Share News

నిర్వహణలో నిర్లక్ష్యం

ABN , Publish Date - Jun 09 , 2026 | 06:22 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్లాంట్‌లో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఎప్పుడైనా.. ఏదైనా జరగవచ్చని ఏడాది కాలంగా ఉద్యోగులు, కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకెళుతూనే ఉన్నారు

నిర్వహణలో నిర్లక్ష్యం

  • ప్రమాదం జరగొచ్చన్న హెచ్చరికలు పెడచెవిన

  • ఉద్యోగులు, కార్మికుల సూచనలు పట్టించుకోని స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం

  • కొంత నిర్వహణ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీలకు

  • అనుభవం లేని సిబ్బందితో ప్రమాదాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్లాంట్‌లో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఎప్పుడైనా.. ఏదైనా జరగవచ్చని ఏడాది కాలంగా ఉద్యోగులు, కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకెళుతూనే ఉన్నారు. అడపాదడపా చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల నష్టం వస్తున్నా కూడా నిర్వహణ లోపాన్ని యాజమాన్యం అంగీకరించడం లేదు. లోపాల్ని సరిదిద్దడానికి చర్యలు తీసుకోలేదు. సిబ్బందిదే నిర్లక్ష్యమంటూ కాలయాపన చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు ల్యాడిల్‌ పేలుడుతో భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. నిజానికి స్టీల్‌ప్లాంటు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముడి పదార్థాలకు నిధులు అందుబాటులో లేక ఉత్పత్తి తగ్గించుకుంది. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 11,500 కోట్లు సాయం చేయడంతో మళ్లీ ఊపిరి పోసుకుంది. అయినా ఉద్యోగులకు జీతం బకాయిలు ఉన్నాయి. ఈ నిధుల లేమి వల్ల ప్లాంటు నిర్వహణను యాజమాన్యం పక్కన పెట్టింది. సముద్ర తీరానున్న స్టీల్‌ ప్లాంటు కావడంతో యంత్ర పరికరాలు అన్నింటికీ ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టాలి. వీటిని గతంలో కాంట్రాక్టు కార్మికులు చేసేవారు. ఇంతకుముందు పనిచేసిన సీఎండీ ఏకే సక్సేనా ఒకేసారి ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేశారు. దాంతో నిర్వహణ పనులు మూలనపడ్డాయి. కొన్ని విభాగాల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. అనుభవం లేనివారిని తక్కువ వేతనాలకు పెట్టడం వల్ల పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.


ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇవీ..

  • 2024 నవంబరు 3న స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)-2లో భారీ ప్రమాదం జరిగింది. విద్యుత్‌ కేబుళ్లలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయి. అక్కడి యంత్ర పరికరాలపై పూర్తి అవగాహన లేని కాంట్రాక్టు సిబ్బంది ఉండడం వల్ల ఏమి చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. దాంతో అత్యంత శక్తివంతమైన కేబుళ్లు కాలిపోయాయి. వీటి పునరుద్ధరణకు రూ. కోట్లు వెచ్చించారు.

  • 4 గతేడాది జనవరి 3న సింటర్‌ ప్లాంటులో ప్రధాన కన్వేయర్‌ (ఎ 1, ఎ 2)లకు చెందిన గ్యాలరీ సరైన నిర్వహణ లేక కూలిపోయింది. ఉక్కు ఉత్పత్తిలో ఇది చాలా కీలకమైన విభాగం. సింటర్‌ ప్లాంట్లకు ముడిపదార్థాలు సరఫరా చేసే కన్వేయర్‌ గ్యాలరీ 80 అడుగుల ఎత్తున ఉంటుంది. అది కూలిన సమయంలో అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

  • 4 గతేడాది మే 23న స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌(ఎస్‌ఎంఎస్‌)-2లో హైడ్రాలిక్‌ ఆయిల్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. అక్కడ ఉత్పత్తి ఆగిపోయింది. ఆయిల్‌కు బదులుగా గ్యాస్‌ లీకై ఉంటే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. దీనికి వారం రోజుల ముందు 300 టన్నుల లిక్విడ్‌ స్టీల్‌ నేలపాలైంది. నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవడం, ఆపరేషన్లలో వైఫల్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది.


2012 తర్వాత ఇదే పెద్ద ప్రమాదం

విశాఖ స్టీల్‌ ప్లాంటులో 2012 జూన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభించిన సమయంలో అవగాహన లేమి వల్ల చేసిన తప్పిదానికి 13 మంది బలైపోయారు. స్టీల్‌ ప్లాంటులో అతిపెద్ద ప్రమాదం అదే. దాని తరువాత ఇప్పుడు జరిగిందే మరో పెద్ద ప్రమాదం. లిక్విడ్‌ స్టీల్‌ను తీసుకువెళ్లే ల్యాడిళ్లు అప్పుడప్పుడు బ్యాలెన్స్‌ తప్పి పక్కకు ఒరుగుతుంటాయి. అప్పుడు అందులో ఉండే ద్రవపు ఉక్కు కొంత కింద పడుతుంది. అలాగే ఒక్కోసారి ల్యాడిల్‌కు రంధ్రం పడి కొంత లిక్విడ్‌ స్టీల్‌ కింద పడుతుంది. ఆ సమయంలో కార్మికులు అప్రమత్తమై దూరంగా వెళ్లిపోతారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగినా ఎప్పుడూ ప్రాణనష్టం సంభవించలేదు. ఈసారి అలా కాకుండా ఏకంగా ల్యాడిల్‌ పెద్దఎత్తున పేలిపోయింది. 12 అడుగుల ఎత్తు, పది అడుగుల వ్యాసార్థం కలిగిన ల్యాడిల్‌లో 1,500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించిన 150 టన్నుల ఉక్కు ద్రవం ఉంటుంది. అది పేలి 25 అడుగుల వరకు చెదిరి పడింది. అంత వేడి ద్రవం మీదపడడంతో సిబ్బంది మంటల్లో కాలిపోయారు.

Updated Date - Jun 09 , 2026 | 06:23 AM