పట్టు సడలిన ఐటీడీఏ పాలన
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:49 AM
ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పాలనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటీకే పలు కీలక శాఖలు నిర్వీర్యం కాగా ఇంకొన్నిటి పట్టు సడలుతోంది.
కీలక పోస్టులన్నీ ఖాళీ
పలువురు అధికారుల బదిలీ
భర్తీకి నోచుకొని ఆ స్థానాలు
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గిరిజనులు
ఏటూరునాగారం(ములుగు): ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పాలనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటీకే పలు కీలక శాఖలు నిర్వీర్యం కాగా ఇంకొన్నిటి పట్టు సడలుతోంది. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కల్ప తరువుగా నిలిచే ఐటీడీఏ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఏళ్ల తరబడి కీలక పోస్టులైన ప్రాజెక్ట్ ఉద్యాన శాఖ, ప్రాజెక్ట్ అగ్రికల్చర్, మత్స్యశాఖ అధివృద్ది అధికారి లాంటి పలు కీలక పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు.
అధికారుల బదిలీలు... పాలనపై ప్రభావం
ఐటీడీఏలో పాలనకు ఆయువు పట్టుగా నిలిచే ఆయా పోస్టుల్లోని అధికారులు బదిలీ అయ్యారు. ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి (ఏపీవో) కుమ్రం నాగోరావు గత నెల 31న ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో తాత్కాలికంగా ఎస్‌డీసీ ప్రతాప్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటీకే ఎస్‌డీసీతోపాటు ములుగు ఆర్డీవోగా అదనపు బాధ్యతలు చేపడుతున్న ప్రతాప్‌కు ఏపీవో బాధ్యతలతో మరింత పనిభారం పడుతోంది. అదేవిధంగా మ రో కీలక పోస్టు అడ్మిస్ట్రేషన్ ఆఫీసర్(ఏవో)లో ఉన్న రాంబాబు రెండేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై భద్రాచలం ఐటీడీఏకు వెళ్లారు.
దీంతో స్టాటిస్టికల్ అధికారి రాజ్‌కుమార్ ఏవోగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఇటీవలే ఆయన కూడా ఉట్నూర్ ఐటీడీఏకు బదిలీ అయ్యారు. ప్రస్తుతానికి ఏవో పోస్టు ఖాళీగానే ఉంది. తాత్కాలికంగా ఆ ఏవో బాధ్యతలను ఐటీడీఏ డిప్యూటీ కలెక్టర్ విభాగంలో డిప్యూటీ తహసీల్ధార్‌గా పనిచేస్తున్న అనిల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన ఆ పోస్టులో డిప్యూటీ తహసీల్ధార్‌ను నియమించడంతోపాటు పనిభారం పడుతోంది. అదేవిధంగా స్టాటిస్టికల్ అధికారి సురేష్‌బాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఐటీడీఏలో ఈ మూడు పోస్టులు అత్యంత కీలకమైనప్పటికీ ఆ స్థానాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించకపోవడం పట్ల గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న దబ్బకట్ల జనార్దన్ డిప్యూటేషన్ ప్రభుత్వం రద్దు చేయగా ఆయన మంచిర్యాల జిల్లా గిరిజనాభివృద్ధి అధికారిగా వెళ్లా రు. ఆయన స్థానంలో నాగర్ కర్నూల్ గిరిజనాభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న ఫిరంగిని ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా అకౌంట్స్ విభాగంతో పాటు ఐటీడీఏ మేనేజర్ పోస్టులకు కూడా పూర్తి స్థాయి అధికారులు లేకుం డా పోయారు. ఆయా పోస్టుల్లో తాత్కాలిక అధికారుల సేవలతో కొనసాగిస్తున్నారు.
ఏజెన్సీలో మరో కీలకమైన డిప్యూటీ డిఎంహెచ్‌వో పోస్టు కూడా ఖాళీగా ఉంది. కొన్నేళ్లుగా పూర్తిస్థాయి అధికారి లేక ఓ పీహెచ్‌సీలో వైదాఽ్యధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా ఐటీడీఏలో ఖాళీ అవుతున్న పోస్టుల్లో పూర్తిస్థాయి అధికారుల నియామకం చేపట్టకుండా ప్రభుత్వం తాత్కాలికంగా అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ చేతులు దులుపుకుంటోంది. ఇప్పటీకే బడ్జెట్ కేటాయింపులు లేక నిర్వీర్యం అవుతున్న ఐటీడీఏకు అధికారులు కూడా లేకుండా పోతుండటంతో పాలన గాడి తప్పుతోంది.
ఐటీడీఏ పీవోగా ఐఏఎస్ అధికారిని నియమించినప్పటికీ కీలకమైన పలు పోస్టుల్లో అధికారులు లేకపోవడం పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఐటీడీఏ పాలనను గాడిన పెట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్టు వ్యవహరిస్తుండటంతో గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఏడేళ్లుగా పాలన మండలి సమావేశాలు జరగకపోవడమే ప్రభుత్వానికి ఐటీడీఏపై చిత్తశుద్ధి లోపించిందనడానికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..
లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా
Read Latest AP News And Telangana News And International News And Telugu News