బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణను దోపిడీ చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:34 PM
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం 18 గంటలు పనిచేస్తుంటే... బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఏదో ఒక అభాండం వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సన్నబియ్యం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
జనగామ, జూన్ 9: ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం 18 గంటలు పనిచేస్తుంటే.. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఏదో ఒక అభాండం వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు జిల్లాలోని చిల్పూర్ మండలం పల్లగుట్టలో పర్యటించిన భట్టి.. 33/11kv సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సన్నబియ్యం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే అంతా ఖాళీ చేసిపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు. పేదలకు చెందాల్సిన సొమ్మును బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమం ఆపడం లేదని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 76 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్పోరేట్ శక్తుల దయాదక్షిణ్యాల కోసం రైతులు ఎదురు చూసేలా కేంద్రం చేస్తోందని విమర్శించారు. ఏ రాష్ట్రంలోనూ వడ్ల కొనుగోళ్లు జరగడం లేదన్నారు. తాము మొక్కజొన్నలు కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చింది కానీ డిస్కమ్‌లకు డబ్బులు చెల్లించలేదన్నారు. కానీ ఇప్పుడు డిస్కమ్‌లకు డబ్బులు చెల్లిస్తున్నామని అన్నారు.
‘ఎన్నికల సందర్భంగా నేను, సీఎం ఇక్కడి ప్రజలకు హామీలు ఇచ్చాం. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం’ అని భట్టి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వ్యాఖ్యానించారు. దేవాదుల ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు.. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నామన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఒకప్పుడు వలసల ప్రాంతమని.. కానీ ఇప్పుడు అభివృద్ధి జరుగుతోందన్నారు. రఘునాథపల్లిలో 230KV సబ్ స్టేషన్ ఏర్పాటును పరిశీలిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్ గచ్చిబౌలి చోరీ కేసులో నేపాలీ దంపతుల అరెస్ట్
గంజాయి పార్టీపై పోలీసుల దాడి.. ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News