Share News

టెక్ విద్యకు తగ్గిన క్రేజ్..

ABN , Publish Date - Aug 18 , 2026 | 01:25 PM

ఒకప్పుడు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీలో సీట్ల కోసం తీవ్ర పోటీ ఉండేది. ఈ కాలేజీల్లో ప్రవేశం దక్కించుకోవడం ఎంతో ప్రతిష్ఠగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.

టెక్ విద్యకు తగ్గిన క్రేజ్..
Warangal engineering colleges

  • ఉమ్మడి జిల్లాలో భారీగా మిగిలిన కన్వీనర్‌ కోటా ఇంజనీరింగ్‌ సీట్లు

  • కళాశాలల్లో ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ కొరతే ప్రధాన కారణం

  • హైదరాబాద్‌ వైపు మొగ్గుచూపుతున్న విద్యార్థులు

  • ఓరుగల్లులో మూడు ప్రభుత్వ, 10 ప్రైవేటు కాలేజీలు

  • తుది విడత కౌన్సిలింగ్‌ తరువాత 2,173 సీట్లు మిగులు

  • అత్యధికంగా సీఎస్‌ఈ, దాని అనుబంధ కోర్సుల్లోనే ఖాళీలు

  • మహబూబాబాద్‌ జేఎన్‌టీయూలో సగానికి పైగా సీట్లకు విద్యార్థుల కొరత

  • కేయూలో సీట్లు ఫుల్‌.. ఉమెన్స్‌లో ఈఈఈ, ఐటీ కోర్సుల్లో భారీగా సీట్లు ఖాళీ

  • ఎస్‌ఆర్‌, కిట్స్‌ మినహా ప్రైవేటు కాలేజీల్లో భారీగా మిగిలిన సీట్లు

  • (ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

ఒకప్పుడు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీలో సీట్ల కోసం తీవ్ర పోటీ ఉండేది. ఈ కాలేజీల్లో ప్రవేశం దక్కించుకోవడం ఎంతో ప్రతిష్ఠగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలోనే తుది విడత కౌన్సిలింగ్‌ అనంతరం 2,173సీట్లకు పైగా ఖాళీగా మిగిలాయి. అత్యధిక ఖాళీలు సీఎస్‌ఈ, దాని అనుబంధ కోర్సుల్లోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది.


కేయూ కో-ఎడ్యుకేషన్‌ కాలేజీలో దాదాపుగా సీట్లు భర్తీ కాగా, ఉమెన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఐటీ, ఈఈఈ కోర్సుల్లో భారీగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. మహబూబాబాద్‌ జేఎన్‌టీయూలో సగానికి పైగా సీట్లకు విద్యార్థులు లేరు. మరోవైపు ఎస్‌ఆర్‌, కిట్స్‌ మినహా ఇతర ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పెద్దఎత్తున సీట్లు మిగిలిపోయాయి. నాణ్యమైన ల్యాబ్‌లు, అనుభవజ్ఞు లైన అధ్యాపకులు, మెరుగైన ప్ల్లేస్‌మెంట్ల కోసం విద్యార్థులు హైదరాబాద్‌లోని ప్రముఖ కళాశాలల వైపు మొగ్గుచూపటంతో ఓరుగల్లులో ఇంజనీరింగ్‌ విద్యకు క్రేజ్‌ తగ్గిందనే టాక్‌ వినబడుతోంది.


13 కాలేజీలు

సాంకేతిక విద్యకు ఓరుగల్లు కేంద్రంగా నిలుస్తోంది. దేశంలో ప్రతిష్టాత్మక ఇం జనీరింగ్‌ కాలేజీ ఎన్‌ఐటీ వరంగల్‌లోనే ఉంది. ఈ కళాశాలలో జేఈఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్‌ అధారంగా సీట్లు భర్తీ చేస్తారు. నిట్‌ మినహా రాష్ట్ర ప్రభుత్వం ఎప్‌సెట్‌ ర్యాంకుల ద్వారా ఇంజనీరింగ్‌ సీట్లను భర్తీ చేసే కాలేజీలు కూడా వరంగల్‌లో 13 వరకు ఉన్నాయి. వీటిలో కాకతీయ యూనివర్సిటీలోని కేయూ కో-ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రముఖమైంది. అలాగే 2013లో కేయూలో మ హిళ ఇంజనీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేశారు. వీటితో పాటు 2023లో మహబూబాబాద్‌లో జేఎన్‌టీయూ బ్రాంచ్‌ ప్రారంభమైంది.


ఈ మూడు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ, కిట్స్‌ వంటి ప్రముఖ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. ఇవేకాకుండా వాగ్దేవి, సుమతిరెడ్డి, బిట్స్‌, జయముఖి, విట్స్‌, తాళ్ల పద్మావతి , జనగామలో క్రీస్తుజ్యోతి తదితర ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. హైదరాబాద్‌ తరువాత ఎక్కువ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. ప్రతి ఏటా 10వేల మందికి పైగా ఇంజనీరింగ్‌ పట్టభద్రులు ఇక్కడి నుంచి బయటకు వస్తున్నారు.


భారీగా సీట్లు ఖాళీ..

ఇంజనీరింగ్‌ కోర్సుకు భారీగా డిమాండ్‌ ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు,మూడు మినహా మిగత కాలేజీల్లో సీట్లు భర్తీ కావటం లేదు. ఈ నెల 7వ తేదీన ఫైనల్‌ ఫేస్‌ సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. ప్రస్తుతం స్పాట్‌ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నారు. మొత్తం 13 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సుమారు ఐదు వేల సీట్లు ఉండగా, ఫైనల్‌ ఫేస్‌ పూర్తయ్యాక 2,173సీట్లు మిగిలే ఉన్నాయి. వీటిలో ప్రతిష్టాత్మక జేఎన్‌టీయూకు అనుబంధంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో 2023లో ప్రారంభించిన ఇంజనీరింగ్‌ కాలేజీలో సగం సీట్లు కూడా భర్తీ కాకపోవటం హాట్‌టాపిక్‌గా మారింది.


hnk4.jpgసీఎస్‌ఈతో పాటు సీఎస్‌ఈ డేటాసైన్స్‌, ఈసీఈ, ఈఈఈ, ఎంఈసీ కోర్సులు ఉన్నాయి. ప్రతీ కోర్సులో కన్వీనర్‌ కోటాలో 66సీట్ల చొప్పున మొత్తం 330 సీట్లు ఉండగా, 60 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా దాదాపు 270 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. సీఎస్‌ఈ మాత్రమే 26 సీట్లు భర్తీ కాగా, మిగతా కోర్సుల్లో 10-15మంది మాత్రమే జాయిన్‌ అయ్యారు. మెకానికల్‌లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడటం లేదని స్పష్టమవుతోంది.


అలాగే కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న మహిళ ఇంజనీరింగ్‌ కాలేజీలో సీఎస్‌ఈ, సీఎస్‌ఈ ఏఐ ఎంఎల్‌ కోర్సులో దాదాపు సీట్లు భర్తీ కాగా, డేటా సైన్స్‌లో 16 ఖాళీలు ఉన్నాయి. ఇక ఈసీఈలో 11, ఈఈఈలో 45, ఐటీలో 43 వరకు సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ఇక కేయూలోని కో-ఎడ్యుకే షన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మాత్రం దాదాపు సీట్లన్ని భర్తీ అయ్యాయి. ఎంఈసీలో 7, సివిల్‌లో 4, ఐటీలో 2 సీట్లు ఆయా కేటగిరిలో విద్యార్థులు లేకపోవటంతో ఖాళీగా ఉన్నాయి. మూడు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కేయూకే ఎక్కువ డిమాండ్‌ ఉంది.


ఇక ప్రైవేటులోనూ మరీ దారుణంగా సీట్లు మిగిలి పోయాయి. ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ, కిట్స్‌, సుమతిరెడ్డి ఇంజనీ రింగ్‌ కాలేజీల్లో పెద్దగా సీట్లు మిగలలేదు. కానీ మిగతా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఒక కాలేజీలో 600 సీట్లు, మరో కాలేజీలో 467సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ కాలేజీల్లో సీఎస్‌ఈ, ఏఐ ఎంఎల్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌ వంటి కోర్సులతో పాటు సంప్రదాయ కోర్సులు ఈఈఈ, ఈసీఈ, మోకానికల్‌ ఇంజనీరింగ్‌ వంటి కోర్‌ కోర్సులకు కూడా ఆదరణ లేకుండా పోయింది.


ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ కొరతే కారణమా..?

ఉమ్మడి జిల్లాలో 13కు పైగా ఇంజనీరింగ్‌ కాలేజీలుంటే దాదాపు 40శాతం సీట్లు మిగలడం చర్చనీయాంశంగా మారింది. ఈఈఈ, ఈసీఈ, ఎంఈసీ తదితర కోర్‌ కోర్సులకు ల్యాబ్‌లు ప్రధానం. అయితే రెండుమూడు కాలేజీలు మినహా మిగతా వాటిల్లో ల్యాబ్‌లు అంతంతే ఉండటంతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులు కూడా లేకపోవటం మైనస్‌గా మారిందనే టాక్‌ వినబడుతోంది. యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కూడా ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు అధ్యాపకులే భోదన చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు కాలేజీల్లో అయితే 20-30వేల వేతనానికి అధ్యాపకులు తీసుకుంటున్నారు. దీంతో నాణ్యమైన విద్య అందటం లేదనే భావనలో విద్యార్థుఽల తల్లిదండ్రులు ఉన్నారు. వీటితో పాటు మరో కీలకమైన అంశం ప్లేస్‌మెంట్‌లు.


వరంగల్‌లో ఐటీ ఇండస్ర్టీస్‌లు పెద్దగా లేకపోవటంతో హైదరాబాద్‌ నుంచి పెద్దపెద్ద కంపెనీలు వరంగల్‌కు వచ్చి ప్లేస్‌మెంట్‌లు ఇచ్చే అవకాశాలు లేవు. దీంతో చాలామంది విద్యార్థులు ఆఫ్‌ క్యాంపస్‌పైనే ఆధారపడి ఉద్యోగాలు వెతుక్కొ వలసి వస్తోంది. అదే హైదరాబాద్‌లో అయితే టైర్‌-3 కాలేజీ లో జాయిన్‌ అయినా బీటెక్‌ పూర్తి కాగానే చిన్నపాటి ఉద్యోగం వస్తుందనే భరోసా చాలామంది విద్యార్థులు హైదరాబాద్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చినప్పటికి ట్యూషన్‌ ఫీజుతో పాటు హాస్టల్‌ ఫీజులు, ఇతర ఖర్చులతో తడిసిమోపెడు అవుతున్నాయి. అయినప్పటికీ కొందరు సాహసం చేసి విద్యార్థులను హైదరాబాద్‌లో పేరున్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేర్పిస్తున్నారు.


యాజమాన్య కోటాకు బీటలే..

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 70శాతం కన్వీనర్‌ కోటాలో ప్రభుత్వం సీట్లను భర్తీ చేస్తుండగా, మిగతా 30శాతం సీట్లను యాజమాన్యం కోటా కింద భర్తీ చేస్తారు. ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తిగా ఫీజు చెల్లిస్తుంది. పదివేలకు పైగా ర్యాంకు వచ్చిన విద్యార్థులకు రూ.35వేల ఫీజురీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తుంది. అయితే రెండుమూడు కాలేజీలు మినహా మిగతా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు భర్తీకి నోచుకునే పరిస్థితి కనిపించటం లేదు. కన్వీనర్‌ కోటాలోనే చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. దీంతో యాజమాన్యం కోటాలో చేరటం కష్టమనే టాక్‌ వినబడుతోంది.


అయితే ఒకటిరెండు కాలేజీల్లో మాత్రం యాజమాన్య కోటాకు భారీగా డిమాండ్‌ ఉందనే టాక్‌ ఉంది. డోనేషన్‌ల రూపంలో సీటుకు రూ.3 లక్షల వరకు వసూళ్లు చేస్తుండగా, మరో ఇంజనీరింగ్‌ కాలేజీలో మాత్రం ఇంటర్‌ మార్కుల ఆధారంగా ఫీజులను పెంచుతూ డోనేషన్‌ను పరోక్షంగా వసూళ్లు చేస్తున్నారనే టాక్‌ వినబడుతుంది. మరో ఇంజనీరింగ్‌ కాలేజీలో మాత్రం డోనేషన్‌ను రూ.లక్ష వరకు వసూళ్లు చేస్తున్నారు. రెండుమూడు కాలేజీల్లో మాత్రమే సీట్లకు డిమాండ్‌ ఉండగా, చాలా కాలేజీలు విద్యార్థులు లేక వెలవెలపోతున్నాయి. కన్వీనర్‌ కోటాలోనే సీట్లు మిగిలిపోతుండటంతో ఇక యాజమాన్య కోటాలో చేరేవారు లేకుండాపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

కూరగాయలు కాదు.. కాలకూట విషం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 01:25 PM