హైదరాబాద్‌లో భారీ చోరీ.. కేజీ బంగారు ఆభరణాల అపహరణ
ABN , Publish Date - Jun 09 , 2026 | 09:59 AM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లో కేజీ బంగారు ఆభరణాలు అపహరించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
హైదరాబాద్, జూన్ 9: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న పారిశ్రామికవేత్త ఇంట్లో కేజీ బంగారు ఆభరణాలు అపహరించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలే పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలతో పరారయ్యారు. లాకర్లలో భద్రపరిచిన మొత్తం బంగారు ఆభరణాలతో నిందితులు ఉడాయించారు. చోరీకి గురైన సొత్తు కోట్లలో ఉంటుందని అంచనా. నెల రోజుల క్రితం నేపాలీ దంపతులను ఇంటి పనులకు నియమించుకున్నట్లు వ్యాపారవేత్త కుటుంబం తెలిపింది.
కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబై వెళ్లగా, ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు కనిపించలేదు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు తమకు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. అయితే, పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు కనిపించకుండా పోవడంతో.. తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా మాయమైనట్లు తేలింది. దీంతో వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను గచ్చిబౌలి పోలీసులు ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్, యూపీ, నేపాల్ బోర్డర్లలో పోలీసులు మోహరించారు.
ఇవి కూడా చదవండి..
నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News And Telugu News