Share News

రాజీనామా చేయాల్సిందే

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:15 AM

నీట్‌, సీబీఎస్ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బాధ్యత వహించాలని ప్రతిపక్ష ఇండీ కూటమి స్పష్టం చేసింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

రాజీనామా చేయాల్సిందే

  • నీట్‌, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు కేంద్ర విద్యా మంత్రి ప్రధాన్‌ బాధ్యత వహించాలి

  • ప్రతిపక్ష ఇండీ కూటమి భేటీలో తీర్మానం

  • దేశంలో సర్‌ పేరిట మోసపూరిత విధానాలు

  • దీనిపై సుప్రీం చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాస్తాం

  • ప్రతిపక్షాల మధ్య ఐక్యత బలోపేతం కావాలి

  • ఆగస్టు 5న హైదరాబాద్‌లో కూటమి భేటీ

  • ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన 22 పార్టీల నేతల సమావేశంలో నిర్ణయాలు

  • ‘కాక్రోచ్‌ పార్టీ’తో కలిసి పనిచేయడంపై చర్చ

  • కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని అంగీకారం!

  • ఐదు అంశాలపై అవగాహనకు వచ్చాం: ఖర్గే

  • అదో ఊహాజనిత కూటమి: బీజేపీ

న్యూఢిల్లీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): నీట్‌, సీబీఎస్ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బాధ్యత వహించాలని ప్రతిపక్ష ఇండీ కూటమి స్పష్టం చేసింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. దేశంలో ఓట్ల దోపిడీ జరుగుతోందని.. సర్‌ ప్రక్రియ పేరిట మోసపూరిత విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించింది. దీనిపై త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని ప్రకటించింది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని, వచ్చే సమావేశాన్ని ఆగస్టు 5న హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆలోచనకు వచ్చింది. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 22 పార్టీల నేతలు సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, దేశ ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యలు, ఇతర అంశాల్లో కేంద్రంపై కలసికట్టుగా దాడి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌, మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, జేఎంఎం నేత సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఎన్సీపీ (పవార్‌ ) నేత సుప్రియా సూలే, సీపీఎం నేత జాన్‌ బ్రిటాస్‌, సీపీఐ నేత డి.రాజా, సీపీఐఎంల్‌ నేత దిపాంకర్‌ భట్టాచార్య, ఆర్‌ఎస్పీ నేత ప్రేమచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ తదితరులు జూమ్‌ ద్వారా పాల్గొన్నారు.


కాగా, ప్రతిపక్ష ఇండి కూటమికి దూరం పాటిస్తున్న డీఎంకే, ఆప్‌ ప్రతినిధులెవరూ హాజరుకాలేదు. కాగా, ఇండి కూటమి భేటీలో ఐదు అంశాలపై అవగాహనకు వచ్చామని సమావేశం అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. సర్‌ ప్రక్రియ, ఓట్ల దోపిడీ, మోసపూరిత ఎన్నికలపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాస్తామని తెలిపారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తును దెబ్బతీసిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపారు.

విభేదాలు, భవిష్యత్తుపైనా చర్చ!

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా కూటమి పక్షాలు వ్యవహరించిన తీరు, విభేదాలు, భవిష్యత్తుపైనా ఇండి కూటమి భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో వామపక్షాలకు బీజేపీతో రాజకీయ అవగాహన ఉందంటూ కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను సీపీఎం నాయకుడు జాన్‌ బ్రిటనాస్‌, సీపీఐ నేత డి.రాజా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇక బెంగాల్‌ ఎన్నికల సమయంలో, ఫలితాల తర్వాత జరుగుతున్న ప్రతీకార చర్యలను మమతా బెనర్జీ వివరించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కూటమిపక్షాలు పరస్పరం కించపర్చుకునేలా విమర్శలు చేసుకోవద్దని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా, కాక్రోచ్‌ జనతా పార్టీతో కలిసి పనిచేద్దామని అఖిలేశ్‌, ఒమర్‌ అబ్దుల్లా ప్రతిపాదించగా..ప్రజాఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని మమత పేర్కొన్నట్టు సమాచారం.

‘ఇండి’లో కొనసాగం: డీఎంకే

ఇకపై తాము ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగం కాబోమని డీఎంకే ప్రకటించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇళంగోవన్‌ సోమవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ.. తాము ఇండియా కూటమికి దూరం కావడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమన్నారు. ఇప్పటికే అనేక పార్టీలు ఇండియా కూటమికి దూరమయ్యాయని, డీఎంకే కూడా అదే మార్గాన్ని ఎంచుకుందని చెప్పారు. మొన్నటివరకూ తమ మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌, వీసీకే కూడా టీవీకే ప్రభుత్వంలో భాగమయ్యాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆప్‌ కూడా ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయిందని, తాము కూడా కూటమిలో లేమని పేర్కొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 05:17 AM