జన గణనకు వేళాయే..
ABN , Publish Date - Mar 04 , 2026 | 09:30 AM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన గణనకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాద్, మలుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల యంత్రాంగాలు నిమగ్నమయ్యాయి.
మొదలైన సన్నాహాలు
రెండు విడతలుగా ప్రక్రియ
ఈ యేడు గృహాల గుర్తింపు
వచ్చే ఏడు ఫిబ్రవరిలో జనాభా లెక్కింపు
జిల్లా మండల స్థాయిలో కమిటీలు
ఎన్యుమరేటర్ల నియామకానికి కసరత్తు
జిల్లా స్థాయిలో శిక్షణకు ఏర్పాట్లు
రెవెన్యూ, ప్లానింగ్, గణాంక శాఖ అధికారులతో కలెక్టర్ల సమావేశం
హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన గణనకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాద్, మలుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల యంత్రాంగాలు నిమగ్నమయ్యాయి. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, పర్యవేక్షణ అధికారుల నియామకం, సమకూర్చు కోవలసిన సామగ్రి తదితర అంశాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే సిబ్బంది నియామకం, గ్రామాలవారీగా మ్యాప్‌లు తదితర వాటిపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇది దేశంలో పూర్తిగా డిజిటల్ పద్థతిలో జరిగే తొలి జనాభా గణన కావడంతో జిల్లా యంత్రాంగాలు సమగ్ర సన్నాహాలు ప్రారంభించాయి. డిజిటల్ గణనలలో మురికివాడలు, మారుమూల ప్రాంతాలన్నీ కవర్ చేస్తారు. ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా డబుల్ ఎంట్రీలు ఉండకుండా చూస్తారు.
రెండు విడతలుగా గణన
దేశవ్యాప్తంగా జన గణనకు కేంద్ర హోంశాఖ గత సంవత్సరం జూన్‌లోనే గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2027 మార్చి 1 నాటికి రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నారు. తొలి దశలో ఇళ్ల జాబితాను వెలువరించి రెండో దశలో జన గణన చేపడతారు. సాధారణంగా పదేళ్లకోసారి జనాభా లెక్కలు సేకరించాలి. చివరిసారిగా 2011లో జన గణనను నిర్వహించారు. ఆ తర్వాత 2021 లెక్కించాల్సి ఉండగా, 2020లో కొవిడ్ మహమ్మారితో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా 16వ జన గణనకు రంగం సిద్ధమైంది. జనగణనతో పాటు ఈ సారి కుల గణన, జాతీయ పౌర పట్టిక (నేషనల్ సివిల్ రిజిస్టర్) ఒకేసారి చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గృహాల గుర్తింపు
ఈ యేడు ఎన్యుమరేటర్లు తొలుత గృహాల గుర్తింపు (హౌస్ లిస్టింగ్) ప్రక్రియ చేపడతారు. అనంతరం రెవెన్యూ, మునిసిపల్, గ్రామ పంచాయతీ, ప్రణాళికశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో సరిపోల్చుతారు. 2027 ఫిబ్రవరిలో ఇంటింటికీ వెళ్లి జన గణన నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28 తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు జన్మించిన వారి వివరాలను నమోదు చేస్తారు. మార్చి 1కి జనగణన ప్రక్రియ ముగుస్తుంది. గణకులుగా నియమితులయ్యే ఉపాధ్యాయులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సారి మొబైల్ యాప్‌లో జనాభా వివరాలు నమోదు చేస్తారు. ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి రెండు దఫాలుగా వెళతారు. మొదటిసారి ఇళ్లను లెక్కిండంతో పాటు కుటుంబ స్థితిగతులు, ఆస్తులు, ఆదాయం, వసతులు వంటి అంశాలను సేకరిస్తారు. రెండో దశలో జనాభా వివరాలు సేకరించేందుకు ఇంటింటికీ వెళతారు. కుల, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమాచారం సేకరిస్తారు.
భవిష్యత్తు ప్రయోజనాలపై దృష్టి
పట్టణీకరణకు (అవుట్ గ్రోత్) అనువైన ప్రాంతాలు గుర్తించాలని ఇటీవల జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పట్టణాలకు సమీపంలో ఉంటూ భవిష్యత్తులో విస్తరణకు నోచుకునేవి, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు సహా మేజర్ గ్రామ పంచాయతీల సమీపంలో విస్తరించేందుకు అనువైన ప్రాంతాలు, రైల్వే కాలనీలు, విశ్వవిద్యాలయ ప్రాంగణాలు, ఓడరేవు ప్రాంతాలు, సైనిక శిబిరాలు, భౌగోళిక విస్తీర్ణం తదితరాలను ఈ జన గణన సందర్భంగా గుర్తిస్తారు. జనాభా లెక్కల ప్రయోజనం కోసం అలాంటి ప్రాంతాలను పట్టణ వ్యాప్తిలో భాగంగా పరిగణిస్తారు. ఈ వివరాల సేకరణకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లకు లేఖలు కలెక్టర్లు లేఖలు రాశారు.
అధికారులకు బాధ్యతలు
కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీఆర్‌వో, సీపీవో సహా రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరో అధికారితో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దార్ జన గణన అధికారిగా వ్యవహరిస్తే, ఏఎస్‌వో (అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్) సహాయకుడిగా పని చేస్తారు. గణకులు (ఎన్యుమరేటర్లు)గా ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తారు. ఐదారుగురు గణకులకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. వీరికి జిల్లా పరిధిలోనే వివిధ స్థాయిల్లో ఇస్తారు. ఉన్నత స్థాయి కమిటీలకు హైదరాబాద్‌లో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక ప్రభుత్వం ఇచ్చే ప్రశ్నావళి ఆధారంగా జన గణన చేపడతారు.
2011 జనాభా లెక్కల ప్రకారం
2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా మొత్తం జనాభా 35,12,576. ఇందులో పురుషులు 17,59,281. స్త్రీలు 17,53,295 మంది. ఉమ్మడి జిల్లా టౌగోళిక విస్తీర్ణం 12,846 చదరపు కిలోమీటర్లు. ప్రధాన మతాలు హిందూ (93.20 శాతం), ముస్లిం (5.62 శాతం) అక్షరాస్యత రేటు 65.11 శాతంగా నమోదైంది. వీరిలో 74.58 శాతం పురుషులు. 55.69 శాతం స్త్రీలు. మొత్తం గృహాలు 8,88,553. పట్టణ జనాభా 28.25 శాతం, గ్రామీణ జనాభా 71.75శాతం. జన సాంధ్రత ప్రతీ చదరపు కిలీమీటర్‌కు 273 మంది. జిల్లాలో లింగ నిష్పత్తి ప్రతీ 1000 మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు.
పదాహారేళ్లలో..
పదహారేళ్లలో ఉమ్మడి జిల్లాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. జనాభా పెరిగింది. 2011లో 35,12,576 ఉండగా 2026లో 38,40,000లకు పెరిగింది. అంతకుముందు 2001లో అప్పటి జనాభా లెక్కల ప్రకారం 32,46,004 మంది ఉన్నారు. 2011 తర్వాత ఉమ్మడి జిల్లాలో పట్టణాలు విస్తరించాయి. లింగ నిష్పత్తిలో వ్యత్యాసం ఏర్పడింది. అక్షరాస్యతా శాతం పెరిగింది. గ్రామ పంచాయతీలు 1646 నుంచి 1708కి, మునిసిపాలిటీలు 9 నుంచి 13కు మండలాలు 68 నుంచి 72కు పెరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News