పూర్తి భద్రత ప్రమాణాలతో సంగం ఉత్పత్తులు
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:32 AM
తమ కంపెనీ పెరుగు ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక పిల్ల ఉందంటూ సోమవారం వచ్చిన వార్తలను సంగం డెయిరీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.
వినియోగదారుడి నివాసంలోనే పెరుగు ప్యాకెట్‌లోకి ఎలుక
డెయిరీ యాజమాన్యం స్పష్టీకరణ
కరీమాబాద్(వరంగల్), జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తమ కంపెనీ పెరుగు ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక పిల్ల ఉందంటూ సోమవారం వచ్చిన వార్తలను సంగం డెయిరీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తెలంగాణలోని వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్ తోట ప్రాంతంలోని ఓ షాపులో తాను కొన్న పెరుగు ప్యాకెట్‌లో ఎలుక పిల్ల వచ్చిందంటూ రఘునందన్ అనే వ్యక్తి ఆదివారం ఫిర్యాదు చేయగా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పెరుగు ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ప్రచురితమైన వార్తలకు సంగం డెయిరీ యాజమాన్యం వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థలో పాలను సేకరించే దగ్గర నుంచి, ప్యాకింగ్ చేసే వరకు అత్యాధునిక ఆటోమేటిక్ ఫిల్ట్రేషన్ విధానాలు ఉన్నాయని, తమది ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన డెయిరీ అని, అంతేకాకుండా పూర్తి ఆహార భద్రత, ప్రమాణాలను (ఫుడ్ సేఫ్టీ పారామీటర్స్) పాటిస్తున్నందున సంస్థలో ప్యాక్ చేసిన ఉత్పత్తుల్లోకి ఎలుక వెళ్లడమనేది అసాధ్యమని స్పష్టం చేసింది. వినియోగదారుడి నివాసంలోనే ఆ ప్యాకెట్‌లోకి ఎలుక చేరినట్టు స్పష్టమవుతోందని తెలిపింది. తమ బ్రాండ్ ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొంత మంది వ్యక్తులు, సంస్థలు చేసిన కుట్రగా దీనిని భావిస్తున్నట్లు పేర్కొంది. తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంగం యాజమాన్యం హెచ్చరించింది.