫుల్‌ పవర్స్‌!

ABN , Publish Date - Jun 09 , 2026 | 09:13 AM

వేగంగా పూర్తి కావడానికి, నిధుల కోసం కార్పొరేట్‌ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలకు ఫుల్‌ పవర్స్‌ వచ్చాయి.

జోన్‌, సర్కిల్‌ అధికారులకు ఫుల్‌ పవర్స్‌!
Southern DISCOM, Telangana

  • చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలకు నిధుల మంజూరులో పరిమితి పెంపు

  • దక్షిణ డిస్కం నిర్ణయంతో అభివృద్ధి పనుల్లో వేగం

హైదరాబాద్‌ సిటీ: దక్షిణ డిస్కం క్షేత్ర స్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులు వేగంగా పూర్తి కావడానికి, నిధుల కోసం కార్పొరేట్‌ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలకు ఫుల్‌ పవర్స్‌ వచ్చాయి. 33 కేవీ హెచ్‌టీ సర్వీస్‌ ఆటో ఎస్టిమేషన్‌, అగ్రిమెంట్‌, రిలీజ్‌ పనులన్నీ జోన్‌ స్థాయిలో చీఫ్‌ ఇంజనీర్‌ పూర్తి చేసేందుకు దక్షిణ డిస్కం సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీచేశారు. 11 కేవీహెచ్‌ సర్వీసుల ఎస్టిమేట్స్‌ను సాంక్షన్‌ చేసే అధికారం సర్కిళ్ల ఎస్‌ఈలకు కల్పించారు.


విద్యుత్‌ లైన్ల విభజన, కొత్తలైన్లు, కెపాసిటర్‌ బ్యాంక్స్‌, వీసీబీ పనులు చేపట్టేందుకు డివిజన్‌ స్థాయిలో డివిజనల్‌ ఇంజనీర్లకు రూ.3 లక్షల పరిమితిని రూ. 10 లక్షలకు పెంచారు. ఎస్‌ఈలకు రూ.10 లక్షల పరిమితిని రూ.50 లక్షలకు, జోన్‌ స్థాయిలో సీఈకి రూ. 20 లక్షల పరిమితిని రూ. 1.50 కోట్లకు పెంచారు. విద్యుత్‌ లైన్లు, స్తంభాలు, డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల పనులకు డీఈలకు రూ. 1.5 లక్షల పరిమితిని రూ. 5 లక్షలకు, ఎస్‌ఈలకు రూ. 5 లక్షల పరిమితిని రూ. 10 లక్షలకు పెంచారు. విద్యుత్‌ లైన్లు మార్చేందుకు డీఈలకు రూ.1 లక్ష పరిమితిని రూ.5 లక్షలకు, ఎస్‌ఈలకు రూ.5 లక్షల పరిమితిని రూ.25 లక్షలకు, సీఈల రూ.10 లక్షల పరిమితిని కోటి రూపాయలకు పెంచారు.


ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు చేపట్టాల్సిన పనులకు గతంలో డీఈకి రూ.1 లక్ష పరిమితి ఉండగా దాన్ని రూ.2 లక్షలకు, ఎస్‌ఈకి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు, సీఈకి రూ. 10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు. సివిల్‌ పనుల్లో ఎస్‌ఈ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు, సీఈ స్థాయిలో రూ.7 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు. ఇంతకుముందు క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా, వాటికి నిధులు కేటాయించాలన్నా కార్పొరేట్‌ కార్యాలయానికి సంబంధిత ఫైల్‌ రావాల్సిన పరిస్థితి ఉండే. ఫైళ్ల క్లియరెన్స్‌కు మూడు, నాలుగు వారాల సమయం పట్టేది.


తాజాగా దక్షిణ డిస్కం నిర్ణయంతో అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. అయితే వినియోగదారులకు అందిస్తున్నసేవల్లో సీఎండీ తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదనే విమర్శలున్నాయి. నెలరోజుల క్రితం నోటరీ డాక్యుమెంట్లతో మీటర్ల జారీ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేని భవనాలకు తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్ల జారీలో పలు సూచనలు చేసినా వాటిని అమలు చేయడం లేదని సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 09:13 AM