రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం!
ABN , Publish Date - Jun 26 , 2026 | 09:40 AM
AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్నం, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతమైన మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
1989 నాటి స్థలం.. నకిలీ పత్రాలతో మాయాజాలం!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 1989లోనే విశాఖ మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దీని ధర రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. అయితే, ఈ విలువైన స్థలంపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు.. రఘురామకృష్ణంరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించారు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు స్థలాన్ని పలుమార్లు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ (రిజిస్ట్రేషన్) కూడా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వెలుగులోకి వచ్చిందిలా..
ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో కొందరు వ్యక్తులు ఆ స్థలంలోకి చొరబడి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న రఘురామకృష్ణంరాజు స్నేహితుడు ఈ విషయాన్ని గమనించి, తక్షణమే ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అలర్ట్ అయిన రఘురామకృష్ణంరాజు.. తన వద్ద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లను, సదరు వ్యక్తులు చూపిస్తున్న కాగితాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. తన సంతకాన్ని పక్కాగా ఫోర్జరీ చేసి, నకిలీ రిజిస్ట్రేషన్లతో భూమిని కాజేయాలని చూసినట్లు ఆయన గుర్తించారు.
రంగంలోకి పోలీసులు.. కేసు నమోదు
తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారితో పాటు, ఈ ఫోర్జరీ వెనుక ఉన్న దోషులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు ప్రతినిధులు పీఎంపాలెం పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పీఎంపాలెం పోలీసులు జూన్ 20న కేసు నమోదు చేశారు. సదరు నకిలీ రిజిస్ట్రేషన్లు ఎక్కడ జరిగాయి? దీని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పూర్తి భద్రత ప్రమాణాలతో సంగం ఉత్పత్తులు
సైబర్ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్‌ఐఆర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News