సైబర్ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్‌ఐఆర్
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:17 AM
సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఇకపై రాష్ట్రంలో ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ విధానం అమల్లోకి రానుంది.
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఇకపై రాష్ట్రంలో ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ విధానం అమల్లోకి రానుంది. దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వెంటనే నమోదయ్యేలా ఈ- జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమలుచేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నివారణ, బాధితులకు సత్వర సహాయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు డీజీపీ తెలిపారు. డిజిటల్ అరెస్టు పేరిట ఎవరు బెదిరించినా ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు చెల్లించవద్దని, 1930 నెంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.