Share News

భూ భారతి ఆపరేటర్లకు వేతన కష్టాలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:23 AM

రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి పోర్టల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు(ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌) 15 నెలలుగా వేతనాలు లేవు.

భూ భారతి ఆపరేటర్లకు వేతన కష్టాలు
Bhu Bharati Operators

  • 15 నెలలవుతున్నా రాని వేతనాలు

  • రూ.17 కోట్ల మేర బకాయిలు

  • ఎంత వేడుకున్నా స్పందించని అధికారులు

  • పాత ఏజెన్సీ రద్దు.. టీజీటీఎ్‌సలోకి బదిలీ

  • ఇప్పటి వరకు జారీ కాని రెన్యూవల్‌ ఉత్తర్వులు

హనుమకొండ: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి పోర్టల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు(ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌) 15 నెలలుగా వేతనాలు లేవు. జిల్లా కేంద్రంగా కలెక్టర్‌ కార్యాలయాల్లో, మండల కేంద్రంగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో నిత్యం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తూ భూ భారతి సేవలు అందిస్తున్న ఆపరేటర్లకు సకాలంలో వేతనాలు అందకపోడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలనెలా ఇంటి ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తున్నదని మనోవేదనకు గురవుతున్నారు.


ప్రభుత్వం తమను క్రమబద్ధీకరిస్తామని చెప్పి మాట తప్పడమే కాకుండా కనీసం వేతనాలను కూడా నెల నెలా ఇవ్వకపోవడం దారుణమని వాపోతున్నారు. కుటుంబాలను పోషించుకోలేక నిత్యం సతమతమవుతున్నామంటున్నారు. కనీసం కార్యాలయాలకు రావడానికి ప్రయాణ డబ్బులు సైతం లేక ఇబ్బందులు పడుతున్నారు. తమ వేతనాల విషయమై ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువచ్చినా స్పందన లేదంటున్నారు. పాత ఏజెన్సీని రద్దు చేసి దాని పరిధిలో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్లను తెలంగాణ టెక్నికల్‌ సర్వీసెస్‌(టీజీటీఎ్‌స)లోకి మార్చినా ఇప్పటి వరకు రెన్యూవల్‌ ఉత్తర్వులు జారీ కాకపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. సకాలంలో వేతనాలు అందక కొందరు ఉద్యోగాలు మానేసి వేరే దారి చూసుకుంటున్నారు.


15 నెలల నుంచి..

భూ భారతి ఆపరేటర్లకు చివరిసారిగా 2024 జూలై నుంచి 2025 ఫిబ్రవరి వరకు బకాయి ఉన్న వేతనాలను చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత 2025 మార్చి నుంచి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదు. మే నెల కూడా గడిచిపోతోంది. అంటే దాదాపు 15 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు రూ.17 కోట్ల మేర వేతనాలు బకాయి ఉన్నాయి. వేతనాలు చెల్లించాలని భూ భారతి ఆపరేటర్లు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు మొరపెట్టుకోగా ఇది తమ చేతిలో లేదని, సీసీఎల్‌ నుంచే చెల్లింపులు జరుగుతాయని చెప్పి చేతులు దులుపేసుకున్నారు. సీసీఎల్‌కు ఎన్ని వినతులు సమర్పించినా స్పందన లేదని భూ భారతి ఆపరేటర్లు వాపోతున్నారు. మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులకు సైతం మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వెట్టిచాకిరి చేస్తున్నా..

రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్ధేశంతో గత ప్రభుత్వం ధరణి ఆపరేటర్లను 2020 నవంబరులో నియమించింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత వెంటనే కొనుగోలుదారుడికి డిజిటల్‌ సంతకంతో నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా తహసీల్దార్‌, భూ భారతి ఆపరేటర్లే నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనివేళలతో నిమిత్తం లేకుండా వెట్టిచాకిరి చేస్తున్నా ఆపరేటర్ల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడంలో భూ భారతి ఆపరేటర్ల పాత్రే కీలకం. రిజిస్ట్రేషన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొన్న తర్వాత రైతులు మొదట వచ్చేది భూ భారతి ఆపరేటర్ల దగ్గరకే.


hnk1.2.jpgడాక్యుమెంట్లు అన్ని సరిగా ఉన్నాయా? లేవా? అని సరిచూసిన తర్వాత అన్నింటిమీద రైతులతో సంతకాలు తీసుకొని వారిచ్చిన వివరాలన్నీ కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. వేలి ముద్ర, ఫొటో, ఆధార్‌కార్డు నెంబరు తదితర వివరాలు తీసుకొని వాటిని తహసీల్దార్‌కు పంపుతారు. ఆయన పరిశీలించి ఆమోద ముద్ర వేసిన తర్వాత మళ్లీ డాక్యుమెంట్లను ఎండార్స్‌ చేస్తారు. ఈ ఎండార్స్‌మెంట్‌ను స్కాన్‌ చేసి పంపిన తర్వాత తహసీల్దార్‌ ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత ఈ డాక్యుమెంట్లను కంప్యూటర్‌లో సబ్‌మిట్‌ ఆన్‌లైన్‌లో డ్రాఫ్టు వచ్చిన తర్వాత లాగ్‌ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టిస్తారు.


సాధారణంగా జరిగే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అంతా ఆపరేటర్ల చేతుల మీదుగానే జరుగుతుంది. ఇదొక్కటే కాదు.. సర్వేలు, గణన, తదితర అత్యవసర రెవెన్యూ సంబంధిత పనులను కూడా భూ భారతి ఆపరేటర్లు చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఒక్కో ఆపరేటర్‌ ప్రతీ రోజు 15 నుంచి 20, గ్రామీణ ప్రాంతాల్లో 7 నుంచి 8 రిజిస్ట్రేషన్‌ స్లాట్స్‌ను చూడాల్సి ఉంటుంది. పని వేళలతో నిమిత్తం లేకుండా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వెట్టిచాకిరి చేస్తున్నా ఆపరేటర్లకు ప్రభుత్వం వేతనాలు విడదల చేయకపోవడంతో వారు నానా కష్టాలు పడుతున్నారు.


త్రిశంకు స్వర్గంలో..

వీరిని టీజీటీఎ్‌సలోకి తీసుకున్నా వారికి ఇప్పటివరకు రెన్యూవల్‌ ఉత్తర్వులు రాలేదు. దీనితో వారి సర్వీస్‌ రెన్యూవల్‌ అయిందా.. లేదా అనే విషయంలో స్పష్టత లేదు. త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న ఆపరేటర్లు ఈ విషయంలో అయోమయానికి లోనవుతున్నారు. అటు నెల నెలా వేతనాలు రాక, ఇటు తాము రెన్యూవల్‌ అయిందీ లేనిది తెలియక అనిశ్చితి పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అటు ఉద్యోగం పర్మినెంట్‌ కాక, ఇటు కనీసం రెన్యూవల్‌ కాక విసుగు చెంది కొందరు భూ భారతి ఆపరేటర్లు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోతున్నారు.


672 మంది ఆపరేటర్లు

రాష్ట్ర వ్యాప్తంగా 672 మంది భూ భారతి ఆపరేటర్లు ఉన్నారు. ప్రతీ మండలానికి ఒక ఆపరేటర్‌, అలాగే జిల్లాకలెక్టర్‌ కార్యాలయాల్లో జిల్లా కోఆర్డినేటర్‌(డీసీ)గాఒకరు చొప్పు న విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇచ్చే వేతనం కూడా తక్కువే. మొదట్లో నెలకు రూ.11,583 ఇచ్చేవారు. కాంగ్రెస్‌ప్రభుత్వం వచ్చిన తర్వా త 2024 నుంచి రూ.17వేలకు పెంచారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఈ-సెంట్రిక్‌ అనే ఏజెన్సీ ద్వారా నియామకమైన ధరణి ఆపరేటర్లకు అప్పట్లో కూడా వేతనాలు సరిగా అందేవి కావు. ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి వేతనాలు చెల్లించేవారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌లో కొద్ది పాటి మార్పులు చేసి భూ భారతిగా నామకరణం చేసి పాత ఆపరేటర్లనే కొనసాగిస్తోంది. అయితే పాత ఏజెన్సీని తొలగించి ఆ స్థానే ఆపరేటర్లందరినీ తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్‌ సర్వీసెస్‌(టీజీటీఎస్)లోకి మార్చింది.


ఈ వార్తలు కూడా చదవండి:

రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరి మృతి

గర్భిణులకు హై బీపీ ముప్పు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 10:23 AM