నిరసనలతో అట్టుడుకుతున్న పీఓకే.. 11 మంది మృతి
ABN , Publish Date - Jun 09 , 2026 | 07:31 AM
పీఓకే మళ్లీ నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా జేఏఏసీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణల్లో ఇప్పటికే 11 మంది మృతి చెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మళ్లీ నిరసనలతో అట్టుడుకుతోంది. ఇటీవల పోలీసుల కాల్పుల్లో 11 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు. దీంతో, పాక్ పాలకులకు వ్యతిరేకంగా నేడు జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పీఓకే వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది.
పాక్‌లో నివసిస్తున్న కశ్మీర్ శరణార్థులకు పీఓకే అసెంబ్లీలో 12 సీట్లు రిజర్వ్ చేయడాన్ని జేఏఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ స్వతంత్ర ప్రతిపత్తిని అణచివేసేందుకు పాక్ కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌లను తీసుకొచ్చిందని ఆరోపిస్తోంది. పీఓకేను తన నియంత్రణలో పెట్టుకునేందుకు పాక్ అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని మండిపడుతోంది. పీఓకేలో దిగజారుతున్న ఆర్థిక స్థితిగతులు, పరిపాలన అసమర్థత వంటి అంశాలపై కూడా పోరాడుతోంది. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పీఓకేలో ఇవే తరహా నిరసనలు మొదలయ్యాయి. జేఏఏసీపై గతవారమే నిషేధం విధించినా కూడా పాక్ ప్రభుత్వం నిరసనలకు అడ్డుకట్టు వేయలేకపోతోంది.
రిజర్వేషన్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మళ్లీ పీఓకేలో నిరసనలు మొదలయ్యాయి. పీఓకేలోని రావాల్‌కోట్‌లోని ఒక ఆసుపత్రిలో ఉన్న తమ కార్యకర్త మృతదేహాన్ని తీసుకునేందుకు వెళ్లిన జేఏఏసీ నేతలకు, పాక్ దళాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 11 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు, నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు సైన్యాన్ని, పారామిలిటరీ దళాలను కూడా పాక్ రంగంలోకి దించింది. ఈ ఘర్షణల్లో నలుగురు పోలీసు అధికారులు కూడా మరణించారని స్థానిక సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమపై నిషేధం ఉన్నప్పటికీ పోరాటం మాత్రం ఆపేది లేదని జేఏఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు. నేటి బంద్ నేపథ్యంలో పీఓకేలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
పీఓకేలో ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా, ఆస్ట్రేలియాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి. పీఓకేలో రకరకాల ఆంక్షలు ఉంటాయని హెచ్చరించాయి. టెలికం సేవలపై కూడా నిషేధం విధించారని చెప్పాయి. మొబైల్ ఫోన్స్ పనిచేయవని పేర్కొన్నాయి. నిరసనలు మిన్నంటిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని తమ పౌరులను హెచ్చరించాయి.
ఈ వార్తలనూ చదవండి:
హెచ్-1బీ వీసా ఫీజు పెంపు చట్టవిరుద్ధం
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..