హైదరాబాద్ గచ్చిబౌలి చోరీ కేసులో నేపాలీ దంపతుల అరెస్ట్
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:08 AM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి చోరీ కేసులో నేపాలీ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్-నేపాల్ సరిహద్దు వద్ద ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, జూన్ 9: గచ్చిబౌలి చోరీ కేసులో నేపాలీ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్-నేపాల్ సరిహద్దు వద్ద ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న పారిశ్రామికవేత్త ప్రకాశ్ ఇంట్లో నెల రోజుల క్రితమే నేపాలీ దంపతులు కమలా షాహీ, విమల్ షాహీ పనికి చేరారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలతో దంపతులు పరారయ్యారు. కొద్దిరోజుల క్రితం ముంబై వెళ్లిన పారిశ్రామికవేత్త కుటుంబం ఆదివారం తిరిగి వచ్చింది.
ఇంట్లో నేపాలీ దంపతులు కనిపించకపోవడంతో వెళ్లిపోయారని మొదట భావించారు. అయితే, లాకర్‌లో ఉన్న బంగారం మొత్తం చోరీకి గురైనట్లు గుర్తించిన యజమాని.. గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్, యూపీ, నేపాల్ సరిహద్దుల్లో నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల సహకారంతో యూపీ-నేపాల్ సరిహద్దు వద్ద ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో భారీ చోరీ.. కేజీ బంగారు ఆభరణాల అపహరణ
Read Latest Telangana News And Telugu News