అడ్మిషన్ల కోసం ఇంటింటికీ..!
ABN , Publish Date - Jun 09 , 2026 | 07:39 AM
వేసవి సెలవులు మరి కొద్ది రోజుల్లోనే ముగుస్తుండగా, తమ పిల్లలను ‘మా పాఠశాలల్లో చేర్పించాలి అంటే మా పాఠశాలలో’ అని ప్రైవేట్ పాఠశాలలు ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి.
ప్రచారాలతో హోరెత్తిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు
తల్లిదండ్రులను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు
అన్ని వసతులున్న పాఠశాలలకే మొగ్గుచూపాలంటున్న నిపుణులు
హైదరాబాద్: వేసవి సెలవులు మరి కొద్ది రోజుల్లోనే ముగుస్తుండగా, తమ పిల్లలను ‘మా పాఠశాలల్లో చేర్పించాలి అంటే మా పాఠశాలలో’ అని ప్రైవేట్ పాఠశాలలు ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి. దీంతో తమ పిల్లల్ని ఎక్కడ చేర్పిస్తే బాగుంటుందని తికమకపడుతూ తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. ఏ పాఠశాలల్లో చేర్పించాలని విద్యాలయాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలు నూతన శాఖలు కూడా ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నాయి.
తల్లిదండ్రులను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. నిబంధనల ప్రకారం కొత్త పాఠశాలలు ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి.. ప్రాథమిక పాఠశాలలకు జిల్లాశాఖ విద్యాధికారి అనుమతి తప్పనిసరి. ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజినల్ డైరక్టర్ (ఆర్జేడీ) ద్వారా విద్యాశాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సీబీఎ్‌ససీ బోధన కోసం కేంద్ర విద్యామండలి సమ్మతించాలి.
రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోదు..
విద్యాశాఖ అనుమతి తప్పనిసరి ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొందాలి. చాలా విద్యా సంస్థలు బోర్డులు ప్రకటనలు పరిశీలిస్తే రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోదు. గుర్తింపు పొందిన పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి. చాలా చోట్ల పాఠశాల యాజమాన్యాలు అనుమతులు తీసుకోకుండానే ఇతర విద్యాసంస్థల తరపున పరీక్షలు రాయుస్తుంటారు. అలా ఎవరైతే పరీక్షలు రాస్తారో వారిని ప్రభుత్వం ప్రైవేట్ విద్యార్థులుగా పరిగణిస్తారు. మరి కొన్ని విద్యాసంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలు, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచ్ ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. ప్రభుత్వ అనుమతిలేని పాఠశాలలో చేర్పిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అనుమతులు తప్పనిసరి
ప్రతి ఏడాది విద్యా సంవత్సరానికి ఆ విద్యా సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ప్రైవేట్ పాఠశాలలు ప్రతీ సంవత్సరం విద్యాశాఖ కమిషనర్ అనుమతులు తప్పక తీసుకోవాలి. ఆయా పాఠశాలలు తప్పనిసరిగా పాఠశాల అనుమతులు రెన్యువల్ చేసుకోవాలి.
రవీందర్‌రాజు, ఎంఈవో, కూకట్‌పల్లి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
తొలుత పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి..
ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత సర్టిఫికెట్ పరిశీలించాలి.
మౌలిక వసతులు చూసుకోవాలి.
మరుగుదొడ్లు, నీటి సదుపాయం తప్పనిసరి.
క్రీడా ప్రాంగణం, ఫిజికల్ ట్రైనర్ ఉన్నారా? లేదా తెలుసుకోవాలి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.
ఉన్నత పాఠశాలకు అయితే సబ్జెక్ట్‌ల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి.
సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణశాఖ సామర్థ్యం పరీక్ష పత్రం ఉందో లేదో తెలుసుకోవాలి. సుక్షితుడైన డ్రైవర్ తప్పనిసరి
గ్రౌండ్‌తో పాటు అంతకన్నా ఎక్కువ అంతస్తులున్న భవనాలకు అగ్నిమాపక పరికరాలు, స్థాయిని బట్టి మంటలను ఆర్పే పూర్త్తిస్థాయి ఏర్పాట్లు ఉండాలి.