గ్యాప్-డౌన్ నష్టాల నుంచి లాభాల్లోకి.. ఒడుదొడుకుల్లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:09 AM
ఈ ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తర్వాత అద్భుతమైన రికవరీ సాధించాయి. ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 490 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ, తర్వాత కొనుగోళ్ల మద్దతుతో ముందుకు సాగాయి .
ముంబై, మే 4: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఇవాళ (గురువారం) భారీ నష్టాలతో (Gap-down Open) ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. తర్వాత అద్భుతమైన రీబౌండ్ సాధించాయి. ఉదయం ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 490 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ, తక్కువ స్థాయిల దగ్గర లభించిన బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లాయి.
ఉదయం 10:28 గంటల సమయానికి నిఫ్టీ 50 (Nifty 50) గత ముగింపు (23,405.60) కంటే 23.40 పాయింట్లు (0.10%) లాభపడి 23,429.00 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ (Sensex) గత ముగింపు (74,346.17) నుంచి 123.51 పాయింట్లు (0.17%) పెరిగి 74,469.68 వద్ద కొనసాగుతోంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 97 డాలర్లకు చేరడం కూడా మార్కెట్లపై ఈ ఉదయం ప్రభావం చూపింది. దీంతో మన మార్కెట్లు కూడా ఉదయం 9:15 గంటలకు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిఫ్టీ ఒక దశలో 23,247 స్థాయికి పడిపోయింది.
నిన్నటి ఐటీ రంగ షేర్ల పతనం తర్వాత, ఈరోజు తక్కువ ధరల వద్ద లార్జ్ క్యాప్ షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి హెవీవెయిట్ బ్యాంకింగ్ షేర్లు మార్కెట్‌ను నిలబెట్టాయి. నిఫ్టీ తన కీలక సపోర్ట్ లెవెల్ అయిన 23,200 - 23,250 జోన్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకుని, తిరిగి 23,400 మార్కును అధిగమించగలిగింది. శుక్రవారం (జూన్ 5) రాబోయే ఆర్బీఐ మానిటరీ పాలసీ (RBI MPC) నిర్ణయాల కంటే ముందే మార్కెట్ ఈ రకమైన రికవరీ సాధించడం విశేషం. అయితే, గం. 11 తర్వాత మళ్లీ సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు
యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News